- రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ
విశాఖపట్నం (సీతంపేట): రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున చేస్తున్న భూ సేకరణ రియల్ ఎస్టేట్ కుంభకోణమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ ఆరోపించారు. మూడు పంటలు పండే వ్యవసాయ భూమిని ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా చేపట్టడం భూసేకరణ చట్టానికి విరుద్ధమన్నారు. దీని వల్ల దేశ, రాష్ట్ర ఆహార భద్రత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. ఏఐడీవైవో, ఏఐడీఎస్‌వో సంయుక్తంగా బుధవారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ‘నూతన రాజధాని భూ సేకరణ, పరిణామాలు’ అంశంపై నిర్వహించిన యువజన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇంటర్‌నెట్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్న నేటి రోజుల్లో కార్యాలయాలన్నీ ఒకే చోట పరిమితం చేసే బదులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించాలన్నారు.
సస్యశ్యామలమైన విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) పరిధిలో 10 వేల మంది రైతులు, 32 వేల మంది వ్యవసాయ కార్మికులు, 12 వేల మంది వ్యవసాయేతర వృత్తుల కుటుంబాలు నిర్వాసితులవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్ర ప్రతికూల పర్యావసనాలతో కూడుకున్నదని హెచ్చరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రియల్ ఎస్టేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే భూసేకరణ ప్రక్రియను అంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విశ్రాంత ఐఇఎస్ అధికారి సి.ఎస్.రావు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిర్మిచాలంటే మంచి రోడ్లు, మెరుగైన పారిశుద్ధ్యం, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు.
ఇది రియల్ ఎస్టేట్ కుంభకోణం
Published Wed, Feb 25 2015 9:40 PM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
Advertisement
Advertisement