భవనాల అసెస్‌మెంట్ కోసం..
త్వరలో మొదలవనున్న ఇంటింటి సర్వే
ఇప్పటికే కొనసాగుతున్న డ్రోన్ సర్వే
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలోని భవనాల జీఐఎస్ మ్యాపింగ్ కోసం డోర్ టు డోర్ సర్వే త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీతోపాటు సర్వే చేసేందుకు ఎంపికైన కాంట్రాక్టు ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఓవైపు డ్రోన్ సర్వే ప్రారంభం కాగా.. మరోవైపు త్వరలోనే ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. ఇంటింటి సర్వే వల్ల జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను ఆదాయం రూ.వెయ్యి కోట్లకు పైగా పెరగవచ్చనే అంచనాలున్నాయి. జీహెచ్‌ఎంసీలో 20 లక్షలకు పైగా ఆస్తులు (భవనాలు) ఉన్నప్పటికీ, ఆస్తిపన్ను చెల్లింపు జాబితాలో మాత్రం దాదాపు 19 లక్షలున్నాయి.
ఇంటింటి సర్వే ద్వారా సరైన లెక్కలతో పాటు భవనాల వాస్తవ విస్తీర్ణాలకనుగుణంగా ఆస్తిపన్ను విధించనున్నారు. ప్రస్తుతం చాలా భవనాల వాస్తవ విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణం నమోదై ఉండటంతో జీహెచ్‌ఎంసీకి రావాల్సినంత ఆస్తిపన్ను ఆదాయం రావడం లేదు. మరోవైపు అదనంగా పెరిగిన అంతస్తుల నుంచి కూడా ఆస్తిపన్ను రావడం లేదు. శాటిలైట్, డ్రోన్, డోర్ టు డోర్ సర్వేల ద్వారా మ్యాపింగ్‌తో కచి్చతమైన వివరాలతో పాటు ప్రతి ఇంటికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కేటాయించనున్నందున ఓవైపు జీహెచ్‌ఎంసీ ఆదాయం పెరగడంతో పాటు వివిధ అవసరాలకు ఉపయోగపడనుంది. ఏవైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత యంత్రాంగం త్వరితంగా చేరుకునేందుకు కూడా ఉపకరిస్తుంది.
రెండు సర్కిళ్లలో పూర్తయిన డ్రోన్ సర్వే
ఇప్పటికే డ్రోన్ సర్వే ప్రారంభమైంది. పటాన్‌చెరు, కూకట్‌పల్లి సర్కిళ్లలో పూర్తయిందని జీహెచ్‌ఎంసీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం శేరిలింగంపల్లిలో సర్వే జరుగుతోంది. త్వరలోనే ఇంటింటి సర్వే కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రజలు సర్వేకు సహకరించేందుకు వీలుగా ముందస్తు ప్రచారం నిర్వహించనున్నారు. వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటారు. సోషల్‌మీడియా ద్వారానూ ప్రచారం నిర్వహించాలనే యోచనలో అధికారులున్నట్లు సమాచారం.
యాప్‌లో నమోదు
ఇంటింటి సర్వేలో భాగంగా ఇళ్లకు సంబంధించిన వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. ఇళ్ల యజమానుల ఫోన్ నెంబర్లను కూడా నమోదు చేయనున్నారు. ఇళ్ల నమోదులో భాగంగా నివాస భవనమా.. వాణిజ్య భవనమా.. అపార్ట్‌మెంటా.. ఇండిపెండెంట్ భవన మా? వంటి వివరాలతో పాటు భవనం విస్తీర్ణం, చిరునామా, పోస్టల్ కోడ్ తదితర వివరాలు నమోదు చేస్తారు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న భవనాల వివరాలను సైతం సర్వే చేస్తారు. భవనం ఎత్తు, అక్కడున్న రోడ్ మెయిన్ రోడ్డా? సబ్ రోడ్డా? వంటి వివరాలు సైతం నమోదు చేస్తారు.
భవనం ఫొటోలు తీస్తారు. భవనాల్లో
ఇంకుడుగుంతలు, సివరేజి లైన్లు, సోలార్ ప్యానెల్ వంటివి ఉన్నదీ లేనిదీ నమోదు చేస్తారు. జియో ఫెన్సింగ్ వల్ల భవనం ఏ వార్డు పరిధిలో ఉన్నది ఆటోమేటిక్‌గా నమోదవుతుంది. ఎన్ని అంతస్తులు, భవన వినియోగం, వాటర్, విద్యుత్ కనెక్షన్ల వివరాలు తదితరాలను సైతం నమోదు చేస్తారు. వాణిజ్య భవనాలైతే జరుగుతున్న వ్యాపారం, ట్రేడ్‌లైసెన్స్ వంటి వివరాలు కూడా నమోదు చేస్తారు. వీటితో పాటు ఇంకా పలు వివరాలు యాప్‌లో నమోదు చేయనున్నారు. యాప్ పనితీరు పరిశీలన కోసం దాదాపు 15 ఇళ్ల వివరాలు యాప్‌లో నమోదు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment