ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది...
- టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే మంచిరెడ్డి చేరికతో మరో మలుపు
- ఒకే పార్టీలో నలుగురు నియోజకవర్గ నాయకులు
- ఎంత వరకు కలిసి సాగుతారనేదానిపై సర్వత్రా చర్చనీయాంశం
ఆదిబట్ల : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేరికతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న నాయకులంతా ఇప్పుడు ఒకేగూటికి చేరారు.
దీంతో పార్టీలో అగ్ర నాయకులు కలిసిమెలసి ఇమడగలరా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒకే పార్టీలో నలుగురు అగ్రనాయకులు ఉండడం పార్టీ బలాన్ని పెంచేదే అయినప్పటికీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని పార్టీని ఎంత వరకు మందుకు తీసుకెళ్తారు అన్నదే అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, వంగేటి లకా్ష్మరెడ్డి వంటి నాయకులు ఉన్నారు.
నియోజకవర్గంలో పార్టీ క్షేత్రస్థాయిలో రోజురోజుకూ బలమైన పునాదులు నిర్మించుకుంటోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నగరపంచాయతీ చైర్మన్ కంబాళపల్లి భరత్‌కుమార్, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు యంపల్లి నిరంజన్‌రెడ్డి, యాచారం, హయత్‌నగర్ మండల పరిషత్ అధ్యక్షులు జ్యోతినాయక్, హరితధన్‌రాజ్, యాచారం జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వచ్చేనెల 4న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ ఉండడంతో టీడీపీకి చెందిన నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కో ఆపరేటివ్ చైర్మన్‌లు, కార్యకర్తలు భారీ ఎత్తున టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.