i and b ministry
-
'ఏదైనా మాస్క్ తీసేదేలే'.. తగ్గేదేలే డైలాగ్‌తో మంత్రిత్వ శాఖ మీమ్
I And B Ministry Shares Meme On Allu Arjun Pushpa: ఎక్కడా చూసిన 'పుష్ప' ఫీవరే కనిపిస్తోంది. సామాన్యులు, తారలు, పోలీసులు 'పుష్ప' సినిమాలోని డైలాగ్‌లు, మ్యానరిజాన్ని స్పూఫ్, కవర్స్‌గా మలిచారు. పుష్ప చిత్రానికి వచ్చిన క్రేజ్‌తో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రకరకాల మీమ్స్‌ను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'పుష్ప' ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తాజాగా రాజకీయనాయకులు సైతం 'పుష్పరాజ్'ను బాగా వాడేసుకుంటున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పుష్పరాజ్ డైలాగ్‌ను ఎంచుకుంది. ఈ డైలాగ్‌తో ఒక మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. (చదవండి: హెల్మెట్‌తో 'పుష్ప'రాజ్.. పోలీసుల అవగాహన) కొవిడ్‌పై తాజా సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు '#IndiaFightsCorona@COVIDNewsByMIB' అనే పేరుతో సమాచార మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ ట్విటర్ పేజీని ఇటీవల తీసుకొచ్చింది. ఈ ట్విటర్ అకౌంట్లో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టిల్‌ను ఎడిట్ చేసి బన్నీకి మాస్క్ పెట్టారు. ఈ ఎడిట్ చేసిన ఫొటోపై 'తగ్గేదేలే' డైలాగ్‌ను 'డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే..' అని రాశారు. ఇంకా ఆ పోస్ట్‌లో 'పుష్ప.. పుష్పరాజ్.. ఎవరైనా.. కరోనాపై మన పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నాలుగు విషయాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోవాలని. భౌతిక దూరాన్ని పాటించాలి. తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి.' అని ట్వీట్ చేశారు. దీంతోపాటు 'పుష్ప' మూవీలోని హీరోహీరోయిన్లు అయినా బన్నీ, రష్మిక మందన్నాను ట్యాగ్ చేశారు. #Pushpa..#PushpaRaj ho ya koi bhi, Our fight against #COVID19 is still on! 🛡️Keep following #COVIDAppropriateBehaviour 👇 ✅Always wear a #mask ✅Wash/sanitize hands regularly ✅Maintain distancing ✅Get fully #vaccinated#IndiaFightsCorona #We4Vaccine @alluarjun @iamRashmika pic.twitter.com/Mlzj9tnWL5 — #IndiaFightsCorona (@COVIDNewsByMIB) January 19, 2022 (చదవండి: ముంబైలో 'పుష్ప' ఫీవర్.. లోకల్ ట్రైన్లో శ్రీవల్లి హుక్ స్టెప్పు) -
సెన్సార్‌పై... మహా సెన్సార్!
వినోదం, వివేచన కోసం ఉద్దేశించిన మాధ్యమం అది. కానీ, దానికి సంబంధించిన వ్యవహారాలు చివరకు వివాదమైతే? సృజనాత్మక ప్రదర్శనల అనుమతి కోసం సదుద్దేశంతో పెట్టుకున్న సర్టిఫికేషన్ వ్యవస్థ చివరకు ఆ ప్రదర్శననే అడ్డుకొనే పరిస్థితి వస్తే? ఇప్పుడదే జరుగుతోందని వాపోతున్నారు సినీ సృజనశీలురు. సినీ మాధ్యమానికి సంబంధించి దశాబ్దాల క్రితం చేసుకున్న ‘సినిమాటోగ్రాఫ్ చట్టం’, పెట్టుకున్న ‘కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ బోర్డు’ (సీబీఎఫ్సీ) మళ్ళీ వార్తల్లోకి వచ్చాయి. కేంద్ర సర్కారు చేపట్టిన తాజా ‘సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు– 2021’ వివాదానికి కేంద్రమైంది. చాన్నాళ్ళుగా ఉన్న ‘సినిమాటోగ్రాఫ్ చట్టం–1951’లో మార్పులు, చేర్పుల ద్వారా రాజ్యవ్యవస్థ సినిమాలపై పెద్దన్న పాత్ర పోషించడానికి సిద్ధమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సవరణ బిల్లుపై జూలై 2 లోగా ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పవచ్చని సర్కారు పేర్కొంది. ఈ సవరణలను వ్యతిరేకిస్తూ, పలువురు సినీ దర్శక, నిర్మాతలు, నటీ నటులు సమష్టిగా ఆదివారం నాడు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు లేఖ రాయడం గమనార్హం. నిజానికి, మనది ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డే తప్ప, అందరం పిలుచుకొంటున్నట్టుగా సెన్సార్ బోర్డు కాదు! అది సినీ ప్రదర్శనకు అనుమతి ధ్రువీకరణ కోసమే తప్ప, సెన్సార్ ఉక్కుపాదం మోపడానికి పెట్టుకున్నదీ కాదు!! కానీ, వ్యవస్థ తాలూకు భావజాలానికీ, ప్రయోజనాలకు అడ్డం వచ్చే ఏ సినిమానైనా అడ్డుకోవడానికి అదే బోర్డును ఆయుధంగా చేసుకోవడం ఆది నుంచీ ఆనవాయితీ అయింది. స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ పాలకుల కాలం నుంచి అదే ధోరణి. స్వాతంత్య్రా నంతరం గద్దెపైనున్న సర్కార్లూ ఆ మార్గాన్నే అనుసరించాయి. అలా నాటి నుంచి నేటి దాకా పార్టీల ప్రమేయం లేకుండా అందరికీ ఈ తిలా పాపంలో తలా పిడికెడు భాగం ఉంది. ఇప్పుడు మళ్ళీ రీ–సెన్సార్షిప్ అనే సవరణ ప్రతిపాదన పాలకులకు మరిన్ని కొత్త కోరలు అందిస్తోంది. కేంద్రాన్ని ఏకంగా సెన్సార్‌కు పైన ఉండే ‘సూపర్ సెన్సార్’గా మారుస్తోంది. ఈ వివాదాస్పద ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని స్వేచ్ఛాభావనల సినీరంగం డిమాండ్ చేస్తోంది. అలాగే, నిన్న మొన్నటి దాకా సెన్సార్ బోర్డు ఇచ్చిన కట్స్‌తో కానీ, దాని పైన ఉండే రివైజింగ్ కమిటీ నిర్ణయంతో కానీ సంతృప్తి చెందని దర్శక, నిర్మాతలు ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ (ఎఫ్‌సీఏటీ)కి వెళ్ళి, న్యాయం పొందే అవకాశం ఉండేది. రాజకీయ కారణాలతో గద్దె మీది పెద్దలు కావాలని ఇబ్బంది పెట్టినా, న్యాయమూర్తులుండే చట్టబద్ధ సంస్థ ట్రిబ్యునల్ దగ్గర దర్శక– నిర్మాతలకు ఊరట లభించేది. ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ (1982), నారాయణమూర్తి ‘లాల్‌సలామ్’ (1992) లాంటి అనేక సినిమాలు అలా సెన్సార్ బోర్డుపై పోరాడి, ట్రిబ్యునల్ దాకా వెళ్లి సెన్సార్ సర్టిఫికెట్ సంపాదించుకున్నవే. కానీ, ఈ ఏప్రిల్‌లో కేంద్ర సర్కారు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తెచ్చి, ఆ ట్రిబ్యునల్‌నే రద్దు చేసేసింది. అంటే ఇప్పుడిక దర్శక, నిర్మాతలు అందరిలా సాధారణ కోర్టు గుమ్మం ఎక్కి, ఎన్ని నెలలు ఆలస్యమైనా భరిస్తూ, తమ సినిమా సెన్సార్ కష్టాలను కడతేర్చుకోవాల్సిందే. తాజా సవరణ బిల్లు గనక చట్టమైతే–ఇప్పటికే సెన్సారైన సినిమాలను కూడా ప్రభుత్వం వెనక్కి పిలిపించవచ్చు. జనం నుంచి ఫిర్యాదు వచ్చి, అది సమంజసమని ప్రభుత్వం భావిస్తే చాలు– ఇక ఆ సినిమా ప్రదర్శన ఆగిపోనుంది. అంటే, ప్రభుత్వం నియమించిన నిపుణులతో సెన్సారై రిలీజైన సినిమాపైనే మళ్ళీ మరో సెన్సార్షిప్ అన్న మాట. అసలు సెన్సార్ బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చాక, దాన్ని తిరగదోడే అధికారం కేంద్రానికి లేదంటూ కె.ఎం. శంకరప్ప (2001) కేసులో సర్వో న్నత న్యాయస్థానం ఎప్పుడో తేల్చింది. అలా చూస్తే ఈ కొత్త సవరణ ఆ ఆదేశాలకు విరుద్ధమే. అయితే, దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లుతుందనుకుంటే రాజ్యాంగ బద్ధమైన భావప్రకటన స్వేచ్ఛ హక్కుకూ కొన్ని పరిమితులుంటాయని మన రాజ్యాంగం పేర్కొంది. ఆ పరిమితులను ఆసరాగా చేసుకొని, సుప్రీం కోర్టు ఆదేశాలకు సైతం కేంద్రం కొత్త క్లాజు పెట్టింది. మరోపక్క ఇప్పటికే ఓవర్ ది టాప్ (ఓటీటీ) వేదికల పైనా కొన్ని నియంత్రణ చట్టాలు ప్రభుత్వం తెచ్చింది. నిజానికి, ఇప్పుడొస్తున్న కొన్ని వెబ్ సిరీస్‌లు, చిత్రాల బాధ్యతారాహిత్యం చూస్తుంటే నియంత్రణలు అవసరమనే అనిపిస్తుంది. కానీ అది కక్షసాధింపు కాకూడదు. సమతూకం, సంయమనం అవసరం. ప్రతిపాదిత తాజా బిల్లులోని అంశాలు మాత్రం ప్రజాస్వామ్యబద్ధమైన అసమ్మతిని సహించలేక చేస్తున్నవేననే అభిప్రాయం ప్రబలుతోంది. ప్రభుత్వ భావజాలానికో, ఏ కొందరి మనోభావాలకో వ్యతిరేకంగా ఉంటే చాలు... కొద్దిమంది కలసి ఓ సినిమా ప్రదర్శనను ఆపేయవచ్చు. సెన్సారైన సినిమానూ వెనక్కి రప్పించవచ్చనేది సృజనశీలురను భయపెడుతోంది. ఆ మధ్య సంజయ్ భన్సాలీ ‘పద్మావత్’, ‘ఉడ్తా పంజాబ్’ సహా అనేక సినిమాల విషయంలో ఇప్పటికే అనేక చేదు అనుభవాలు సినీసీమకు ఉన్నాయి. అందుకే, సినిమాటోగ్రాఫ్ చట్టంలో కేంద్రం చేయాలనుకుంటున్న సవరణల పట్ల సినీ సమాజంలో నెలకొన్న భయాందోళనలు చాలావరకు అర్థవంతమైనవి. అర్థం చేసుకోదగినవి. ఆ భయాందోళనల్ని పోగొట్టాల్సిన బాధ్యత పాలకుల మీదే ఉంది. లేదంటే, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడుతూ, పరస్పర భిన్నాభిప్రాయాలను గౌరవించు కొంటూ సాగాల్సిన ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. విమర్శనూ, సృజనాత్మక స్వేచ్ఛనూ సహించ లేక ఉక్కుపాదం మోపుతున్నారనే అప్రతిష్ఠను మూటగట్టుకోవాల్సి వస్తుంది. -
ఆ రెండు చానళ్లపై 48 గంటల నిషేధం
న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేసినందుకు గాను రెండు మలయాళ చానళ్లపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 48 గంటల నిషేధం విధించింది. నిషేధానికి గురైనా వాటిలో ఏషియా నెట్, మీడియా వన్ చానళ్లు ఉన్నాయి. ఈ రెండు చానళ్లు రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేవిధంగా రిపోర్టింగ్ చేశాయని పేర్కొంది. నిబంధనలకు విరుద్దంగా ప్రసారాలు చేసినందుకు శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి 48 గంటల పాటు ఆ రెండు చానళ్ల ప్రసారాలపై నిషేధించింది. అలాగే ఢిల్లీ అల్లర్ల కవరేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని చానళ్ల ప్రసారాలను సమచార శాఖ నిశితంగా పరిశీలిస్తుంది. కాగా, ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 23 న అల్లర్లు చేలరెగిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఘర్షణల్లో 53 మంది మరణించగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. -
టీవీ చానళ్లలో ఆ పదం వాడకూడదు
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలకు చెందిన వారి ప్రస్తావన వచ్చినప్పుడు దళితులు అనే పదాన్ని వాడకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) టీవీ చానళ్లకు సూచించింది. ముంబై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంఐబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ప్రవేటు శాటిలైట్ టీవీ చానళ్లకు ఈ నిబంధన వర్తించనుంది. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు ఈ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంఐబీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎంఐబీ ప్రవేటు చానళ్లకు రాసిన లేఖలో.. మీడియా దళితులు అనే పదానికి బదులు షెడ్యూల్ కులాలు అనే పదాన్ని వాడాల్సి ఉంటుందని తెలిపింది.దళిత్ అనే పదానికి బదులుగా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఇంగ్లిష్‌లో షెడ్యూల్ క్యాస్ట్ అని గానీ, దేశంలో ఇతర జాతీయ భాషల్లో దానికి సరిపడు అనువాదాన్ని గానీ వాడాల్సి ఉంటుందని.. అధికారిక లావాదేవీలకు, వ్యవహారాలకు, ధృవపత్రాలకు సంబంధించిన వాటిలో ఈ నిబంధన వర్తిస్తుందని కోర్టు తెలిపిందన్న విషయాన్ని ప్రస్తావించింది. కానీ ఈ సూచనలు పాటించకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై ఎంఐబీ స్పష్టతనివ్వలేదు. కాగా ప్రభుత్వ దస్త్రాల్లో, సమాచార మార్పిడిలో దళిత్ అనే పదం వాడకూడదనే పిటిషన్‌పై విచారణ జరిపిన ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఈ మేరకు జూన్‌లో తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో దళితులు అనే పదానికి బదులు షెడ్యూల్ కులాలు వాడాలని మార్చి 15వ తేదీన సర్య్కూలర్ జారీ చేసింది. -
లేటుగా వస్తారా.. నేను పట్టేస్తా: కేంద్రమంత్రి
గతంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు మారగానే అక్కడి కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయాన్నే 9.30 గంటలకు అక్కడకు వెళ్లిన వెంకయ్య.. ఎవరెవరు సమయానికి వస్తున్నారు, ఎవరు రావట్లేదు, కార్యాలయంలో శుభ్రత ఎలా ఉందనే అంశాలను పరిశీలించారు. సమయానికి రాని అధికారుల నుంచి వివరణ కోరారు. వెంకయ్య నాయుడితో పాటు ఆశాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కూడా ఈ తనిఖీలకు వెళ్లారు. మంత్రులు స్వయంగా పలువురు అధికారులు, వారి సహాయక సిబ్బంది గదులను చూశారు. ఆఫీసులో బాత్రూంలు ఎలా ఉన్నాయో కూడా చెక్ చేశారు. వివిధ గదులు, కారిడార్లలో కరెంటు స్విచ్‌లు ఎలా ఉన్నాయో అనే విషయాన్ని సైతం చూశారు. శాస్త్రి భవన్లో ఉదయం 9.30 గంటలకు తనిఖీ చేశానని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. సమయపాలన గురించి సంబంధిత సంయుక్త కార్యదర్శులతో సమీక్షించానన్నారు. Made a surprise check of attendance and cleanliness at Shastri Bhawan today at sharp 9:30am pic.twitter.com/107f90zZmt — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 11 July 2016 Directed concerned Joint Secretaries to review issues related to punctuality and cleanliness in the offices on daily basis... — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 11 July 2016 Explanation sought from those who were not present at the time of inspection... — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 11 July 2016