Ibrahimpatnam constituency
-
30న పూర్తి సమాచారం సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఓట్లకు సంబంధించిన అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని ఆదేశించాలని కోరుతూ మల్రెడ్డి రంగారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 30 తేదీన లెక్కింపు వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారంతో తమ ముందుకు రావాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి 376 ఓట్ల తేడాతో మల్రెడ్డి రంగారెడ్డి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఓట్లకు, వీవీ ప్యాట్ స్లిప్పులకు తేడాలున్నాయి.. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఆ ఓట్ల లెక్కింపులో లోపాలపై తన చీఫ్ ఎన్నికల ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారని రంగారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వినతి పత్రం తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదని ప్రస్తావించారు. పోలింగ్ స్టేషన్ 199, 221ల్లో వీవీ ప్యాట్ స్లిప్పులను, ఈవీఎంలను పోల్చిచూడగా, ఈవీఎంల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 146 ఓట్లు, తనకు 130 ఓట్లు వచ్చాయని, ఇదే సమయంలో వీవీ ప్యాట్లను లెక్కించగా, మంచిరెడ్డికి 139 ఓట్లు, తనకు 129 ఓట్లు వచ్చాయన్నారు. 221 పోలింగ్ కేంద్రంలో కూడా ఈవీఎం ఓట్లకు, వీవీ ప్యాట్ స్లిప్పులకు తేడాలున్నాయని తెలిపారు. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా రిటర్నింగ్ అధికారి రాత్రి 9 గంటల సమయంలో ఫలితాలను ప్రకటించారని పేర్కొన్నారు. మాక్ పోలింగ్ డేటాను తుడిచేయకుండా వీవీ ప్యాట్లను లెక్కించడం వల్ల సమస్య వచ్చిందని రిటర్నింగ్ అధికారి చెప్పారన్నారు. దీనిపై సీఈవోను కలిసి వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని అభ్యర్థిస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరగా, రిటర్నింగ్ అధికారి కార్యాలయం కీలక సమాచారాన్ని తొక్కిపెట్టిందని తెలిపారు. పోలింగ్ పారదర్శకంగా జరిగేందుకు వీవీ ప్యాట్లను తీసుకువచ్చారని, అయితే అధికారులు మాత్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదని రంగారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. -
‘పట్నం’కు నిధుల వరద
- గ్రామపంచాయతీల అభివృద్ధికి రూ.10.80 కోట్లు విడుదల - ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం - మిగతా హామీలపై విడుదల కానీ జీఓలు ‘ఇబ్రహీంపట్నం వజ్రపు తునకలాంటిది. ఈ ప్రాంతాన్ని ఊహిం చని రీతిలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా.’ సోమవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన బహిరంగసభలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న మాటలివి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి రూ.10.80 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేక నిధి (ఎస్డీఎఫ్) కింద ఈ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా నియోజకవ ర్గంలోని 79 పంచాయతీలు, 20 అనుబంధ గ్రామాలకు ఈ నిధులను విడుదల చేశారు. గ్రామ పంచాయతీల్లో అత్యవసర పనులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఒక్కదానికే మోక్షం..! ఇబ్రహీంపట్నంపై హామీల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి... మంగళవారం సాయంత్రం నాటికీ వాటికి సంబంధించిన జీఓలూ విడుదలవుతాయని ప్రజల హర్షాధ్వానాల మధ్య ప్రకటించారు. హైదరాబాద్-ఇబ్రహీంపట్నం వరకు సెంట్రల్ లైటింగ్, ఇబ్రహీంపట్నం చెరువులోకి వరద నీరు వచ్చే ప్రధాన వాగు (మాదాపూర్-ఎలిమినేడు) విస్తరణ, మాల్ వరకు నాలుగులేన్ల రహదారి అభివృద్ధి పనులకు రేపటిలోగా ఉత్తర్వులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలా ఇచ్చిన హామీల్లో పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల మినహా.. ప్రధానమైన హామీలకు ఇంకా మోక్షం కలగకపోవడం గమనార్హం. -
ఆసక్తికరంగా ‘పట్నం’ రాజకీయం
- టీఆర్ఎస్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి చేరికతో మరో మలుపు - ఒకే పార్టీలో నలుగురు నియోజకవర్గ నాయకులు - ఎంత వరకు కలిసి సాగుతారనేదానిపై సర్వత్రా చర్చనీయాంశం ఆదిబట్ల : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేరికతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న నాయకులంతా ఇప్పుడు ఒకేగూటికి చేరారు. దీంతో పార్టీలో అగ్ర నాయకులు కలిసిమెలసి ఇమడగలరా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒకే పార్టీలో నలుగురు అగ్రనాయకులు ఉండడం పార్టీ బలాన్ని పెంచేదే అయినప్పటికీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని పార్టీని ఎంత వరకు మందుకు తీసుకెళ్తారు అన్నదే అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, వంగేటి లకా్ష్మరెడ్డి వంటి నాయకులు ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ క్షేత్రస్థాయిలో రోజురోజుకూ బలమైన పునాదులు నిర్మించుకుంటోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నగరపంచాయతీ చైర్మన్ కంబాళపల్లి భరత్‌కుమార్, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు యంపల్లి నిరంజన్‌రెడ్డి, యాచారం, హయత్‌నగర్ మండల పరిషత్ అధ్యక్షులు జ్యోతినాయక్, హరితధన్రాజ్, యాచారం జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు. వచ్చేనెల 4న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ ఉండడంతో టీడీపీకి చెందిన నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కో ఆపరేటివ్ చైర్మన్లు, కార్యకర్తలు భారీ ఎత్తున టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. -
‘కమలం’లో నూతనోత్సాహం
ఇబ్రహీంపట్నం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పర్యటన ఇబ్రహీంపట్నం నియోజక వర్గం బీజేపీ శ్రేణులల్లో నూతనోత్సాహన్ని నింపింంది. ఈ కార్యక్రమంలో పూర్వనేతలుసొంతగూటికి చేరుకోవడంతోపాటుగా మరికొంతమంది ప్రముఖులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీకి కొంతమేర బలాన్ని ఇచ్చిందనే చెప్పొచ్చు. బీజేపీ అసెంబ్లీ నియోజక క న్వీనర్ ముతాల్య భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీడీ పీ సీనియర్ నాయకుడు గుర్రం శ్రీనివాస్‌రెడ్డితోపాటు ప్రముఖ న్యాయవాది అంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది మంది న్యాయవాదులు బీజేపీలో చేరారు. గు ర్రం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ మండల పార్టీ నేతగా, జిల్లా నేతగా బాధ్యతలు నిర్వహించి కొంతకాలం క్రితం టీడీపీలో చే రారు. ఇదే కార్యక్రమంలో కందుకూరు ఎంపీపీ అశోక్ కూడా బీజేపీలో చేరారు. కాషాయమయం కిషన్‌రెడ్డి పర్యటనను పురస్కరించుకున ని ఆ పార్టీ నేతలు ఇబ్రహీంపట్నాన్ని కాషాయమయం చేశారు. శేరిగూడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు భారీ స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో పార్టీ పతాకావిష్కరణను పురస్కరించుకుని భారీగా ప్లెక్సీలతో హోరెత్తించారు.ఈ సందర్భంగా నగరపంచాయతీ కౌన్సిలర్లు ముత్యాల భాస్కర్, బండి విజయనిర్మల,నాయిని సత్యనారాయణ, టేకుల రాంరెడ్డిల ఆధ్వర్యంలో కిషన్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్, కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొరెడ్డి అర్జున్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు దొండ రమణారెడ్డి, సర్పంచ్ల సంఘం నాయకురాలు పొరెడ్డి సుమతీ అర్జున్‌రెడ్డి, దళిత మోర్చా నాయకుడు బోసుపల్లి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. వినతి పత్రం సమర్పించిన ఎంఎస్ఎఫ్ నేతలు కిషన్‌రెడ్డికి ఎంఎస్ఎఫ్ నేతలు కొండ్రు ప్రవీణ్‌కుమార్,ఎమ్మార్పీస్ నాయకుడు నర్కుడు అంజయ్యలు వినతి పత్రం అందజేశారు. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వికలాంగులు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు అర్హులైన వారందరకీ ఇచ్చేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు.