architects
-
కనుల విందైన స్కై విల్లాలు.. ఆకాశంలో నడక, రోడ్డు మీద పడవ!
సాక్షి, హైదరాబాద్: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు..’ అన్నాడు.. ఎప్పుడో ఓ సినీకవి. ఇప్పుడు కూడా మన యువ బిల్డర్లు వినూత్న ఆలోచనలతో, అబ్బుర పరిచే కట్టడాలను నిర్మిస్తూ కనులకు విందు చేస్తున్నారు. ►హైదరాబాద్ మెహదీపట్నం నుంచి రాయదుర్గం వెళ్తుంటే.. ఆకాశంలో అటు ఇటూ నడిచేందుకు వీలుగా నిర్మించిన ఓ ఆకాశ హర్మ్యం కనిపిస్తుంది. అంటే మూడు టవర్లను కలుపుతూ స్కై ఐల్యాండ్‌ను నిర్మిస్తోంది ఓ నిర్మాణ సంస్థ. చుట్టూ పచ్చదనం మధ్య ఆకాశంలో కూర్చుని నగరాన్ని చూసేయొచ్చన్న మాట. ►అప్పా జంక్షన్ నుంచి కిస్మత్పూర్ వెళుతుంటే అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఓ భారీ పడవ దర్శనమిస్తుంది. ఇదేంటబ్బా అని ఒక్క క్షణం ఆగిచూస్తే..అదో భారీ నివాస సముదాయం. ఇవే కాదు మరెన్నో స్కై విల్లాలు, విల్లామెంట్‌లు రకరకాల పేర్లతో వినూత్న శైలిలో కొలువుదీరుతున్నాయి. నాలుగు గోడలు, పైకప్పు వంటి సాధారణ గృహాలకు కాలం చెల్లింది. ఐకానిక్ టవర్లు ఆకట్టుకునే ఎలివేషన్లతో నగరవాసుల్ని కట్టిపడేస్తున్నాయి. వినూత్న శైలి భవనాలను నగరవాసులు కోరుకుంటుండటంతో.. వారి అభిరుచికి తగ్గటుగానే యువ డెవలపర్లు నిర్మాణాలను చేపడుతున్నారు. ఆయా ప్రాంతాలకు ల్యాండ్ మార్క్ల్లా నిలిచిపోయేలా ప్రాజెక్టులకు రూపుదిద్దుతున్నారు. విదేశీ ఆర్కిటెక్ట్‌లతో.. భారీ భవన నిర్మాణాలను కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు యువ బిల్డర్లు పెద్ద కసరత్తే చేస్తున్నారు. స్థానిక బిల్డర్లతో పాటు ఇతర రాష్ట్రాల బిల్డర్లు కూడా నగరంలో ప్రాజెక్ట్‌లను చేపడుతుండటంతో ఎలివేషన్ల ఎంపికలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. ప్రపంచ స్థాయి డిజైన్ల కోసం సింగపూర్, చైనా, జపాన్, దుబాయ్ వంటి దేశాలలో పర్యటించి, క్షేత్ర స్థాయిలో అక్కడి భవన నిర్మాణాలు పరిశీలించడంతో పాటు వాటిని తీర్చిదిద్దిన ఆర్కిటెక్ట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారితో హైదరాబాద్‌లోని భవనాలకు డిజైన్లు చేయిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో వస్తున్నాయంటే.. వినూత్న డిజైన్లతో కూడిన భవన నిర్మాణలు ఎక్కువగా పశ్చిమ హైదరాబాద్‌లో వస్తున్నాయి. కోకాపేట, మంచిరేవుల, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, నల్లగండ్ల, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, తెల్లాపూర్, పుప్పాలగూడ, రాయదుర్గంతో పాటు కొంపల్లి, ఆదిభట్ల వంటి ప్రాంతాలలో ఈ తరహా ప్రాజెక్ట్‌లు ఎక్కువగా వస్తున్నాయి. నగరంలోని పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ ఐకానిక్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ధర 5–10 శాతం ఎక్కువ.. గత 3–4 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఆకాశ హరŠామ్యల నిర్మాణం జోరందుకుంది. 40 కంటే ఎత్తయిన హైరైజ్ భవనాలు చేపట్టేందుకు బిల్డర్లు పోటీ పడుతున్నారు. నేటి అవసరాలకు, కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా గ్రీనరీ, వాస్తుకు ప్రాధాన్యం ఇస్తూ ఎలివేషన్లను ఎంపిక చేస్తున్నారు. సాధారణ అపార్ట్మెంట్లతో పోలిస్తే ఐకానిక్ ప్రాజెక్ట్‌లలో ధర కొంచం ఎక్కువగా ఉంటుంది. ఆయా నిర్మాణాలకు నైపుణ్యం ఉన్న కూలీలు, భారీ యంత్రాలు, సాంకేతికత అవసరం. ఇందుకోసం బిల్డర్లు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తారు. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ చార్జీలు ఉంటాయి. అందుకే ఈ తరహా ప్రాజెక్ట్‌ల్లో ధర 5–10 శాతం ఎక్కువగా ఉంటుంది. ఆఫీసు భవనాలు కూడా.. వాస్తవానికి నివాస సముదాయాల కంటే ఆఫీసు భవనాలను వినూత్న శైలిలో నిర్మించేందుకు బిల్డర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే నివాసాలకు వాస్తు పక్కాగా పాటించాల్సిందే. అదే ఆఫీసు బిల్డింగ్‌లకు కొంత వెసులుబాటు ఉంటుంది. టాటా, మైక్రోసాఫ్ట్, డెలాయిట్ వంటి ఇతర దేశీ, విదేశీ సంస్థలు వినూత్న శైలి నిర్మాణాలనే కోరుకుంటాయి. ఐకియా, టీ–హబ్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ భవనాలు ఆఫీసు విభాగంలో యూనిక్ బిల్డింగ్స్ కోవలోకే వస్తాయి. త్వరలోనే పశ్చిమ హైదరాబాద్‌లో ఓ నిర్మాణ సంస్థ వృత్తం, పెంటాగాన్ ఆకారంలో కార్యాలయ నిర్మాణాలు చేపట్టనుంది. కొత్తదనం కోరుకుంటున్నారు ఆభరణాలు, దుస్తులు, సంగీతం ప్రతి దాంట్లో కొత్తదనాన్ని కోరుకున్నట్లే ఇప్పుడు చాలామంది ఇంటి నిర్మాణ శైలిలోనూ కొత్తదనం కోరుకుంటున్నారు. డబ్బా ఆకారంలో ఇళ్లను ఇష్టపడటం లేదు. చూడటానికి వినూత్నంగా ఆ ప్రాంతానికే ల్యాండ్‌మార్క్‌లా నిలిచే ప్రాజెక్ట్‌లను కోరుకుంటున్నారు. – జి.రామ్మోహన్, చీఫ్ ఆర్కిటెక్ట్, మోహన్ కన్సల్టెంట్స్ -
ఆ రెండు పాలసీలు ‘పాస్’
మాదాపూర్: రాష్ట్రంలో ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ పాలసీలు విజయవంతంగా కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మూడు రోజులపాటు జరుగనున్న ఐఐఏ (ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్) ఉత్సవ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతోందని, ప్రతి ఒక్కరూ జీవించేందుకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. టీఎస్ ఐపాస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో, టీఎస్ బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్న 21 రోజులలో అనుమతులను పొందవచ్చని తెలిపారు. ఈపాలసీల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, మధ్యవర్తులు లేకుండా పనులు పారదర్శకంగా జరుగుతాయని చెప్పారు. నగరంలో అండర్ పాస్‌లను ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుముఖం పట్టిందని అన్నారు. తెలంగాణలో వ్యవసాయవృద్ధి విస్త్రృత స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా 2.5 కోట్ల మొక్కలను నాటామని, రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చనున్నామని తెలిపారు. హైదరాబాద్ మహానగరం ఒకప్పుడు రాజభవనాలు, ఉద్యానవనాలతో ఉండేదని, నగరంలో నిర్మితమైన ప్రతి ప్యాలెస్‌కు గుర్తింపు ఉందని చెప్పారు. చార్మినార్‌తోపాటు కేబుల్‌బ్రిడ్జి హైదరాబాద్ ప్రత్యేకతను తెలుపుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐఏ తెలంగాణ చాప్టర్ చైర్మన్ ఉదయశంకర్ దోనీ, ఐఐఏ నాట్కాన్–21 కన్వీనర్ శ్రీధర్ గోపిశెట్టి తదితరులు పాల్గొన్నారు. పలువురు ఇంజనీర్లకు బంగారు పతకాలను అందజేశారు. కార్యక్రమానికి సంబందించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. -
దేవుళ్ల పుట్టిల్లు
రాతికి జీవం ఉట్టిపడేలా చేయడం వారికి ఉలితో పెట్టిన విద్య. శిలలను సజీవ శిల్పాలుగా చెక్కి దేశ విదేశాల్లోని ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శిల్పులు. సుమారు 300 సంవత్సరాల కిందట నుంచీ వారు వంశపారంపర్యంగా రాతి శిల్పాలు చెక్కుతున్నట్టు చరిత్ర చెబుతోంది. ఆళ్లగడ్డ: ఏకశిల రథముపై లోకేశు వడిలోన.. ఓరచూపుల దేవి ఊరేగి వస్తుంది. శిల్పి స్పర్శ తగలగానే అక్కడి శిలలు చేతనత్వం పొంది.. సరిగమలు ఆలపిస్తాయి. కటిక రాతికి జీవకళ పోయడం వారికి ఉలితో పెట్టిన విద్య. శిలలను సజీవ శిల్పాలుగా చెక్కి దేశ విదేశాల్లోని ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఆళ్లగడ్డ శిల్పులు. సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచీ ఆళ్లగడ్డ శిల్పులు వంశపారంపర్యంగా రాతి శిల్పాలు చెక్కుతున్నట్టు చరిత్ర చెబుతోంది. నాడు ఒక కుటుంబం మాత్రమే ఈ వృత్తిని చేపట్టగా.. ప్రస్తుతం సుమారు 100 కుటుంబాలు ఇదే వృత్తిని జీవనాధారంగా చేపట్టి శిల్పకళా రంగంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పేరును అంతర్జాతీయ స్థాయిలో పదిలపరుస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య నగరానికి తరలించేందుకు సిద్ధంగా ఉన్న శేషపాన్పు విగ్రహం ఇలా మొదలైంది ► ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని గుంప్రామాన్ దిన్నె గ్రామానికి చెందిన దురుగడ్డ బాలాచారి, వీరాచారి పూర్వీకులు సుమారు 300 సంవత్సరాల క్రితం శిల్పాల తయారీకి శ్రీకారం చుట్టారు. ► పట్టణ ప్రాంతంలో ఆదరణ బాగుంటుందనే ఉద్దేశంతో వీరు 1950లో అక్కడి నుంచి ఆళ్లగడ్డ పట్టణానికి వలస శిల్ప శాలను ఏర్పాటు చేశారు. ► 1982 వరకు ఆ ఒక్క కుటుంబం మాత్రమే శిల్పాలు తయారు చేసేది. ఆ తరువాత ఆ కుటుంబానికి చెందిన దురుగడ్డ రామాచారి తన నలుగురు కుమారులతోపాటు మరికొందర్ని శిష్యులుగా చేర్చుకుని శిల్పకళను అభివృద్ధి చేశారు. ► ప్రస్తుతం ఆళ్లగడ్డలో సుమారు 60 శిల్ప శాలలు ఉండగా.. వాటిలో 500 మంది శిల్పులు విగ్రహాలు తయారు చేస్లూ జీవనోపాధి పొందుతున్నారు. ఆళ్లగడ్డ నుంచి అమెరికా వరకు.. ► దేవతా మూర్తుల విగ్రహాలలోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తల విగ్రహాలను జీవకళ ఉట్టి పడేలా తీర్చిదిద్దడం ఆళ్లగడ్డ శిల్పుల ప్రత్యేకత. ► వీరి చేతిలో రూపుదిద్దుకున్న అనేక విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా హిందూ ఆలయాల్లో మూలవిరాట్‌లుగా కొలువై పూజలందుకుంటున్నాయి. ► ఇక్కడి శిల్పులు అమెరికా వెళ్లి అక్కడే మూడు నెలలు ఉండి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి వచ్చారు. ► ఆళ్లగడ్డలో తయారు చేసిన విగ్రహాలు చైనా, రష్యా, శ్రీలంక, జపాన్ తదితర దేశాలకు ఓడల ద్వారా ఎగుమతి అవుతున్నాయి. మహిళలూ రాణిస్తున్నారు ► శిల్ప కళలో మహిళలు కూడా రాణిస్తున్నారు. మొదట్లో కుటుంబంలోని పురుషులు చెక్కిన విగ్రహాలకు నగిషీలు ఇవ్వటం, నునుపు చేయటం వంటి పనులు మహిళలు చేసేవారు. ► శిల్ప కళలో మెళకువలు నేర్చుకుని పురుషులతో సమానంగా పాల రాతి శిల్పాలు, గృహాలంకరణ ఉపకరణాలను తయారు చేస్తున్నారు. ► ప్రస్తుత కంప్యూటర్ యుగంలో యువకులంతా సాఫ్ట్వేర్ రంగం వైపు మొగ్గు చూపుతుంటే.. శిల్పుల కుటుంబాల్లోని యువకులు శిల్ప కళపైనే మక్కువ చూపుతున్నారు. ► ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఆర్డర్లు బుక్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. శిల్పాల తయారీలో యంత్రాల వినియోగాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో విగ్రహానికి.. ఒక్కో శిల ► విగ్రహాలను చెక్కడం ఓ ఎత్తైతే వాటికి అవసరమైన, వినియోగదారుడి బడ్జెట్‌కు సరిపోయే రాయిని ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. ► ఏ రాయి అయితే ఏ విగ్రహం ఎలా ఉంటుంది... ఎంత బడ్జెట్లో వస్తుందో చెప్పి విగ్రహాలను తయారు చేసి ఇస్తుంటారు. ► ఇందుకోసం వైఎస్సార్ జిల్లా తలమంచి పట్నం, మల్యాల, కాంచీపురం, బెంగళూరు, కోయిరా, మైసూర్ తదితర ప్రాంతాల నుంచి గ్రానైట్, ఎర్ర రాయి, నల్ల రాయి, పాల రాయి, కోయిరా రాయి వంటి శిలలను వినియోగిస్తారు. -
వివాదాలు చెరిపినారు
యాదగరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ నిర్మాణంలో అష్టభుజి ప్రాకారం రాతి స్తంభాలపై ఏర్పాటు చేసిన వివాదాస్పద చిత్రాలను ఆదివారం తొలగించారు. రాతి స్తంభాలపై చెక్కిన సీఎం కేసీఆర్, చార్మినార్, కేసీఆర్ కిట్ వంటి తదితర చిత్రాలపై పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని తొలగించింది. వాటి స్థానంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలను చెక్కుతున్నారు. శనివారం చిత్రాలను తొలగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అక్కడి శిల్పులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. అలాగే యాదాద్రిలో రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. -
అసెంబ్లీకో మంచి డిజైన్ కావాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీల కొత్త భవనాలకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు డిజైన్లు సిద్ధం చేస్తున్నారు. వాటిల్లోంచి ఒకదాన్ని ఎంపిక చేసి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భవనాలు తెలంగాణ సంప్రదాయ వారసత్వ నమూనాను ప్రతిబింబించేలా ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం నమూనాను పోలి ఉండేలా కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నట్టు ఇప్పటికే ఆయన ప్రకటించారు. సచివాలయ భవన ఆకృతి ఖరారు కావా ల్సి ఉంది. గుమ్మటాలతో ఉండే నమూనా వైపు సీఎం మొగ్గుచూపుతున్నారు. తమిళనాడుకు చెందిన ఓ నిర్మాణ సంస్థ రూపొందించిన నమూనా బాగుందని ఆయన పేర్కొన్నారు. దానికి దగ్గరగా ఉండే మరో ఉన్నత నమూనాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ భవనాల నిర్మాణంపై ఏర్పడ్డ అధికారుల కమిటీ ప్రముఖ ఆర్కిటెక్ట్‌లకు ఈ మేరకు లేఖలు రాసింది. మంచి నమూనా సిద్ధం చేయాల్సిందిగా ఆ లేఖల్లో పేర్కొంటూ 20 నిర్మాణ సంస్థలకు పంపింది. వాటిల్లో ఉత్తమమైన 3 డిజైన్లు ఎంపిక చేసి మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించనుంది. సీఎంతో సంప్రదించి అందులో ఓ నమూనాను ఉపసంఘం ఎంపిక చేయనుంది. హఫీజ్ కాంట్రాక్టర్ సహా.. ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ సచివాలయం కోసం మూడు నమూనాలు రూపొందించారు. తొలుత ప్రస్తుత సచివాలయం ఉన్న ప్రాంతంలోనే కొత్త సచివాలయం నిర్మించాలని భావించిన ప్రభుత్వం ఆయనకు డిజైన్ల బాధ్యత అప్పగించింది. అప్పట్లో ఆయన 2 నమూనాలు రూపొందించారు. తర్వాత బైసన్ పోలో మైదానంలో నిర్మించాలనుకు న్నప్పుడు పెద్ద గుమ్మటంతో మరో నమూనా రూ పొందించారు. ఇప్పుడవి కాదని కొత్త నమూనాలు సిద్ధం చేసుకోవాలనుకుంటున్న నేపథ్యంలో అధికారుల కమిటీ ఆయనకు కూడా లేఖ రాసింది. -
సొంతిల్లు సమకూరాలంటే.. రాజీ పడాల్సిందేనా!
సాక్షి, హైదరాబాద్: విషయం ఏదైనా సరే.. కోరుకున్నవన్నీ దొరక్కపోవచ్చు. ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు. ఇళ్ల కొనుగోలుకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. బడ్జెట్, చిక్కుల్లేని యాజమాన్య హక్కు, ప్రాంతం, వాస్తు, నీరు, విద్యుత్తు సరఫరా అంశాలు ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే వీటిలో కొన్ని అంశాలు మనం ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలంటే సొంతింటి స్వప్నం ఓ పెద్ద సవాలే అవుతుంది. అలాగనీ ముఖ్యమైన అంశాల్లోనూ రాజీ పడాలని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఒకటి, రెండు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏయే విషయాల్లో రాజీ పడొచ్చు. ఎక్కడ పడకూడదో స్పష్టత ఏర్పర్చుకోవాలి. ప్రాంతమెక్కడ: ఇల్లు కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? అది కూడా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అనుకుంటున్నారా? ఇక్కడ వీలవ్వకపోతే మియాపూర్, మదీనాగూడ, మణికొండ, ఓయూ కాలనీ తదితర ప్రాంతాల్లో.. కొంచెం తక్కువ ధరలో దొరికే ప్రాంతాలపై దృష్టి పెడతారు. అవునా? ప్రస్తుత రియల్టీ మార్కెట్లో సంపన్నులకే కాదు మధ్యతరగతి, సామాన్యులు.. ఇలా వివిధ వర్గాల వారికి స్థోమతకు తగ్గ బడ్జెట్లో నగరం చుట్టూ గృహసముదాయాలు వస్తున్నాయి. మీరు కొంచెం కసరత్తు చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్ని అన్వేషిస్తే చాలు, మీకు అందుబాటు ధరలో ఇళ్లు ఎక్కడ దొరికేది ఇట్టే తెలిసిపోతుంది. సదుపాయాల సంగతేంటి: నిర్మాణాల విషయంలో డెవలపర్ల వ్యూహం మారింది. సకల సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇల్లు కొనాలన్న నిర్ణయానికొచ్చాక సదుపాయాల సంగతి కూడా ఆలోచించాలి. క్లబ్‌హౌజ్, జిమ్ అవసరమా? వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఈ సదుపాయాలు అక్కర్లేదా? అన్నది తేల్చుకోవాలి. జీవనశైలి, బడ్జెట్ తదితర అంశాలు మీ నిర్ణయంపై ప్రభావితం చేస్తాయి. కాబట్టి సదుపాయాల విషయంలో స్పష్టత ఉండాలి. బిల్డర్‌కు మంచి పేరుందా: స్థిరాస్తి కొనేటప్పుడు బిల్డర్ గురించి కూడా ఆరా తీయాలి. మార్కెట్లో పేరున్న బిల్డర్లు నిర్మించే ఇళ్లకే ప్రాధాన్యమివ్వాలి. గతంలో అతను నిర్మించిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయా? నిర్మాణమెలా ఉంది? ఒప్పందం మేరకు కొనుగోలుదారులకు సదుపాయాలు కల్పించాడా? కార్పస్ ఫండ్ బదిలీలో ఇబ్బందులేమైనా సృష్టించాడా? అన్న విషయాల్ని తెలుసుకోవాలి. నిర్మాణాల్లో మంచి చరిత్ర లేని బిల్డర్లకు దూరంగా ఉండటమే మేలు. అలాగనీ మార్కెట్లో పేరున్న బిల్డర్ల ప్రాజెక్టులకే పరిమితం కానక్కర్లేదు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఒప్పందానికి కట్టుబడి ఉండేవారిని ఎంచుకోవచ్చు. పరిసరాలెలా ఉన్నాయి: ఇంటి ముందు పచ్చటి తోటతో ఆహ్లాదభరిత వాతావరణం ఉండాలని కొందరు కోరుకుంటారు. మరికొందరేమో ఇలాంటి హంగులు లేకున్నా సర్దుకుపోతారు. బాల్కనీని పచ్చగా, అందంగా అలంకరించుకుంటే గార్డెన్‌కు ధీటుగా ఉంటుందని భావిస్తారు. కాబట్టి ఈ విషయంలో మీ దృక్పథం ఏమిటో నిర్ణయించుకోవాలి. -
చెక్కేకొద్దీ అక్రమాలే..
స్థపతుల చేతివాటం-శిల్పుల పాలిట శాపం ప్రైవేటు కేంద్రాలు, కాంట్రాక్టర్‌తో లాలూచీ శిల్ప తయారీ కేంద్రంలో కనీస సౌకర్యాలు కరువు ఊపిరితిత్తుల సమస్యతో శిల్పుల ఇక్కట్లు చోద్యం చూస్తున్న టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు తిరుపతి సిటీ: తిరుమల తిరుపతి దేవస్థానాని(టీటీడీ)కి అనుబంధంగా అలిపిరి వద్ద నడుస్తున్న శిలా శిల్ప తయారీ కేంద్రంలో చెక్కేకొద్దీ స్థపతుల అక్రమాలు బయటపడుతున్నాయి. కాంట్రాక్టర్ నాసిరకం బండలను సరఫరా చేయడంతో టీటీడీకి నష్టంతోపాటు శిల్పుల సుదీర్ఘ శ్రమ నేలపాలవుతోంది. కొందరు స్థపతులు సం బంధిత కాంట్రాక్టర్, ప్రైవేటు తయారీ కేంద్రాలతో చాలాకాలంగా ఏర్పరచుకున్న లోపాయికారి ఒప్పందాలతో ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. శిల్పులు మాత్రం బతుకు బండిని లాగడం కోసం భగవంతుడిపై భారమేసి రాతి శిల్పాలను చెక్కుతూ వాటికి ప్రాణం పోస్తున్నారు. టీటీడీ అందించే తృణమో పణమో పుచ్చుకుని జీవనం సాగిస్తూ.. కనీస సౌకర్యాలు లేకపోయినా కుటుంబాన్ని పోషించడం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఊపిరితిత్తుల సమస్యలతో సతమతమవుతున్నారు. ఏర్పాటు- ఆవశ్యకత హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం టీటీడీ 1965లో శిల్ప కళాశాలను స్థాపించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు దేవాలయ నిర్మాణం, రాతి, దారు, లోహ, సుద్ధ శిల్పాల తయారీ, కళంకారీ విగ్రహాల తయారీలకు సంబంధించి ఆరు రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. అందులో ముఖ్యమైనవి రాతి శిల్పాల తయారీ. ఇందులో 65 మంది శిల్పులు పనిచేస్తున్నారు. దేవాలయాలకు అవసరమయ్యే విగ్రహాలను టీటీడీ 75 శాతం సబ్సిడీతో అందిస్తోంది. ఇందుకు టీటీడీ ఏటా రూ.2కోట్ల మేర ఖర్చు చేస్తోంది. కాంట్రాక్టర్‌తో మిలాఖత్ శిల్పాలకు అవసరమ్యే రాతి బండలను తమిళనాడు రాష్టంలోని చెంగల్పట్టు నుంచి సంబంధిత కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్‌కు ఆదాయం పెంచి అందులో తలా కొంచెం పంచుకునేందుకు ఇక్కడి అధికారులు అలవాటుపడ్డారు. వచ్చే ఆదాయం స్థపతులనుంచి ఇంజినీరింగ్ అధికారుల వరకు పంచుకుం టారు. ఈ క్రమంలో ధర ఎక్కువ పలికే ఏడెనిమిది బొమ్మలకు అయ్యే విధంగా పెద్దపెద్ద బండరాళ్లనే తెప్పిస్తారు. వీటి ద్వారా అటు టీటీడీకి వేస్టేజ్ రూపంలో భారీగా నష్టం వాటిల్లుతోంది. చివరిదశలో విరిగిపోయి ఇటు శిల్పులకు శ్రమ వృథా అవుతోంది. ఇలాంటి సందర్భాల్లో పీస్రేటులో ఒక్కపైసా కూడా అందకుండా నోటి దగ్గరకు వచ్చే అన్నం దూరమైనట్టు అవుతోందని శిల్పులు ఆవేదన చెందున్నారు. ఆర్డర్లకు అనుగుణంగా ఉండే బండరాళ్లు తెప్పిస్తే అటు టీటీడీకి ఇటు శిల్పులకూ ఎటువంటి నష్టం ఉండదనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీటీడీలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. శిల్పుల సంఖ్యకు తగ్గట్టు ఆరుగురు మార్కర్లు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఒక్క మార్కర్నే అందుబాటులో ఉంచి టీటీడీకి మరింత నష్టం చేకూరుస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మరచిన 2008 నాటి బోర్డు తీర్మానం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాం లో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పీసురేటు శిల్పుల కష్టాలను తొలగించేందుకు వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుర్తింపు కార్డులతోపాటు, ఇంటి స్థలాలు, స్విమ్స్‌లో ఉచిత వైద్యం, సబ్సిడీ లడ్డూలు, దర్శన ఏర్పాట్లను కల్పించాలని తీర్మానించారు. అయితే అవి ఏవీ అమలుకు నోచుకోలేదు. స్థపతుల చేతివాటం కొందరు స్థపతులు ప్రైవేటు తయారీ కేంద్రాలతో చేతులు కలపడంతో థార్మిక సంస్థ పరువు దిగజారుతోంది. ఇక్కడ పనిచేసే ఒక అసిస్టెంట్ స్థపతి టీటీడీ శిల్ప తయారీ కేంద్రానికి వచ్చే విగ్రహాల ఆర్డర్లను ప్రైవేటుకు పంపి వేలకువేలు దండుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగకుండా టీటీడీలో పనిచేసే పదిమంది శిల్పులను బెదిరించి ప్రైవేటు తయారీ కేంద్రాల్లో పనిచేయిస్తున్నారు. అందుకు వారు సమ్మతించకపోతే వారిని కక్షసాధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ పర్యవేక్షించాల్సిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇదే పోస్టులో ఏడేళ్లపాటు దీర్ఘకాలంగా కొనసాగుతున్నా సందర్శించిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. అలాంటిదేమీ లేదు.. శిల్పాల తయారీ కేంద్రంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగడం లేదు. ఈవో అనుమతితో ఒక్క అనంతశయుని విగ్రహతయారీని మాత్రం ప్రైవేటు వాళ్లకు ఇచ్చాం. ఇంతవరకు విరిగినట్టు ఒక్క కంప్లైంటూ లేదు. -నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టీటీడీ