IAS Shashank Goyal
-
సాఫీగా ‘పట్టభద్రుల’ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికలు సాఫీగా సాగేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో కోవిడ్ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు అవకాశం కల్పించాలని సూచించారు. పోలింగ్ తీరుతెన్నులపై అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు, ఇతర కెమెరాలతో వీడియోగ్రఫీ చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 50 ఫిర్యాదులు అందాయని, ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటామన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల బాధ్యతని.. తద్వారా ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందన్నారు. పోలింగ్ రోజున అభ్యర్థికి రెండు వాహనాలతో పాటు ప్రతీ జిల్లాకు అదనంగా ఒక వాహనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ కూడా పూర్తయిందని శశాంక్ గోయల్ వెల్లడించారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయడంతో పాటు, ఈ నెల 17న ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
ఐఏఎస్ శశాంక్ గోయల్ కుమారుడి హత్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ శశాంక్ గోయల్ కుమారుడు శుభమ్ గోయల్ టర్కీలోని ఇస్తాంబుల్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 24న శుభమ్ గోయల్ తన స్నేహితుడు సుధాన్‡్ష తో కలసి అమెరికా నుంచి హాలిడే టూర్ కోసం ఇస్తాంబుల్ వెళ్లాడు. అక్కడ ఓ దోపిడీ దొంగల ముఠా శుభమ్‌ను అడ్డగించి డబ్బుతో పాటు వస్తువుల్ని ఇవ్వాలని బెదిరించారు. దీంతో శుభమ్ వారితో వాదనకు దిగగా.. దాడి చేసి చంపేశారు. ఇరు వర్గాల మధ్య పెనుగులాటలో దొంగలు తుపాకీతో శుభమ్‌ను కాల్చి చంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయం తెలుసుకున్న తండ్రి శశాంక్ గోయల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల సహాయంతో మృతదేహాన్ని శనివారం రాత్రి తన స్వస్థలం ఉత్తరాఖండ్ రూర్కెలాకు తెప్పించినట్టు రాష్ట్ర అధికార వర్గాలు స్పష్టం చేశాయి. శుభమ్ కాలిఫోర్నియాలోని ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గత నెల 28న శుభమ్ బంధువుల పెళ్లి కోసం భారత్ వచ్చి వెళ్లాడని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడం తమ కుటుంబాన్ని కోలుకోలేని విధంగా దెబ్బ తీసిందని శుభమ్ తాతయ్య డాక్టర్ డీబీ గోయల్ తెలిపారు. ఆదివారం సాయంత్రం శుభమ్ అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. -
ఐఏఎస్ శశాంక్ గోయల్ ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కార్మిక, ఉద్యోగ నైపుణ్య, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితులతో కలిసి టర్కీ పర్యటనకు వెళ్లిన శశాంక్ గోయల్ కుమారుడు శుభమ్ గోయల్(24) అక్కడ జరిగిన ఘర్షణలో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. శశాంక్ గోయల్ ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందినవారు. ఆయన కుమారుడు శుభమ్ గోయల్ ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నారు. న్యూఢిల్లీలో ఓ పెళ్లికి హాజరైన శుభమ్.. స్నేహితులతో కలసి టర్కీ టూర్‌కు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. శుభమ్ మరణవార్త ఈ నెల 26న కుటుంబసభ్యులకు తెలిసినట్లు సమాచారం. శుభమ్ మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. శుభమ్ అంత్యక్రియల కొరకు అతని మృతదేహాన్ని సొంతవూరు రూర్కీకి తరలించారు.