ముంచేశారు
ముంచేశారు. కన్నీళ్లలో ముంచేశారు. అవినీతిలో మునిగి 22 ప్రాణాలను నదిలో ముంచేశారు. కష్టాల్లో మునిగిన వారికి ప్రభుత్వం అన్నది ఒక పడవలా ఉండాలి. అలాంటి పడవే బోల్తాపడింది. అవినీతి, అలక్ష్యం అమాయకులను కబళించి వేసింది. ఒకరు తల్లిని పోగొట్టుకున్నారు. ఒకరు తండ్రిని. ఒకరు కన్నబిడ్డను. పాలకులు ఉసురు పోసుకున్నారు. నోట్లతో పాపం కడుక్కుందామనుకుంటున్నారు. బాధ్యులను చట్టబద్ధంగా శిక్షించడమే ఇప్పుడు కావలసింది.
అసలేం జరిగింది?
ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులమైన మేము కార్తీక మాసం సందర్భంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద బోటు ఎక్కేందుకు వెళ్లాం. అప్పటికే సమయం మించిపోయిందని చెప్పడంతో వెనుతిరిగి వెళ్లబోయాం. ఇంతలో ఒకతను వచ్చి బోటు ఉందని చెప్పి మమ్మల్ని బోటులోకి ఎక్కించారు. ఘాట్ వద్ద గ్యాలరీలో వేసిన ప్లాస్టిక్ కుర్చీలను బోటులో వేసి మమ్మల్ని కూర్చోబెట్టారు. లైఫ్ జాకెట్లు అడిగితే అవసరం లేదని చెప్పారు. ఆ బోటులో డ్రైవర్ కూడా లేడు. బయట నుంచి డ్రైవర్‌ను తెచ్చి బోటు నడపమని అడిగారు. తనకు ఎటు వెళ్లాలో తెలియదని డ్రైవర్ చెప్పడం, తాను దారి చూపుతానంటూ సూపర్వైజర్గా చెప్పుకునే వ్యక్తి అతన్ని ఒప్పించి తీసుకెళ్లడం మేం గమనించాం. అయితే, కృష్ణమ్మకు మంగళ హారతి చూడాలనే కోరికతో వాళ్లను నమ్మి కుటుంబ సభ్యులను కోల్పోయాం. పవిత్ర సంగమం వద్దకు చేరుకోగానే బోటు ఓ వైపునకు ఒరిగింది. బోటులో తాత్కాలికంగా ప్లాస్టిక్ కుర్చీలు వేసి కూర్చోబెట్టడంతో వాటిలో కూర్చున్న ప్రయాణీకులంతా బోటు ఒరిగిన వైపునకు పడిపోయారు. ప్రయాణీకులంతా ఓ వైపునకు పడిపోవడంతో బోటు కూడా తిరగబడి ఘోర ప్రమాదం జరిగిపోయింది. నదిలో పడిన వారిలో కొందరు పైకిలేచి బోటును పట్టుకుని నిల్చున్నాం. ఇంతలో అటువైపుగా వచ్చిన బోటులోని జాలర్లు కొందరి ప్రాణాలు కాపాడగలిగారు. అప్పటికైనా అధికారులు స్పందించి ఉంటే మరికొందరి ప్రాణాలు నిలిచి ఉండేవి. జాలర్లు ఒడ్డుకు చేర్చిన వారిలో కొందరిని ఆసుపత్రికి చేర్చగా 10 నిమిషాల ముందు తెచ్చి ఉంటే ప్రాణాలు కాపాడగలిగే వారమని డాక్టర్లు చెప్పారు. అధికారులు సమయానికి స్పందించకపోవడంతో ప్రాణనష్టం మరింత పెరిగింది. ఆ తరువాతైనా ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తుందని ఆశించాం. ప్రభుత్వం మాత్రం తూతూమంత్రపు చర్యలతో సరిపెట్టాలని ప్రయత్నిస్తున్న తీరు చూసి మరింత బాధ కలిగింది.
- ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు
ఇది మమ్మూటికీ ప్రభుత్వ వైఫల్యమే..!
రోడ్డుపై బైక్ తిరిగితేనే ఆపి సవాలక్ష ప్రశ్నలు వేస్తారు పోలీసులు.. నీటిలో తిరిగే బోట్లకు అనుమతులు లేకుండా తిప్పితే అధికారులు ఏం చేస్తున్నారు? 42 మంది ప్రాణాలు పోయాక రూల్స్ పాటించటంలేదని చెబుతారా? మా నాన్న అరవపల్లి గుర్నాథం (64) చనిపోయాడు.. మూడేళ్ల కిందటే మా నాన్నకు షష్టిపూర్తి చేశాం.. మేము ముగ్గురు అన్నదమ్ములం. కష్టపడి పనిచేసి మమ్మల్నందరినీ వృద్ధిలోకి తెచ్చాడు. మాకు పెళ్లిళ్లు అయి పిల్లలు పుట్టినా తండ్రి నీడలో ఉమ్మడిగానే ఉంటున్నాం.. రెండేళ్ల కిందట అనారోగ్యంతో అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి అన్నీ నాన్నే.. ఈ వయసులోనూ స్నేహితుల సహకారంతో సేవా కార్యక్రమాలు చేసేవారు. విహార యాత్రలు చేసేవారు. ఈనెల 11వ తేదీ రాత్రి విజయవాడకు వెళ్తున్నానని మాతో చెప్పారు. తెల్లవారుజామున మమ్మల్ని నిద్ర లేపకుండానే వెళ్లి అనంత లోకాలకు వెళ్లాడు. నిత్యం ఆయన జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి.. ఆయన కూర్చొనే సీటు చూసినా, ఆయన గది చూసినా కన్నీరు ఆగటంలేదు. ఆయన ఆత్మీయ పలకరింపులు ఇప్పటికీ మా చెవుల్లో మార్మోగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియాతో మా తండ్రి ప్రాణాలు వస్తాయా? ఈ గాయం చేసిన వారిని శిక్షించి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలి.
– అరవపల్లి నగేశ్, పవనకుమారి (బోటు ప్రమాదంలో మృతిచెందిన అరవపల్లి గుర్నాథం కుమారుడు, కోడలు), ఒంగోలు
అంబులెన్స్ లేదని గంటపాటు కూర్చోబెట్టి చంపేశారు!
బోటు ప్రమాదంలో చిక్కుకుని మత్స్యకారుల సహకారంతో బతికి బయటపడ్డ మా మామయ్య సీతారామయ్య (62)ను అంబులెన్స్ లేదని గంటపాటు ఒడ్డున కూర్చోబెట్టారు. ఆపై ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? మా అత్త, మామయ్య ఇద్దరూ మృతి చెందడం మా కుటుంబానికి పెద్ద విషాదమే. ఆరేళ్ల వయస్సున్న మా పెద్దపాప ఉజ్వల సాయిని మా మామయ్య విహారయాత్రకు తీసుకెళ్లాడు. ప్రమాదం జరిగిన సమయంలో బోటును పాప చేతితో పట్టించి బతికేలా చేసి ఆయన చనిపోయాడు. మనమడు కావాలనే ఆరాటం ఉండేది. మనమడు పుట్టి ఆరునెలలే అయింది. ఆయన ఆర్ఎంపీగా ఎందరో ప్రాణాలు కాపాడాడు. చివరకు ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల ఆయన ప్రాణాలే పోగోట్టుకున్నాడు. మా అత్తమ్మ అంజమ్మ(50) నిత్యం పూజలతో గడిపేది. దైవస్మరణలోనే ఉండేది. ఆ దేవుడు కూడా కాపాడలేకపోయాడు. నా భర్త ఇప్పటికీ తండ్రిచాటు బిడ్డే. నా భర్త వేదన తీర్చేదెవరు? ప్రభుత్వమిచ్చే ఎక్స్‌గ్రేషియాతో మా అత్తమామల ప్రాణాలు వస్తాయా? ప్రాణాలు తీసే బోట్లు నదిలో ఉంటాయని ఎవరికి తెలుసు.. వాకర్స్ క్లబ్ సభ్యులతో కలిసి తరచూ విహార యాత్రలకు వెళ్లేవారం.. అందరం ఆనందంగా ఉండేవారం.. మా ఆనందాన్ని తీసిన వారికి దేవుడే శిక్షవేయాలి.
– పసుపులేటి హేమలత (బోటు ప్రమాదంలో మృతి చెందిన పసుపులేటి సీతారామయ్య, అంజమ్మ కోడలు), ఒంగోలు
ప్రభుత్వ వైఫల్యంవల్లే ఇంతమంది బలి
బోటు ప్రమాదం నా కుటుంబంలో అత్యంత విషాదాన్ని మిగిల్చింది. మరో ఐదు నిమిషాల్లో ఒడ్డుకు చేరుతామని అనుకుంటుండగా పడవ బోల్తాపడి నా భార్య భారతి బోటు కింద చిక్కుకుని మృతి చెందగా, నేను బోటును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నా. ప్రభుత్వ వైఫల్యంవల్లే ఇన్ని ప్రాణాలు బలయ్యాయి. భక్తుల ప్రాణాలకు అత్యంత విలువనిచ్చి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించింది. బోటులో లైఫ్ జాకెట్లు, మరపడవలు ఉండి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు. హడావిడిగా పోస్టుమార్టం చేసి శవాలను బాధిత కుటుంబాల చేతుల్లో పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆ క్షణాలు తలచుకుంటే దు:ఖం ఆగటంలేదు. ప్రమాదంలో మృతిచెందిన నా భార్య కళ్ల ముందే కదలాడుతోంది. ఇటువంటి పరిస్థితి మరే కుటుంబానికి కలగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
– దాచర్ల శివన్నారాయణ, కామేపల్లి, జరుగుమల్లి మండలం
డాక్టర్‌గా చూడాలని కలలుగన్నారు!
నాకు ఏ లోటు లేకుండా ప్రేమతో పెంచి నన్ను డాక్టర్‌గా చూడాలని కలలుగన్న నా తల్లిదండ్రులు బోటు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి షాక్‌కు గురయ్యా. అంతా కలగా ఉంది. ఆదివారం ఇంటికి వస్తానని ఫోన్ చేస్తే కార్తీక మాసం సందర్భంగా అందరితో కలిసి విహార యాత్రకు వెళ్తున్నామని చెప్పడంతో ఇంటికి రాకుండా ఆగిపోయా. నేను ఇంటికి వస్తానని పట్టుబట్టి ఉంటే వెళ్లకుండా ఆగే వారేమో. ఒక్కగానొక్క కొడుకుని కావడంతో నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. నేను అడిగింది కాదనకుండా ఇచ్చారు. నాకాళ్లపై నేను నిలబడి వారిని బాగా చూసుకుందామనుకున్నా. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. నాకు జరిగిన నష్టం ఎవ్వరూ పూడ్చలేనిది. బోటు ప్రమాద ఘటనపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయితే నాకు జరిగిన నష్టం.. నా కుటుంబానికి జరిగిన అన్యాయం మరో కుటుంబానికి రాకుండా ఉండాలని గట్టిగా కోరుకుంటున్నాను.
– డాక్టర్ పవన్
వివాహం జరిగిన మా ఇంట్లో విషాదం!
నా కుమారుడి వివాహం జరిగిన నెల రోజులకే నా భార్యను బోటు ప్రమాదంలో కోల్పోవడం మా కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. మా అత్తయ్యను ఓదార్చడం నా వల్ల కావడంలేదు. ఆత్మీయులందర్నీ కోల్పోయాను. ప్రమాదంలో నేను బతికానన్న సంతోషం కంటే నా భార్యను కోల్పోయాననే బాధ నన్ను ఎక్కువగా కలచి వేస్తోంది. పడవ ప్రమాదంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నదీతీరంలో టూరిజం అధికారులు, పోలీసులు ఉండి ఉంటే అసలు ప్రైవేట్ బోట్ ఎక్కేవాళ్లమే కాదు. అందరం చదువుకున్న వాళ్లమే. బోటుకు అనుమతి లేదని చెప్పేవారు లేకపోవడంవల్లే మేమంతా అందులో ఎక్కాం. నియంత్రించడానికి ప్రభుత్వ అధికారులెవ్వరూ లేరు. చావుని తప్పించుకుని బయటపడ్డాక ఒడ్డున చేరిన మమ్మల్ని పట్టించుకోవడానికి ఎవరూ లేరు. ప్రజల ప్రాణాలంటే ఇంత చులకనా?
–పెండేల శ్రీనివాసరావు
ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు!
బోటు ప్రమాద ఘటన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంవల్లే జరిగింది. సహాయక చర్యల్లోనూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రమాదంలో మా అమ్మానాన్నలను (సాయని కోటేశ్వరరావు, వెంకాయమ్మ) కోల్పోయాను. నా కుమారుడు సాయి, పెద్దమ్మ కొడుకు కంటా వెంకటేశ్వర్లు, అతని భార్య తులసిలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గతంలో కృష్ణా పుష్కరాల సమయంలో హారతి కార్యక్రమం చూడలేకపోయామనే ఉద్దేశంతో కార్తీక దీపారాధన చూడాలని అమ్మానాన్న మిత్రులందరితో కలిసి వెళ్లారు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క కుమార్తెను. మా నాన్న ఆర్టిసి ట్రాఫిక్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఒంగోలు రంగారాయుని చెరువు వాకర్స్ క్లబ్ అధ్యక్షునిగాను, సుపరిపాలన వేదిక పాలకవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు. అలాంటి మా నాన్నను, అమ్మను ఈ దుర్ఘటనలో కోల్పోవడంతో సమాజంతో మాకున్న బాంధవ్యాన్ని కోల్పోయాం. ప్రమాదం తరువాత ఒక అధికారి.. బోటుకు అనుమతి లేదు అంటూ బోటు నిర్వాహకులతో వాదన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో మీద కూడా అనుమానాలున్నాయి. ఈ వీడియో వెనుక కుట్రదారులను ప్రభుత్వం కనిపెట్టి శిక్షించాలి.
– సాయని శ్రీలక్ష్మి, ఉపాధ్యాయిని
అక్షింతలు వేసి అనంత లోకాలకు...
‘ఆ రోజు నా పుట్టిన రోజు. నాన్న ఉదయాన్నే లేచి అక్షింతలు వేశాడు. సాయంత్రానికొచ్చిన తరువాత వేడుకలు జరుపుకుందామని చెప్పాడు. కృష్ణానదిలో కృష్ణమ్మ హారతిని చూసేందుకు నాన్న తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. నాన్న కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. కృష్ణానదిలో పడవ మునిగిందన్న వార ్తను టీవీ ఛానళ్లలో చూశాను. ఒంగోలుకు చెందిన వారు పడవలో ఉన్నట్లు చూపించారు. ఏది జరగకూడదని భయపడ్డామో అదే జరిగింది. పడవప్రమాదంలో నాన్న మరణించాడు. నా పుట్టిన రోజునాడు దుఃఖాన్ని మిగిల్చాడు. కృష్ణమ్మ హారతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. వారి విషయంలో ప్రభుత్వం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నా ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. నాన్న ప్రాణాలు పోయేవి కావు. అత్యవసర చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయలేదు’ అంటూ ఒంగోలుకు చెందిన బూసరపల్లి వెంకటేశ్వర్లు కుమార్తె వెంకట సౌజన్య కన్నీళ్ల పర్యంతమైంది. కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంలో ఆయన మరణించడంతో ఈనెల 15వ తేదీ అద్దంకిలో జరగాల్సిన వెంకటేశ్వర్లు తమ్ముని కొడుకు నిశ్చితార్థం కూడా ఆయన మరణంతో నిలిచిపోయింది.
– బూసరపల్లి వెంకటేశ్వర్లు కుమార్తె వెంకట సౌజన్య
ఆఖరి దశలో ఆదరణ ఏది?
కట్టుకున్న భర్త ఎప్పుడో కాలం చేసినా కడుపున పుట్టిన బిడ్డ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. తనకు ఎప్పుడు ఏ అవసరమొచ్చినా దగ్గరుండి చూసుకునే కోడలు ఇక లేదన్న వార్త ఆ తల్లిని ఎంతో క్షోభకు గురిచేసింది. బోటు ప్రమాదంలో ఈదుమూడి గ్రామానికి చెందిన కఠారి సుధాకర్‌రావు, భూలక్ష్మి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. చివరి రోజుల్లో అండగా ఉంటారనుకున్న కొడుకు, కోడలిని పోగొట్టుకున్న సుధాకర్‌రావు తల్లి కఠారి రమణమ్మను చూస్తే అందరికీ గుండె బరువెక్కుతుంది. ప్రస్తుతం తల్లి రమణమ్మను చూసుకుంటూ చిన్న కుమార్తె స్వరూపారాణి ఈదుమూడిలో ఉంటున్నారు. బోటు ప్రమాదంలో స్వరూపారాణి తన అన్న, వదిన చనిపోగా, అదే ప్రమాదంలో తన అక్క సుబ్బాయమ్మ అదృష్టవశాత్తూ బతికి బయటపడింది. ప్రమాదం జరిగిన తరువాత తన సోదరి బోటు కింద చెక్కను ఆధారం చేసుకుని సుమారు రెండు గంటలపాటు అరుస్తూనే ఉండడంతో సమీపంలోని జాలర్లు ఆ అరుపులు విని కాపాడగలిగారని తెలిపింది.
– కఠారి రమణమ్మ, ఈదుమూడి (మృతుడు కఠారి సుధాకరరావు తల్లి)
పోయిన మా బిడ్డ ప్రాణాలు తిరిగిస్తారా..?
అయ్యా మీరిచ్చే డబ్బును మేము ఏం చేసుకుంటాం.. ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న మా దత్త పుత్రుడి ప్రాణాలు తిరిగిస్తారా.. మేం సాక్కుంటున్న రిత్విక్ రాయ్ (12)ను తెచ్చిస్తారా? విహారం విషాదంగా మారుతుందని ఊహించలేకపోయాం. బోటులో వెళ్తానంటూ మారాం చేయడంతో రిత్విక్ రాయ్‌ను మా స్నేహితుడి కొడుకుతో కలిపి పంపాను. అక్కడి అధికారుల నిర్లక్ష్యం.. బోటు యజమానుల ధన దాహానికి బిడ్డను కోల్పోవాల్సిన దుస్థితి మాకు ఏర్పడింది. ప్రమాదం జరిగిందని తెలియగానే మాకు కాళ్లూ చేతులు ఆడలేదు. మా బిడ్డతోపాటు స్నేహితుల కుటుంబ సభ్యులు అనేకమంది చనిపోయిన ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోంది.
– నున్నా కృష్ణమూర్తి, మృతుడు రిత్విక్ రాయ్ పెదనాన్న
కళ్ల ముందే భార్య, బిడ్డలను కోల్పోయా!
భార్యా, బిడ్డతో కలిసి బోటులో ప్రయాణిస్తుండగా జరిగిన దుర్ఘటన ఇంకా కళ్ల ముందు మెదులుతోంది. హఠాత్తుగా జరిగిన ప్రమాదంతో అంతా చెల్లాచెదురుగా నదిలోకి పడిపోయాం. నాకు ఈత రావడంతో నీళ్లలో నుంచి పైకి లేచి పక్కనే పడి ఉన్న బోటును పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రక్షంచే వారి కోసం ఎదురు చూశా. ఆ సమయంలో నేను, నా చుట్టుపక్కల వారు చేస్తున్న ఆర్తనాదాలు విన్న సమీపంలోని ఓ బోటులోని జాలర్లు అటుగా వచ్చి మమ్మల్ని ఒడ్డుకు చేర్చి మా ప్రాణాలు కాపాడారు. ఎంతమంది బతికి బయటపడ్డారో.. ఎంత మంది ప్రాణాలు విడిచారో తెలియక తీవ్ర మానసిక క్షోభ అనుభవించాం. నా ప్రాణాలు నిలిచాయనే ఆనందం కంటే కట్టుకున్న భార్య, కన్న కూతురు కళ్ల ముందే జలసమాధయ్యారనే బాధతో కుప్పకూలిపోయా. మా కుటుంబ సభ్యులు.. మాతోపాటు వచ్చిన మరో ఇరవై మంది మృతి చెందారు. మాకు జరిగిన అన్యాయం.. మేం అనుభవించే మానసిక క్షోభ మరే కుటుంబానికి జరగకుండా ఉండాలి.
– తిప్పారెడ్డి కోటిరెడ్డి
ప్రభుత్వం నిర్లక్ష్యం ఇలా ఉంది
నదుల్లో బోటు నిర్వహణకు ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతి ఇచ్చేందుకు స్పష్టమైన విధి విధానాలున్నాయి. కానీ వాటిలో ఒక్కటీ కూడా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. బోటుకు అనుమతి కోసం ముందుగా జలవనరుల శాఖ అనుమతి ఇవ్వాలి. ముందుగా బోటు ఆపరేటర్ దరఖాస్తు చేసుకున్న జల మార్గాన్ని పరిశీలించాలి. ఆ మార్గంలో బోటును నడపవచ్చా లేదా అన్నది నిర్ధారించాలి. బోటు సైజు, బరువు, సామర్థ్యం ఎంత ఉండాలన్నది శాస్త్రీయంగా నిర్ణయించాలి. ప్రమాదాలు సంభవిస్తే పర్యాటకులను కాపాడేందుకు తగినన్ని లైఫ్ జాకెట్లు, ఇతర పరికరాలు ఉన్నాయో లేదా అన్నది చూడాలి. అన్నీ సక్రమంగా ఉంటే జలవనరుల శాఖ అనుమతి ఇవ్వాలి. అనంతరం అగ్నిమాపక శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేయాలి. బోటు నదిలో ఉండగా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే నివారించేందుకు సరైన అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా లేదా అన్నది చూడాలి. అనంతరం రెవెన్యూ శాఖ పరిశీలించాలి. కాని కృష్ణానదిలో ప్రమాదానికి గురైన బోటు విషయంలో ఈ నిబంధనల్లో ఒక్కటి కూడా పాటించనే లేదు. ఆ బోటుకు అసలు జలవనరుల శాఖ, అగ్నిమాపక శాఖలు పరిశీలించనే లేదు. అనుమతుల ఊసే వర్తించదు. ఇక పర్యాటక శాఖ కూడా ఆ బోటు అనుమతి లేదు. కానీ ఆ బోటు దర్జాగా కృష్ణా నదిలోకి ప్రవేశించింది. లైఫ్ జాకెట్లు లేవు... ఇతర భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించనే లేదు. ఫలితం 22 మంది కృష్ణమ్మ నడిమధ్యలో జలసమాధి అయ్యారు. ఎందుకంటే కష్ణా నదిలో బోటింగ్ మాఫియా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. కష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు తమ బినామీల ద్వారా సాగిస్తున్న బాగోతం ఉంది. గత ఏడాది విజిలెన్స్ అధికారులు దాడులు చేసి అనుమతుల్లేని బోట్లను సీజ్ చేశారు. కానీ అంతలోనే వాటిని జలవనరుల శాఖ అధికారులు విడిచిపెట్టేశారు. ఓ మంత్రి ఒత్తిడితోనే అలా చేశారన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ పెద్దలు అధికార యంత్రాంగం అప్పుడే మేల్కొని ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు... ప్రభుత్వ పెద్దల అవినీతి... అధికారుల అలక్ష్యం 22మంది ప్రాణాలను బలిగొంది.