సాక్షి, హైదరాబాద్: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు..’ అన్నాడు.. ఎప్పుడో ఓ సినీకవి. ఇప్పుడు కూడా మన యువ బిల్డర్లు వినూత్న ఆలోచనలతో, అబ్బుర పరిచే కట్టడాలను నిర్మిస్తూ కనులకు విందు చేస్తున్నారు.
►హైదరాబాద్ మెహదీపట్నం నుంచి రాయదుర్గం వెళ్తుంటే.. ఆకాశంలో అటు ఇటూ నడిచేందుకు వీలుగా నిర్మించిన ఓ ఆకాశ హర్మ్యం కనిపిస్తుంది. అంటే మూడు టవర్లను కలుపుతూ స్కై ఐల్యాండ్‌ను నిర్మిస్తోంది ఓ నిర్మాణ సంస్థ. చుట్టూ పచ్చదనం మధ్య ఆకాశంలో కూర్చుని నగరాన్ని చూసేయొచ్చన్న మాట.
►అప్పా జంక్షన్ నుంచి కిస్మత్‌పూర్ వెళుతుంటే అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఓ భారీ పడవ దర్శనమిస్తుంది. ఇదేంటబ్బా అని ఒక్క క్షణం ఆగిచూస్తే..అదో భారీ నివాస సముదాయం.
ఇవే కాదు మరెన్నో స్కై విల్లాలు, విల్లామెంట్లు రకరకాల పేర్లతో వినూత్న శైలిలో కొలువుదీరుతున్నాయి. నాలుగు గోడలు, పైకప్పు వంటి సాధారణ గృహాలకు కాలం చెల్లింది. ఐకానిక్ టవర్లు ఆకట్టుకునే ఎలివేషన్లతో నగరవాసుల్ని కట్టిపడేస్తున్నాయి. వినూత్న శైలి భవనాలను నగరవాసులు కోరుకుంటుండటంతో.. వారి అభిరుచికి తగ్గటుగానే యువ డెవలపర్లు నిర్మాణాలను చేపడుతున్నారు. ఆయా ప్రాంతాలకు ల్యాండ్ మార్క్‌ల్లా నిలిచిపోయేలా ప్రాజెక్టులకు రూపుదిద్దుతున్నారు.
విదేశీ ఆర్కిటెక్ట్‌లతో..
భారీ భవన నిర్మాణాలను కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు యువ బిల్డర్లు పెద్ద కసరత్తే చేస్తున్నారు. స్థానిక బిల్డర్లతో పాటు ఇతర రాష్ట్రాల బిల్డర్లు కూడా నగరంలో ప్రాజెక్ట్‌లను చేపడుతుండటంతో ఎలివేషన్ల ఎంపికలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. ప్రపంచ స్థాయి డిజైన్ల కోసం సింగపూర్, చైనా, జపాన్, దుబాయ్ వంటి దేశాలలో పర్యటించి, క్షేత్ర స్థాయిలో అక్కడి భవన నిర్మాణాలు పరిశీలించడంతో పాటు వాటిని తీర్చిదిద్దిన ఆర్కిటెక్ట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారితో హైదరాబాద్‌లోని భవనాలకు డిజైన్లు చేయిస్తున్నారు.
ఏ ప్రాంతాల్లో వస్తున్నాయంటే..
వినూత్న డిజైన్లతో కూడిన భవన నిర్మాణలు ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లో వస్తున్నాయి. కోకాపేట, మంచిరేవుల, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, నల్లగండ్ల, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, తెల్లాపూర్, పుప్పాలగూడ, రాయదుర్గంతో పాటు కొంపల్లి, ఆదిభట్ల వంటి ప్రాంతాలలో ఈ తరహా ప్రాజెక్ట్‌లు ఎక్కువగా వస్తున్నాయి. నగరంలోని పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ ఐకానిక్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి.
ధర 5–10 శాతం ఎక్కువ..
గత 3–4 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఆకాశ హరŠామ్యల నిర్మాణం జోరందుకుంది. 40 కంటే ఎత్తయిన హైరైజ్ భవనాలు చేపట్టేందుకు బిల్డర్లు పోటీ పడుతున్నారు. నేటి అవసరాలకు, కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా గ్రీనరీ, వాస్తుకు ప్రాధాన్యం ఇస్తూ ఎలివేషన్లను ఎంపిక చేస్తున్నారు. సాధారణ అపార్ట్‌మెంట్లతో పోలిస్తే ఐకానిక్ ప్రాజెక్ట్‌లలో ధర కొంచం ఎక్కువగా ఉంటుంది. ఆయా నిర్మాణాలకు నైపుణ్యం ఉన్న కూలీలు, భారీ యంత్రాలు, సాంకేతికత అవసరం. ఇందుకోసం బిల్డర్లు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తారు. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ చార్జీలు ఉంటాయి. అందుకే ఈ తరహా ప్రాజెక్ట్‌ల్లో ధర 5–10 శాతం ఎక్కువగా ఉంటుంది.
ఆఫీసు భవనాలు కూడా..
వాస్తవానికి నివాస సముదాయాల కంటే ఆఫీసు భవనాలను వినూత్న శైలిలో నిర్మించేందుకు బిల్డర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే నివాసాలకు వాస్తు పక్కాగా పాటించాల్సిందే. అదే ఆఫీసు బిల్డింగ్‌లకు కొంత వెసులుబాటు ఉంటుంది. టాటా, మైక్రోసాఫ్ట్, డెలాయిట్ వంటి ఇతర దేశీ, విదేశీ సంస్థలు వినూత్న శైలి నిర్మాణాలనే కోరుకుంటాయి. ఐకియా, టీ–హబ్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ భవనాలు ఆఫీసు విభాగంలో యూనిక్ బిల్డింగ్స్ కోవలోకే వస్తాయి. త్వరలోనే పశ్చిమ హైదరాబాద్‌లో ఓ నిర్మాణ సంస్థ వృత్తం, పెంటాగాన్ ఆకారంలో కార్యాలయ నిర్మాణాలు చేపట్టనుంది.
కొత్తదనం కోరుకుంటున్నారు
ఆభరణాలు, దుస్తులు, సంగీతం ప్రతి దాంట్లో కొత్తదనాన్ని కోరుకున్నట్లే ఇప్పుడు చాలామంది ఇంటి నిర్మాణ శైలిలోనూ కొత్తదనం కోరుకుంటున్నారు. డబ్బా
ఆకారంలో ఇళ్లను ఇష్టపడటం లేదు. చూడటానికి వినూత్నంగా ఆ ప్రాంతానికే ల్యాండ్‌మార్క్‌లా నిలిచే ప్రాజెక్ట్‌లను కోరుకుంటున్నారు.
– జి.రామ్‌మోహన్, చీఫ్ ఆర్కిటెక్ట్, మోహన్ కన్సల్టెంట్స్
Comments
Please login to add a commentAdd a comment