Iconic Complex
-
ఆర్ఆర్ఆర్కు అరుదైన గౌరవం
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్‌లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ సినిమా హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రదర్శితం కానుంది. వచ్చే ఏడాది మే 11న ఈ మూవీ స్క్రీనింగ్ ఉంటుందని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ కార్యక్రమంలో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కన్సర్ట్ ఇవ్వనున్నారు.కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 2022 మార్చి 25న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో (నాటు నాటు పాటకు గాను) ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులు కూడా లభించాయి. కాగా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమా ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో 2019లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. -
కనుల విందైన స్కై విల్లాలు.. ఆకాశంలో నడక, రోడ్డు మీద పడవ!
సాక్షి, హైదరాబాద్: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు..’ అన్నాడు.. ఎప్పుడో ఓ సినీకవి. ఇప్పుడు కూడా మన యువ బిల్డర్లు వినూత్న ఆలోచనలతో, అబ్బుర పరిచే కట్టడాలను నిర్మిస్తూ కనులకు విందు చేస్తున్నారు. ►హైదరాబాద్ మెహదీపట్నం నుంచి రాయదుర్గం వెళ్తుంటే.. ఆకాశంలో అటు ఇటూ నడిచేందుకు వీలుగా నిర్మించిన ఓ ఆకాశ హర్మ్యం కనిపిస్తుంది. అంటే మూడు టవర్లను కలుపుతూ స్కై ఐల్యాండ్‌ను నిర్మిస్తోంది ఓ నిర్మాణ సంస్థ. చుట్టూ పచ్చదనం మధ్య ఆకాశంలో కూర్చుని నగరాన్ని చూసేయొచ్చన్న మాట. ►అప్పా జంక్షన్ నుంచి కిస్మత్పూర్ వెళుతుంటే అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఓ భారీ పడవ దర్శనమిస్తుంది. ఇదేంటబ్బా అని ఒక్క క్షణం ఆగిచూస్తే..అదో భారీ నివాస సముదాయం. ఇవే కాదు మరెన్నో స్కై విల్లాలు, విల్లామెంట్‌లు రకరకాల పేర్లతో వినూత్న శైలిలో కొలువుదీరుతున్నాయి. నాలుగు గోడలు, పైకప్పు వంటి సాధారణ గృహాలకు కాలం చెల్లింది. ఐకానిక్ టవర్లు ఆకట్టుకునే ఎలివేషన్లతో నగరవాసుల్ని కట్టిపడేస్తున్నాయి. వినూత్న శైలి భవనాలను నగరవాసులు కోరుకుంటుండటంతో.. వారి అభిరుచికి తగ్గటుగానే యువ డెవలపర్లు నిర్మాణాలను చేపడుతున్నారు. ఆయా ప్రాంతాలకు ల్యాండ్ మార్క్ల్లా నిలిచిపోయేలా ప్రాజెక్టులకు రూపుదిద్దుతున్నారు. విదేశీ ఆర్కిటెక్ట్‌లతో.. భారీ భవన నిర్మాణాలను కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు యువ బిల్డర్లు పెద్ద కసరత్తే చేస్తున్నారు. స్థానిక బిల్డర్లతో పాటు ఇతర రాష్ట్రాల బిల్డర్లు కూడా నగరంలో ప్రాజెక్ట్‌లను చేపడుతుండటంతో ఎలివేషన్ల ఎంపికలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. ప్రపంచ స్థాయి డిజైన్ల కోసం సింగపూర్, చైనా, జపాన్, దుబాయ్ వంటి దేశాలలో పర్యటించి, క్షేత్ర స్థాయిలో అక్కడి భవన నిర్మాణాలు పరిశీలించడంతో పాటు వాటిని తీర్చిదిద్దిన ఆర్కిటెక్ట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారితో హైదరాబాద్‌లోని భవనాలకు డిజైన్లు చేయిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో వస్తున్నాయంటే.. వినూత్న డిజైన్లతో కూడిన భవన నిర్మాణలు ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లో వస్తున్నాయి. కోకాపేట, మంచిరేవుల, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, నల్లగండ్ల, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, తెల్లాపూర్, పుప్పాలగూడ, రాయదుర్గంతో పాటు కొంపల్లి, ఆదిభట్ల వంటి ప్రాంతాలలో ఈ తరహా ప్రాజెక్ట్‌లు ఎక్కువగా వస్తున్నాయి. నగరంలోని పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ ఐకానిక్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ధర 5–10 శాతం ఎక్కువ.. గత 3–4 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఆకాశ హరŠామ్యల నిర్మాణం జోరందుకుంది. 40 కంటే ఎత్తయిన హైరైజ్ భవనాలు చేపట్టేందుకు బిల్డర్లు పోటీ పడుతున్నారు. నేటి అవసరాలకు, కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా గ్రీనరీ, వాస్తుకు ప్రాధాన్యం ఇస్తూ ఎలివేషన్లను ఎంపిక చేస్తున్నారు. సాధారణ అపార్ట్మెంట్లతో పోలిస్తే ఐకానిక్ ప్రాజెక్ట్‌లలో ధర కొంచం ఎక్కువగా ఉంటుంది. ఆయా నిర్మాణాలకు నైపుణ్యం ఉన్న కూలీలు, భారీ యంత్రాలు, సాంకేతికత అవసరం. ఇందుకోసం బిల్డర్లు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తారు. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ చార్జీలు ఉంటాయి. అందుకే ఈ తరహా ప్రాజెక్ట్‌ల్లో ధర 5–10 శాతం ఎక్కువగా ఉంటుంది. ఆఫీసు భవనాలు కూడా.. వాస్తవానికి నివాస సముదాయాల కంటే ఆఫీసు భవనాలను వినూత్న శైలిలో నిర్మించేందుకు బిల్డర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే నివాసాలకు వాస్తు పక్కాగా పాటించాల్సిందే. అదే ఆఫీసు బిల్డింగ్‌లకు కొంత వెసులుబాటు ఉంటుంది. టాటా, మైక్రోసాఫ్ట్, డెలాయిట్ వంటి ఇతర దేశీ, విదేశీ సంస్థలు వినూత్న శైలి నిర్మాణాలనే కోరుకుంటాయి. ఐకియా, టీ–హబ్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ భవనాలు ఆఫీసు విభాగంలో యూనిక్ బిల్డింగ్స్ కోవలోకే వస్తాయి. త్వరలోనే పశ్చిమ హైదరాబాద్‌లో ఓ నిర్మాణ సంస్థ వృత్తం, పెంటాగాన్ ఆకారంలో కార్యాలయ నిర్మాణాలు చేపట్టనుంది. కొత్తదనం కోరుకుంటున్నారు ఆభరణాలు, దుస్తులు, సంగీతం ప్రతి దాంట్లో కొత్తదనాన్ని కోరుకున్నట్లే ఇప్పుడు చాలామంది ఇంటి నిర్మాణ శైలిలోనూ కొత్తదనం కోరుకుంటున్నారు. డబ్బా ఆకారంలో ఇళ్లను ఇష్టపడటం లేదు. చూడటానికి వినూత్నంగా ఆ ప్రాంతానికే ల్యాండ్‌మార్క్‌లా నిలిచే ప్రాజెక్ట్‌లను కోరుకుంటున్నారు. – జి.రామ్మోహన్, చీఫ్ ఆర్కిటెక్ట్, మోహన్ కన్సల్టెంట్స్ -
అసెండాస్ చేతిలో అమరావతి
మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక.. తొలి దశలో 3వేల ఎకరాలు * ఐకానిక్ కాంప్లెక్స్‌కు ఉచితంగా 250 ఎకరాలు * 375 ఎకరాల్లో గవర్నమెంట్ కాంప్లెక్స్‌లు... * సింగపూర్ కంపెనీతో సర్కారు బేరసారాలు, మంతనాలు * సింగపూర్... ఏపీ ప్రభుత్వాల మధ్య జాయింట్ వెంచర్ కుదరదు సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీని ఎంపిక చేసేందుకు ప్రభుత్వ పెద్దలు మంతనాలు, బేరసారాలను కొనసాగిస్తున్నారు. ఆ కంపెనీ ఎండీతో రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి(సీఆర్డీఏ) చర్చలు జరుపుతోంది. పూర్తి వాణిజ్య విధానంలోనే మాస్టర్ డెవలపర్ సంస్థ ఎంపికను చేపట్టాలని రాష్ట్రప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. అసెండాస్ కంపెనీ ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా విధానాలను రూపొందించే పనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. తొలిదశలో 3వేల ఎకరాలను కంపెనీకి అప్పగించనున్నారు. ఇందులో 375 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. వీటి నిర్మాణ బాధ్యతలనూ అసెండాస్‌కే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. పూర్తి హక్కుల కోసం కంపెనీ షరతులు తొలిదశలో ఇచ్చే 3వేల ఎకరాల భూములపై పూర్తి హక్కులు ఇవ్వాల్సిందిగా అసెండాస్ కంపెనీ షరతు విధించింది. ఐకానిక్ కాంప్లెక్స్(భారీ వాణిజ్య సముదాయం) నిర్మాణం కోసం 250 ఎకరాలను కంపెనీకి ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందులో ఐకానిక్ కాంప్లెక్స్ నిర్మించిన తర్వాత కంపెనీ విక్రయించుకోనుంది. అందుకు అనుగుణంగా ఈ 250 ఎకరాలపై హక్కులు ఇవ్వాల్సిందిగా షరతు విధించింది. రాష్ట్రప్రభుత్వం 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తామని, అభివృద్ధి చేసిన తర్వాత హక్కులు కల్పిస్తామని చెబుతున్నట్టు తెలిసింది. ఈ 250 ఎకరాల్లో కనీసం 20 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు కంపెనీ అంగీకరించింది. స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపికను అక్టోబర్ 22వ తేదీ కన్నా ముందుగానే పూర్తి చేయాల్సిందిగా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఎటువంటి జాయింట్‌వెంచర్ ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే నూతన రాజధానిలో భూముల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో వాటా ఇవ్వాలని షరతు విధించింది. తొలిదశ రాజధాని అభివృద్ధి అక్టోబర్ 2018 నాటికి పూర్తి చేయడానికి కంపెనీ అంగీకరించింది. తొలిదశలో 3వేల ఎకరాల అభివృద్ధితోపాటు మిగతా రాజధాని అభివృద్ధిని 20 నుంచి 30 ఏళ్లల్లో అభివృద్ధి చేసే హక్కు కల్పించాలని అసెండాస్ పేర్కొంది. ఐదేళ్లలో 3వేల ఎకరాలను అభివృద్ధి చేయని పక్షంలో సమాంతర అభివృద్ధికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం పేర్కొంటోంది. 70 శాతం అభివృద్ధి పూర్తి అయిన పిదప, తర్వాత దశ అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరుతోంది. అయితే, తర్వాత దశపైన ఒత్తిడి తేవద్దని ప్రభుత్వం పేర్కొంటోంది. భూమి ధరల నిర్ధారణ కమిటీ చైర్మన్‌గా కంపెనీ ఎండీయే ఉంటారని, సభ్యులుగా ప్రభుత్వానికి చెందిన వారితో సమానంగా కంపెనీకి చెందిన వారు ఉంటారని అసెండాస్ స్పష్టం చేసింది. ఐకానిక్ కాంప్లెక్స్‌కు 250 ఎకరాలు ఉచితంగా ఇవ్వడంతోపాటు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని, రాజధానిలో మౌలికవసతుల కల్పనకు వెచ్చించిన ఖర్చుపోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే పంచుకోవాలని కంపెనీ పేర్కొంది. రాజధాని నిర్మాణంలో ఇతరత్రా భారాలకు బాధ్యత వహించడానికి అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. సంయుక్త అమలు కమిటీకి, బృహత్తర ప్రణాళికపై ఏపీ, సింగపూర్ల మధ్య అవగాహన ఒప్పందానికి అంగీకరిస్తామని అసెండాస్ తెలిపింది. మధ్యలో బాధ్యతల నుంచి తప్పుకునే క్లాజును చేర్చేందుకు కంపెనీ అంగీకరించడం లేదు. నూతన రాజధాని నిర్మాణం శంకుస్థాపనకోసం అక్టోబర్ 22న సింగపూర్ ప్రధానమంత్రి రావడానికి ముందుగానే స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఖరారు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నూతన రాజధానిలో రహదారులు, నీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి మౌలికవసతుల కల్పన పనులన్నింటికీ అయ్యే వ్యయాన్ని పూర్తిగా మాస్టర్ డెవలపర్‌గా ఎంపికయ్యే సంస్థనే తొలుత భరిస్తుంది. నూతన రాజధానిలో పరిశ్రమలకు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు భూములను 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నారు. ఆ భూములపై లీజు ద్వారా వచ్చిన డబ్బులను, అలాగే సీఆర్డీఏకు వచ్చిన నిధులను మాస్టర్ డెవలపర్‌కు ప్రభుత్వం చెల్లించనుంది. ‘రాజధాని’ పరిధిలో సవివరమైన ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: రాజధానిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో సవివరమైన మాస్టర్ ప్రణాళిక రూపకల్పన, ల్యాండ్‌పూలింగ్ స్కీములో భూములిచ్చిన వారికి ఎక్కడ ప్లాట్లు ఇవ్వాలనే ప్రణాళికను రూపొందించే బాధ్యతలను సింగపూర్‌కు చెందిన సుర్బానా కంపెనీకి నామినేషన్‌పై అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జాప్యం అయిందని, కొత్తగా కంపెనీలను ఆహ్వానించినా వారికి అవగాహన ఉండదని, సుర్బానా కంపెనీకి రాజధాని మాస్టర్ ప్రణాళిక రూపొందించిన అనుభవం ఉన్నందున సవివరమైన మాస్టర్ ప్రణాళిక రూపకల్పన, ల్యాండ్‌పూలింగ్ స్కీము ఖరారు బాధ్యతలను సుర్బానాకే అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో సీఆర్డీఏ సమావేశంలో సుర్బానాకు రూ.11.92కోట్లకు నామినేషన్‌పై అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంస్థ 217చ.కి.మీ. పరిధిలో గల 6వేల హెక్టార్లలో సర్వే, ఎక్కడ ఏది రావాలో క్షేత్రస్థాయిలో మార్కింగ్, ల్యాండ్‌పూలింగ్ విధానంలో భూములిచ్చిన రైతులకు తిరిగి ప్లాట్లు ఎక్కడ ఇవ్వాలో నిర్ధారిస్తుంది. 29 గ్రామాల్లోని వారికి పాట్లు ఎక్కడెక్కడ వస్తాయో మార్కింగ్ చేయడంతో పాటు 217 చ.కి.మీ. పరిధిలో భూమి వినియోగం, రవాణా, ఇతర మౌలికవసతుల ప్రణాళికను సుర్బానా రూపొందించనుంది. 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్ 15కల్లా సవివరమైన ప్రణాళికను ప్రభుత్వానికి అందజేయాలి. అప్పటి నుంచి మూడునెలల్లోగా ల్యాండ్‌పూలింగ్ స్కీము ప్రణాళికను, మొత్తం ప్రణాళికను ఆరునెలల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. సుర్బానా సమర్పించిన ప్రతి పాదనలను యథాతథంగా ముఖ్యమంత్రి ఆమోదించారు. మాస్టర్ ప్రణాళిక ఖరారు కోసం ఒక హెక్టార్‌కు రూ.1,646 చొప్పున రూ.3.57కోట్ల వ్యయం అవుతుందన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ల్యాండ్‌పూలింగ్ స్కీము ఖరారు కోసం హెక్టార్‌కు రూ.3,292 చొప్పున రూ.7.15 కోట్ల వ్యయం, ఇతర మార్కింగ్‌ల కోసం హెక్టార్‌కు రూ.549 చొప్పున రూ.1.19 కోట్ల వ్యయం అవుతుందని సుర్బానా చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.