రాజధాని ప్రణాళిక.. ఓ ‘రియల్’ కుంభకోణం!
- చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన మాజీ ఐఏఎస్ శర్మ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రణాళిక ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆయా విషయాలను ప్రజలకు, పాత్రికేయులకు వివరించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తాను పేర్కొంటున్న విషయాలపై ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘రాజధాని పథకం-సమస్యలు’ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.
రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఇప్పటికే 3 వేల ఎకరాలు చేతులు మారాయని,రూ. 4 వేల కోట్ల ఆదాయం కొంత మంది ధనికులకు చేరిందన్నారు.ఇది కేంద్ర ఆదాయ పన్ను శాఖ దృష్టికి కూడా వచ్చినట్టు తెలిసిందన్నారు. ఈ నిధులు విదేశాలకు అప్పుడే తరలించి ఉండవచ్చని శర్మ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నేతలకు, అధికారులకు ప్రమేయం ఉందా? అనే విషయాన్ని కేంద్రం పరిశీలించి వెలికి తెస్తుందనే నమ్మకం ఉందన్నారు.
ఏపీ సీఆర్‌డీఏ ప్రకారం నగర నిర్మాణానికి తీసుకునే భూముల్లో 5 శాతం భూమిని మాత్రమే నగరంలో పనిచేసే పేదవారికి కేటాయించనున్నట్లు పేర్కొన్నారని, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్ ప్రణాళికలో ఇప్పుడున్న నగరాభివృద్ధి ప్రణాళికలో పేద వారికి కనీసం 20 నుంచి 25 శాతం వరకు ఇళ్ల స్థలాలను కేటాయించాలనే నిబంధన ఉందని తెలిపారు.ఏపీ సీఆర్‌డీఏ ఈ నిబంధనను ఉల్లంఘించి.. పేదలకు హాని చేసే పరిస్థితి కల్పిస్తోందని పేర్కొన్నారు.
ఒక వైపు స్మార్ట్ సిటీలని ప్రచారం గుప్పిస్తూ.. మురికివాడలను సృష్టించే ప్రణాళిక ఎంతవరకు ప్రజాహితమో ప్రజలే చెప్పాలని కోరారు.
జనాభా పెరుగుదల వలన తలసరి భూ పరిమితి తగ్గుతోంది. ఆ దృష్ట్యా రాజధాని బహుళ అంతస్థుల భవనాలే నిర్మిస్తే 2 వేల ఎకరాలకు మించి భూములక్కరలేదు. 50 వేల ఎకరాలను ప్రజల నుంచి లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ వల్ల కేంద్ర భూ సేకరణ చట్టం ద్వారా కలిగిన హక్కులను ప్రజలకు అందకుండా చేశారని అన్నారు.