సాక్షి, అమరావతి: పోలవరం పేరుతో టీడీపీ అధికారంలో ఉండగా సాగించిన అక్రమాల చిట్టాలో ఇది మరొకటి. పోలవరం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టెత్తకుండానే కాంట్రాక్టర్‌కు రూ.481 కోట్లకుపైగా చెల్లించేశారు. కాంట్రాక్టు ఒప్పందం చేసుకోగానే నిబంధనలకు విరుద్ధంగా రూ.331.04 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించడం, జలవిద్యుద్పుత్తి కేంద్రం పనుల కోసం 3–డీ నమూనాలో పరిశోధనల పేరుతో రూ.వంద కోట్లు ఇచ్చేయడం గమనార్హం. సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు చేయకున్నా రూ.50 కోట్లు ధారాదత్తం చేయడంపై ఏపీ జెన్‌కో (ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ) వర్గాలే నివ్వెరపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సాగిన ఈ నిర్వాకాల్లో లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే.
కోటరీ కాంట్రాక్టర్‌కు పనులు దక్కేదాకా..
పోలవరానికి అనుబంధంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే విద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ.3,157.93 కోట్లను ఐబీఎం (అంతర్గత అంచనా విలువ)గా నిర్ణయిస్తూ 2017 జనవరి 9వతేదీన ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం)లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు దక్కే అవకాశం లేకపోవడంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు మూడుసార్లు టెండర్లు రద్దు చేయించారు. చివరకు తాము కోరుకున్న కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా చేసి 2017 అక్టోబర్ 11న టెండర్ల ప్రైస్ బిడ్ తెరిపించారు. 4.83 శాతం అధిక ధర (రూ.3,310.46 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా నిలిచిన నవయుగ సంస్థకు జలవిద్యుత్పత్తి కేంద్రం పనులు అప్పగిస్తూ 2017 డిసెంబర్‌లో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం 60 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి.
నిబంధనలు తుంగలోకి..
కాంట్రాక్టు ఒప్పందంలో అంచనా విలువలో పది శాతం (ఐదు శాతం మెటీరియల్‌కు, ఐదు శాతం లేబర్‌కు) మొబిలైజేషన్ అడ్వాన్సుగా కాంట్రాక్టర్‌కు చెల్లించవచ్చు. నిబంధనల ప్రకారం తొలుత అంచనా వ్యయంలో 1 శాతాన్ని సర్వే పనుల కోసం మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించాలి. తర్వాత మెటీరియల్ కోసం రెండు శాతాన్ని ఒకసారి, యంత్రాలు సమీకరించాక మిగతా రెండు శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించాలి. పనులు ప్రారంభించాక లేబర్ కాంపొనెంట్ కింద తొలుత ఒక శాతం, తర్వాత రెండు దఫాలుగా రెండు శాతం చొప్పున మొబిలైజేనేషన్ అడ్వాన్సు చెల్లించాలి. అయితే జెన్‌కో అధికారులు పనుల వ్యయంలో పది శాతం అంటే రూ.331.04 కోట్లను కాంట్రాక్టర్‌కు చెల్లించేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు బడా‘బాబు’ జేబులోకి చేరాయని, అందుకే నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని జెన్‌కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
డబ్బుల్ ధమాకా..
పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను నవయుగ దక్కించుకున్నాకే అదే సంస్థకు హెడ్ వర్క్స్ పనులను చంద్రబాబు కట్టబెట్టారు. వాస్తవంగా పోలవరం హెడ్‌వర్క్స్‌ను ట్రాన్స్‌ట్రాయ్ రూ.4,054 కోట్లకు దక్కించుకుంది. అనంతరం ఈ వ్యయాన్ని రూ.5,535.91 కోట్లకు పెంచేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డం పెట్టుకుని హెడ్‌వర్క్స్ పనులన్నీ ‘సబ్’ కాంట్రాక్టర్లకు అప్పగించి ఫిబ్రవరి 2018 వరకు చేసిన పనులకు రూ.2,362.22 కోట్ల బిల్లులు చెల్లించి చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు. 60సీ నిబంధన కింద ట్రాన్స్‌ట్రాయ్‌ని తొలగించి స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ఎల్‌ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో రూ.3,102.37 కోట్లకు నవయుగ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఎల్‌ఎస్–ఓపెన్ విధానంలో మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. ఒకే సంస్థకు పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు కట్టబెట్టడం వెనుక లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే.
పనులు చేయకుండా.. చేస్తామంటూ
పోలవరం హెడ్‌వర్క్స్ పనులు చేపట్టిన నవయుగ సంస్థే జలవిద్యుదుత్పత్తి కేంద్రం పునాది పనులను పూర్తి చేసి ఏపీ జెన్‌కోకు అప్పగించాలి. అయితే ఇప్పటివరకూ పునాది పనులను కూడా పూర్తి చేయని నవయుగ తమకు జలవిద్యుదుత్పత్తి కేంద్రం ప్రాంతాన్ని అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామంటూ ఏపీ జెన్‌కో అధికారులకు పదేపదే లేఖలు రాస్తోంది. దీని ఆధారంగా జలవిద్యుత్పత్తి కేంద్రం పనులు చేపట్టే ప్రాంతాన్ని తమకు అప్పగించాలంటూ ఏపీ జెన్‌కో అధికారులు పోలవరం ఈఎన్‌సీకి లేఖలు రాస్తున్నారు. కానీ ఆ పనులు చేయాల్సిన నవయుగ సంస్థ ఇప్పటికీ వాటిని పూర్తి చేయలేదు. దీంతో పోలవరం ఈఎన్‌సీ ఆ ప్రాంతాన్ని ఏపీ జెన్‌కోకు అప్పగించలేదు. దీన్ని అడ్డంపెట్టుకుని జలవిద్యుత్పత్తి కేంద్రం పనులను నవయుగ ప్రారంభించలేదు. కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకూ అంటే 20 నెలలుగా ఆ సంస్థ పనులు చేపట్టలేదు. జలవిద్యుదుత్పత్తి కేంద్రం ప్రాంతాన్ని తమకు అప్పగించడంలో జాప్యం వల్లే పనులు ప్రారంభించలేకపోయామని, ఇందుకు అదనంగా పరిహారం చెల్లించాలని, ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు చెల్లించాలని డిమాండ్ చేసేందుకు నవయుగ సంస్థ అప్పుడే సిద్ధమైందని ఏపీ జెన్‌కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
ఖజానాను కొల్లగొట్టి..
జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు చేపట్టాలంటే నీటి ఉద్ధృతిని అంచనా వేసి డిజైన్ రూపొందించాలి. ఈ బాధ్యత కాంట్రాక్టర్‌దే. మొబిలైజేషన్ అడ్వాన్సు నిధులతో ఈ సర్వే పనులు చేయాలి. అయితే 3–డీ నమూనాలో పరిశోధనలు చేసి డిజైన్‌లు రూపొందించాలనే సాకుతో రూ.వంద కోట్లను నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌కు చెల్లించడం గమనార్హం. ఖజానాను కొల్లగొట్టి చెల్లింపులు చేయడంపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి. ఇక జలవిద్యుదుత్పత్తి కేంద్రం సర్వే పనులు చేయకున్నా మరో రూ.50 కోట్లను కాంట్రాక్టర్‌కు చెల్లించడం అక్రమాలకు పరాకాష్ట.
Comments
Please login to add a commentAdd a comment