హైడ్రోజన్ బాంబ్‌ను పరీక్షించిన చైనా
బీజింగ్: రెండో ప్రపంచయుద్ధంలో రెండు అణుబాంబులను ప్రయోగించి యుద్ధంలో గెలవడంతోపాటు ఆనాటి నుంచి అగ్రరాజ్యం హోదాను కైవసం చేసుకున్న అమెరికా గురించి తెల్సిందే. అయితే ఇప్పుడు అలా అణుబాంబులను ప్రయోగిస్తే రేడియోధార్మికత ముప్పుతోపాటు అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొనే ఆస్కారముంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో రేడియోధార్మికత వెలువర్చని, అత్యంత వినాశనం సృష్టించే అధునాతన బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది. నాన్–న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్‌ను చైనా పరీక్షించిందని ‘సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. సుంకాల సమరంలో అమెరికాతో వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ చైనా తన సైనికసత్తాను చాటడం గమనార్హం. ఈ వివరాలు ‘ప్రోజెక్టైల్స్, రాకెట్స్, మిస్సైల్స్, గైడెన్స్’ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. శుద్ధ ఇంధన సాంకేతికతతో.. చైనా ప్రభుత్వ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్‌లోని ‘705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ ఈ రెండు కేజీల బరువైన హైడ్రోజన్ బాంబును తయారుచేసింది. అణుబాంబు మాదిరికాకుండా తక్కువ స్థలంలో ఎక్కువగా ఘన హైడ్రోజన్‌ను తనలో ఇముడ్చుకునే మెగ్నీషియం హైడ్రైడ్‌ను ఈ బాంబులో వాడారు. రేడియోధార్మికతను వెదజల్లకుండా వినాశనం సృష్టించే లక్ష్యంతో శుద్ధ సాంకేతికతతో ఈ హైడ్రోజన్ బాంబును సృష్టించారు. ఈ బాంబు పేలితే మెగ్నిషియం హైడ్రైడ్ పొడి చుట్టూతా పరిసరాల్లో పరుచుకుంటుంది. దాన్నుంచి హైడ్రోజన్ వాయువు ఉద్భవించి రెప్పపాటులో పేలుళ్లు సంభవిస్తాయి. ఇవి భయంకర ట్రైనైట్రోటోలిన్(టీఎన్టీ) బాంబు పేలినదానికంటే 15 రెట్లు అధిక వినాశనం కల్గిస్తాయి. ఈ పరిసరాల ఉష్ణోగ్రత కేవలం రెండు సెకన్లలోనే 1,000 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకుంటుంది. అంటే బాంబును ప్రయోగించిన చోట శత్రు దేశ ఆయుధాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వంతెనలు ఉంటే సెకన్లలోనే ధ్వంసమవడం, కాలి బూడిద కుప్పలుగా మారడం ఖాయం. బాంబు పేలినప్పుడు కేవలం రెండు మీటర్ల దూరంలో ఏకంగా 428.43 కిలోపాస్కల్ల పీడనం ఏర్పడిందని దీంతో ఊహించనంత వినాశనం జరుగుతుందని సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. నిశ్శబ్దంగా తయారీ ఈ ఏడాది తొలినాళ్ల నుంచే మెగీ్నషియం హైడ్రైడ్ తయారీని చైనా మొదలెట్టింది. షాన్జీ ప్రావిన్సులో 150 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారాన్ని ప్రారంభించింది. వాస్తవానికి రోజుకు కేవలం కొన్ని గ్రాముల మెగ్నిషియం హైడ్రైడ్‌ను మాత్రమే తయారుచేయగలం. అదికూడా అత్యంత జాగ్రత్తగా ల్యాబ్‌లలోనే తయారుచేయొచ్చు. కానీ చైనా భారీ స్థాయిలో ఉత్పత్తికి సిద్ధపడటం గమనార్హం.