చెక్కేకొద్దీ అక్రమాలే.. | Sthapatula hand-craftsmen curse himself | Sakshi
Sakshi News home page

చెక్కేకొద్దీ అక్రమాలే..

Published Mon, Jul 21 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

చెక్కేకొద్దీ అక్రమాలే..

చెక్కేకొద్దీ అక్రమాలే..

  •       స్థపతుల చేతివాటం-శిల్పుల పాలిట శాపం
  •      ప్రైవేటు కేంద్రాలు, కాంట్రాక్టర్‌తో లాలూచీ
  •      శిల్ప తయారీ కేంద్రంలో కనీస సౌకర్యాలు కరువు
  •      ఊపిరితిత్తుల సమస్యతో శిల్పుల ఇక్కట్లు
  •      చోద్యం చూస్తున్న టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు
  • తిరుపతి సిటీ: తిరుమల తిరుపతి దేవస్థానాని(టీటీడీ)కి అనుబంధంగా అలిపిరి వద్ద నడుస్తున్న శిలా శిల్ప తయారీ కేంద్రంలో చెక్కేకొద్దీ స్థపతుల అక్రమాలు బయటపడుతున్నాయి. కాంట్రాక్టర్ నాసిరకం బండలను సరఫరా చేయడంతో టీటీడీకి నష్టంతోపాటు శిల్పుల సుదీర్ఘ శ్రమ నేలపాలవుతోంది. కొందరు స్థపతులు సం బంధిత కాంట్రాక్టర్, ప్రైవేటు తయారీ కేంద్రాలతో చాలాకాలంగా ఏర్పరచుకున్న లోపాయికారి ఒప్పందాలతో ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. శిల్పులు మాత్రం బతుకు బండిని లాగడం కోసం భగవంతుడిపై భారమేసి రాతి శిల్పాలను చెక్కుతూ వాటికి ప్రాణం పోస్తున్నారు. టీటీడీ అందించే తృణమో పణమో పుచ్చుకుని జీవనం సాగిస్తూ..  కనీస సౌకర్యాలు లేకపోయినా కుటుంబాన్ని పోషించడం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఊపిరితిత్తుల సమస్యలతో సతమతమవుతున్నారు.
     
    ఏర్పాటు- ఆవశ్యకత

    హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం టీటీడీ 1965లో శిల్ప కళాశాలను స్థాపించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు దేవాలయ నిర్మాణం, రాతి, దారు, లోహ, సుద్ధ శిల్పాల తయారీ, కళంకారీ విగ్రహాల తయారీలకు సంబంధించి ఆరు రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. అందులో ముఖ్యమైనవి రాతి శిల్పాల తయారీ. ఇందులో 65 మంది శిల్పులు పనిచేస్తున్నారు. దేవాలయాలకు అవసరమయ్యే విగ్రహాలను టీటీడీ 75 శాతం సబ్సిడీతో అందిస్తోంది. ఇందుకు టీటీడీ ఏటా రూ.2కోట్ల మేర ఖర్చు చేస్తోంది.
     
    కాంట్రాక్టర్‌తో మిలాఖత్
     
    శిల్పాలకు అవసరమ్యే రాతి బండలను తమిళనాడు రాష్టంలోని చెంగల్‌పట్టు నుంచి సంబంధిత కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్‌కు ఆదాయం పెంచి అందులో తలా కొంచెం పంచుకునేందుకు ఇక్కడి అధికారులు అలవాటుపడ్డారు. వచ్చే ఆదాయం స్థపతులనుంచి ఇంజినీరింగ్ అధికారుల వరకు పంచుకుం టారు. ఈ క్రమంలో ధర ఎక్కువ పలికే ఏడెనిమిది బొమ్మలకు అయ్యే విధంగా పెద్దపెద్ద బండరాళ్లనే తెప్పిస్తారు. వీటి ద్వారా అటు టీటీడీకి వేస్టేజ్ రూపంలో భారీగా నష్టం వాటిల్లుతోంది. చివరిదశలో విరిగిపోయి ఇటు శిల్పులకు శ్రమ వృథా అవుతోంది.

    ఇలాంటి సందర్భాల్లో పీస్‌రేటులో ఒక్కపైసా కూడా అందకుండా నోటి దగ్గరకు వచ్చే అన్నం దూరమైనట్టు అవుతోందని శిల్పులు ఆవేదన చెందున్నారు. ఆర్డర్లకు అనుగుణంగా ఉండే బండరాళ్లు తెప్పిస్తే అటు టీటీడీకి ఇటు శిల్పులకూ ఎటువంటి నష్టం ఉండదనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీటీడీలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. శిల్పుల సంఖ్యకు తగ్గట్టు ఆరుగురు మార్కర్లు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఒక్క మార్కర్‌నే అందుబాటులో ఉంచి టీటీడీకి మరింత నష్టం చేకూరుస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
     
    మరచిన 2008 నాటి బోర్డు తీర్మానం
     
    దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాం లో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పీసురేటు శిల్పుల కష్టాలను తొలగించేందుకు వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుర్తింపు కార్డులతోపాటు, ఇంటి స్థలాలు, స్విమ్స్‌లో ఉచిత వైద్యం, సబ్సిడీ లడ్డూలు, దర్శన ఏర్పాట్లను కల్పించాలని తీర్మానించారు. అయితే అవి ఏవీ అమలుకు నోచుకోలేదు.  
     
    స్థపతుల చేతివాటం
     
    కొందరు స్థపతులు ప్రైవేటు తయారీ కేంద్రాలతో చేతులు కలపడంతో థార్మిక సంస్థ పరువు దిగజారుతోంది. ఇక్కడ పనిచేసే ఒక అసిస్టెంట్ స్థపతి టీటీడీ శిల్ప తయారీ కేంద్రానికి వచ్చే విగ్రహాల ఆర్డర్లను ప్రైవేటుకు పంపి వేలకువేలు దండుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగకుండా  టీటీడీలో పనిచేసే పదిమంది శిల్పులను బెదిరించి ప్రైవేటు తయారీ కేంద్రాల్లో పనిచేయిస్తున్నారు. అందుకు వారు సమ్మతించకపోతే వారిని కక్షసాధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ పర్యవేక్షించాల్సిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇదే పోస్టులో ఏడేళ్లపాటు దీర్ఘకాలంగా కొనసాగుతున్నా సందర్శించిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి.
     
    అలాంటిదేమీ లేదు..
     శిల్పాల తయారీ కేంద్రంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగడం లేదు. ఈవో అనుమతితో ఒక్క అనంతశయుని విగ్రహతయారీని మాత్రం ప్రైవేటు వాళ్లకు ఇచ్చాం. ఇంతవరకు విరిగినట్టు ఒక్క కంప్లైంటూ లేదు.
     -నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టీటీడీ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement