IAS Sharma
-
‘రాజధాని అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు’
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గత ప్రభుత్వం నిరంకుశంగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలోని ప్రజలు, రాజకీయపార్టీలను సంప్రదించలేదని ఆయన గుర్తుచేశారు. వికేంద్రీకరణ నాలుగు విధాలుగా జరగాలని శర్మ అభిప్రాయపడ్డారు. రాజకీయ, పరిపాలన, ఆర్థిక పరంగా వికేంద్రీకణ ఉండాలని తెలిపారు. సుప్రీంకోర్టు సలహాతో కోర్టులు కూడా మూడు లేదా నాలుగు బెంచ్‌లుగా ఏర్పాటు చేయాలన్నారు. న్యాయస్థానాలు గ్రామస్థాయి వరకు పెంచాలని ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వీసీ ప్రొఫెసర్ చలం మాట్లాడుతూ.. విశాఖపట్నం రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై గతంలో శివరామకృష్ణ కమిటీ ఎనిమిది పేజీల నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. పాలన అన్నది ప్రజల వద్దకు వెళ్లాలంటే వికేంద్రీకరణ జరగాలన్నారు. విశాఖకు రాజధాని వస్తే ప్రజలకు ఆదాయం, సౌకర్యాలు పెరిగేలా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన 15 లక్షల మంది తిరిగి వచ్చేలా.. వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేయాలని మాజీ వీసీ ప్రొఫెసర్ చలం పేర్కొన్నారు. లా యూనివర్సిటీ మాజీ వీసీ, న్యాయ శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ వై. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా విశాఖపట్నంను ప్రభుత్వం ఎంచుకోవటం మంచి నిర్ణయమని కొనియాడారు. రాజధాని అభివృద్ధి అంటే ఒక చోట భూములు తీసుకుని భవనాలు కట్టడం కాదన్నారు. అభివృద్ధికి కావల్సిన అన్ని వనరులు విశాఖలో ఉన్నాయని ఆయన తెలిపారు. సీట్ ఆఫ్ గవర్నెన్స్ విశాఖలోనే ఉంటుందన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమన్నారు. రాజకీయ, విద్య, ఆర్ధిక రంగాల్లో అభివృద్ధి చెందిన నగరం విశాఖ అని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వపాలన చక్కగా నడవడానికి ప్రజలు మంచి దృక్పధంతో ఉన్నారని సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో చేసిన ప్రతిపాదనల్లో మంచి ప్రతిపాదన రాష్టాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకోవటం అన్నారు. దానివల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. సీట్ ఆఫ్ గవర్నెన్స్ వల్ల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ప్రొఫెసర్ సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన రెండు ప్రకటనలను తాము స్వాగతిస్తున్నామని ఉత్తరాంధ్ర ప్రజాగాయకుడు, కవి రాజశేఖర్ తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనే మాట ఉత్తరాంధ్రవాసుల్లో ఆశలు చిగురింపజేసిందని చెప్పారు. కోటి జనాభా, 19 నదులున్న ఉత్తరాంధ్ర నేలలో అభివృద్ధి జరగాలని ఆయన పేర్కొన్నారు. వికేంద్రీకరణను అడ్డుకుంటున్న శక్తులు ఎవరైనా.. సోంపేట, కాకరపల్లి థర్మల్ అణువిద్యుత్ కార్మాగారాలను అడ్డుకోండని రాజశేఖర్ అన్నారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, మాజీ వీసీ ప్రొఫెసర్ చలం, న్యాయ శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ వై. సత్యనారాయణ, ప్రజాగాయకుడు, కవి రాజశేఖర్ పాల్గొన్నారు. -
ఇది రియల్ ఎస్టేట్ కుంభకోణం
- రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ విశాఖపట్నం (సీతంపేట): రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున చేస్తున్న భూ సేకరణ రియల్ ఎస్టేట్ కుంభకోణమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ ఆరోపించారు. మూడు పంటలు పండే వ్యవసాయ భూమిని ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా చేపట్టడం భూసేకరణ చట్టానికి విరుద్ధమన్నారు. దీని వల్ల దేశ, రాష్ట్ర ఆహార భద్రత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. ఏఐడీవైవో, ఏఐడీఎస్వో సంయుక్తంగా బుధవారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ‘నూతన రాజధాని భూ సేకరణ, పరిణామాలు’ అంశంపై నిర్వహించిన యువజన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇంటర్నెట్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్న నేటి రోజుల్లో కార్యాలయాలన్నీ ఒకే చోట పరిమితం చేసే బదులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించాలన్నారు. సస్యశ్యామలమైన విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) పరిధిలో 10 వేల మంది రైతులు, 32 వేల మంది వ్యవసాయ కార్మికులు, 12 వేల మంది వ్యవసాయేతర వృత్తుల కుటుంబాలు నిర్వాసితులవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్ర ప్రతికూల పర్యావసనాలతో కూడుకున్నదని హెచ్చరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రియల్ ఎస్టేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే భూసేకరణ ప్రక్రియను అంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విశ్రాంత ఐఇఎస్ అధికారి సి.ఎస్.రావు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిర్మిచాలంటే మంచి రోడ్లు, మెరుగైన పారిశుద్ధ్యం, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. -
రాజధాని ప్రణాళిక.. ఓ ‘రియల్’ కుంభకోణం!
చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన మాజీ ఐఏఎస్ శర్మ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రణాళిక ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆయా విషయాలను ప్రజలకు, పాత్రికేయులకు వివరించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తాను పేర్కొంటున్న విషయాలపై ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘రాజధాని పథకం-సమస్యలు’ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఇప్పటికే 3 వేల ఎకరాలు చేతులు మారాయని,రూ. 4 వేల కోట్ల ఆదాయం కొంత మంది ధనికులకు చేరిందన్నారు.ఇది కేంద్ర ఆదాయ పన్ను శాఖ దృష్టికి కూడా వచ్చినట్టు తెలిసిందన్నారు. ఈ నిధులు విదేశాలకు అప్పుడే తరలించి ఉండవచ్చని శర్మ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నేతలకు, అధికారులకు ప్రమేయం ఉందా? అనే విషయాన్ని కేంద్రం పరిశీలించి వెలికి తెస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఏపీ సీఆర్డీఏ ప్రకారం నగర నిర్మాణానికి తీసుకునే భూముల్లో 5 శాతం భూమిని మాత్రమే నగరంలో పనిచేసే పేదవారికి కేటాయించనున్నట్లు పేర్కొన్నారని, జేఎన్ఎన్యూఆర్ఎమ్ ప్రణాళికలో ఇప్పుడున్న నగరాభివృద్ధి ప్రణాళికలో పేద వారికి కనీసం 20 నుంచి 25 శాతం వరకు ఇళ్ల స్థలాలను కేటాయించాలనే నిబంధన ఉందని తెలిపారు.ఏపీ సీఆర్డీఏ ఈ నిబంధనను ఉల్లంఘించి.. పేదలకు హాని చేసే పరిస్థితి కల్పిస్తోందని పేర్కొన్నారు. ఒక వైపు స్మార్ట్ సిటీలని ప్రచారం గుప్పిస్తూ.. మురికివాడలను సృష్టించే ప్రణాళిక ఎంతవరకు ప్రజాహితమో ప్రజలే చెప్పాలని కోరారు. జనాభా పెరుగుదల వలన తలసరి భూ పరిమితి తగ్గుతోంది. ఆ దృష్ట్యా రాజధాని బహుళ అంతస్థుల భవనాలే నిర్మిస్తే 2 వేల ఎకరాలకు మించి భూములక్కరలేదు. 50 వేల ఎకరాలను ప్రజల నుంచి లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ వల్ల కేంద్ర భూ సేకరణ చట్టం ద్వారా కలిగిన హక్కులను ప్రజలకు అందకుండా చేశారని అన్నారు.