సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గత ప్రభుత్వం నిరంకుశంగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలోని ప్రజలు, రాజకీయపార్టీలను సంప్రదించలేదని ఆయన గుర్తుచేశారు. వికేంద్రీకరణ నాలుగు విధాలుగా జరగాలని శర్మ అభిప్రాయపడ్డారు. రాజకీయ, పరిపాలన, ఆర్థిక పరంగా వికేంద్రీకణ ఉండాలని తెలిపారు. సుప్రీంకోర్టు సలహాతో కోర్టులు కూడా మూడు లేదా నాలుగు బెంచ్‌లుగా ఏర్పాటు చేయాలన్నారు. న్యాయస్థానాలు గ్రామస్థాయి వరకు పెంచాలని ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ వీసీ ప్రొఫెసర్ చలం మాట్లాడుతూ.. విశాఖపట్నం రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై గతంలో శివరామకృష్ణ కమిటీ ఎనిమిది పేజీల నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. పాలన అన్నది ప్రజల వద్దకు వెళ్లాలంటే వికేంద్రీకరణ జరగాలన్నారు. విశాఖకు రాజధాని వస్తే ప్రజలకు ఆదాయం, సౌకర్యాలు పెరిగేలా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన 15 లక్షల మంది తిరిగి వచ్చేలా.. వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేయాలని మాజీ వీసీ ప్రొఫెసర్ చలం పేర్కొన్నారు.
లా యూనివర్సిటీ మాజీ వీసీ, న్యాయ శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ వై. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా విశాఖపట్నంను ప్రభుత్వం ఎంచుకోవటం మంచి నిర్ణయమని కొనియాడారు. రాజధాని అభివృద్ధి అంటే ఒక చోట భూములు తీసుకుని భవనాలు కట్టడం కాదన్నారు. అభివృద్ధికి కావల్సిన అన్ని వనరులు విశాఖలో ఉన్నాయని ఆయన తెలిపారు. సీట్ ఆఫ్ గవర్నెన్స్ విశాఖలోనే ఉంటుందన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమన్నారు. రాజకీయ, విద్య, ఆర్ధిక రంగాల్లో అభివృద్ధి చెందిన నగరం విశాఖ అని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వపాలన చక్కగా నడవడానికి ప్రజలు మంచి దృక్పధంతో ఉన్నారని సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో చేసిన ప్రతిపాదనల్లో మంచి ప్రతిపాదన రాష్టాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకోవటం అన్నారు. దానివల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. సీట్ ఆఫ్ గవర్నెన్స్ వల్ల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ప్రొఫెసర్ సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన రెండు ప్రకటనలను తాము స్వాగతిస్తున్నామని ఉత్తరాంధ్ర ప్రజాగాయకుడు, కవి రాజశేఖర్ తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనే మాట ఉత్తరాంధ్రవాసుల్లో ఆశలు చిగురింపజేసిందని చెప్పారు. కోటి జనాభా, 19 నదులున్న ఉత్తరాంధ్ర నేలలో అభివృద్ధి జరగాలని ఆయన పేర్కొన్నారు. వికేంద్రీకరణను అడ్డుకుంటున్న శక్తులు ఎవరైనా.. సోంపేట, కాకరపల్లి థర్మల్ అణువిద్యుత్ కార్మాగారాలను అడ్డుకోండని రాజశేఖర్ అన్నారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, మాజీ వీసీ ప్రొఫెసర్ చలం, న్యాయ శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ వై. సత్యనారాయణ, ప్రజాగాయకుడు, కవి రాజశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment