
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ శశాంక్ గోయల్ కుమారుడు శుభమ్ గోయల్ టర్కీలోని ఇస్తాంబుల్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 24న శుభమ్ గోయల్ తన స్నేహితుడు సుధాన్‡్ష తో కలసి అమెరికా నుంచి హాలిడే టూర్ కోసం ఇస్తాంబుల్ వెళ్లాడు. అక్కడ ఓ దోపిడీ దొంగల ముఠా శుభమ్‌ను అడ్డగించి డబ్బుతో పాటు వస్తువుల్ని ఇవ్వాలని బెదిరించారు. దీంతో శుభమ్ వారితో వాదనకు దిగగా.. దాడి చేసి చంపేశారు. ఇరు వర్గాల మధ్య పెనుగులాటలో దొంగలు తుపాకీతో శుభమ్‌ను కాల్చి చంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ విషయం తెలుసుకున్న తండ్రి శశాంక్ గోయల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల సహాయంతో మృతదేహాన్ని శనివారం రాత్రి తన స్వస్థలం ఉత్తరాఖండ్ రూర్కెలాకు తెప్పించినట్టు రాష్ట్ర అధికార వర్గాలు స్పష్టం చేశాయి. శుభమ్ కాలిఫోర్నియాలోని ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గత నెల 28న శుభమ్ బంధువుల పెళ్లి కోసం భారత్ వచ్చి వెళ్లాడని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడం తమ కుటుంబాన్ని కోలుకోలేని విధంగా దెబ్బ తీసిందని శుభమ్ తాతయ్య డాక్టర్ డీబీ గోయల్ తెలిపారు. ఆదివారం సాయంత్రం శుభమ్ అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment