తక్కువ ధరకే ఇళ్లు.. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ ‘రియల్’ వల
సాహితీ, భువనతేజ, జేజే ఇన్‌ఫ్రా, జేవీ బిల్డర్స్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలెన్నో...
గ్రేటర్‌లో మోసాల విలువ రూ.10 వేల కోట్లని అంచనా
సాక్షి, హైదరాబాద్: తక్కువ ధరకే ఇళ్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ వంద శాతం వసూలు పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువ అయ్యాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు అడియాసలు చేస్తున్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి.
కస్టమర్ల సొమ్మే యజమానికి..
నగరానికి నలువైపులా దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు రోడ్లు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కూడా లేని ప్రాంతాల్లో రియల్ ప్రాజెక్టుల పేరిట ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్నారు. భూమి యజమానులతో ఒప్పందం చేసుకొని, ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, ప్రీలాంచ్‌లో కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు. ఆ డబ్బే భూమి యజమానికి కట్టి, ఆ తర్వాత అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. అనుమతులు రాకపోయినా, భూ యజమానితో వివాదం తలెత్తినా ప్రాజెక్ట్ ఆగిపోయి ప్రీలాంచ్‌లో బుక్ చేసుకున్నవారు రోడ్డున పడుతున్నారు.
మోసాల విలువ రూ.10 వేల కోట్లు..
సాహితీ, భువనతేజ, జేజే ఇన్‌ఫ్రా, జేవీ బిల్డర్స్, జయ గ్రూప్ వంటి చిన్నా, పెద్ద కంపెనీలు ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లు చేపడుతున్నాయి. కోకాపేట, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్‌బీనగర్, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్, శామీర్‌పేట, ఆదిబట్ల ఇలా హైదరాబాద్ నలువైపులా ఈ తరహా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇలాంటి వెంచర్లు కనీసం వంద వరకు ఉంటాయని, నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే రియల్ మోసాల విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా. రియల్ మోసాలకు గురైన వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో రియల్‌ఎస్టేట్ మోసాలపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులపై డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (టీపీడీఎఫ్‌ఈఏ) చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు.
కొనే ముందు జాగ్రత్తలు తప్పనిసరి
ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు సంబంధిత బిల్డర్, కంపెనీ పూర్వాపరాలు పరిశీలించాలి. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే ఆర్ధిక స్తోమత ఆ సంస్థకు ఉందా? లేదా? అని ఆరా తీయాలి. దీనికి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ విభాగాల నుంచి అనుమతులు ఉన్నాయా..లేదా, రెరాలో నమోదైందా లేదా తనిఖీ చేయాలి. ఏజెంట్ చెప్పినవన్నీ నమ్మకుండా, క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలి. నగదు రూపంలో కాకుండా చెక్ రూపంలో లావాదేవీలు జరిపితేనే ఉత్తమం.
– నరేంద్రకుమార్, ప్రణీత్ గ్రూప్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment