ICSE
-
ఐసీఎస్ఈ స్కూల్స్ జాతీయ కార్యదర్శిగా సుందరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఐసీఎస్ఈ, ఐఎస్ఈ పాఠశాలల అసోసియేషన్ జాతీయ కార్యదర్శిగా ఉడుముల సుందరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న సుందరి విద్యారంగంలో అనేక ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించారు. -
టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులను గందరగోళానికి గురిచేయవద్దంటూ వ్యాఖ్యానించింది. అయితే.. ఈ ఏడాది సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ, ఎన్ఐఓఎస్ సహా ఇతర బోర్డులు ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలోనే ఇది పరీక్షలకు సిద్ధమవుతోన్న విద్యార్థుల్లో తప్పుడు ఆశలను కలిగించటమే కాకుండా గందరగోళాన్ని సృష్టిస్తుందని స్పష్టం చేసింది. విద్యార్థులను, అధికారులను వారి విధులను వారు నిర్వర్తించనివ్వాలని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు విద్యార్థుల్లో తప్పుడు భావనను, గందరగోళాన్ని కలిగిస్తాయని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 26 నుంచి 10, 12వ తరగతుల టెర్మ్-2 బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. సీఐఎస్సీఈ కూడా బోర్డు పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనుండగా కొన్ని రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. Supreme Court dismisses a plea seeking cancellation of offline exams for Class X and XII to be conducted by all State Boards, CBSE, ICSE and National Institute of Open Schooling (NIOS). Supreme Court says these kinds of petitions are misleading and give false hope to students. pic.twitter.com/lCZvFKLlMX — ANI (@ANI) February 23, 2022 -
ఐసీఎస్ఈ ఫలితాలు విడుదల, 99.98% ఉత్తీర్ణత
న్యూఢిల్లీ: ఐసీఎస్ఈ 10, 12వ తరగతుల ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ) శనివారం ప్రకటించింది. 10వ తరగతిలో బాలబాలికలు సమానంగా 99.98%తో ఉత్తీర్ణత సాధించగా, 12వ తరగతిలో బాలుర కంటే బాలికలు 0.2% ఎక్కువ ఉత్తీర్ణత పొందారని తెలిపింది. బాలురు 99.66% ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 99.86% పొందినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 10వ తరగతికి 2,422 పాఠశాలలు 2,19,499 మంది విద్యార్థులు, 12వ తరగతికి 1,166 పాఠశాలలు 94,011 మంది విద్యార్థుల జాబితాను అందించాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్–19 సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో సీఐఎస్సీఈ 10,12వ తరగతుల పరీక్షలను రద్దు చేసి, ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా విద్యార్థుల ప్రతిభను మదింపు చేసినట్లు తెలిపింది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మెరిట్ జాబితా ఉండదని పేర్కొంది. ఫలితాలపై అభ్యంతరాలు ఏవైనా ఉంటే సరిచేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. -
కరోనా ఎఫెక్ట్: ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండటంతో పరీక్షలు ఒక్కొక్కటిగా రద్దవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. మరికొన్ని వాయిదా వేశాయి. తాజాగా మరో పరీక్ష రద్దయ్యింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (ఐసీఎస్ఈ) పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 16వ తేదీన జారీ చేసిన సర్క్యూలర్‌ను ఉపసంహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ ఆరోగ్యం ముఖ్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఎస్ఈ పేర్కొంది. అయితే ఐసీఎస్ఈ ఇంటర్ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం ఆఫ్‌లైన్‌లో జరగనున్నాయని పేర్కొంది. ఈ పరీక్షల తేదీలను జూన్‌లో నిర్వహించే సమీక్ష తర్వాత ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
జులై 15 కల్లా సీబీఎస్ఈ బోర్డు పరీక్ష ఫలితాలు
ఢిల్లీ : కరోనా నేపథ్యంలో పది, 12వ తరగతులకు చెందిన పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా ఫలితాలను వెల్లడిస్తామని సీబీఎస్ఈ పేర్కొన్నవిషయం తెలిసిందే. తాజాగా సీబీఎస్ఈ సమర్పించిన అసెస్మెంట్ మార్క్‌ల స్కీమ్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఇవాళ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజివ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. సీబీఎస్ఈ కోర్టుకు సమర్పించిన అసెస్మెంట్ స్కీమ్‌ను అంగీకరించింది. పెండింగ్ పరీక్షలకు ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా మార్క్‌లు వేసి ఈ ఏడాది జూలై 15వ తేదీలోగా తుది ఫలితాలను సీబీఎస్ఈ బోర్డు రిలీజ్ చేయనున్నది. ఇప్పటికే పూర్తయిన బోర్డు పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి సబ్జెక్టులకు మార్కులను కేటాయించనుంది. కాగా ఏ పరీక్షలు రాయని విద్యార్థులకు మాత్రం అసెస్మెంట్, గత ఇంటర్నల్ పరీక్షలు, ప్రాజెక్టుల మూల్యాంకనం ద్వారా మార్కులను కేటాయించనున్నారు. మళ్లీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు కూడా పరీక్షలు రాసే అవకాశాన్ని సీబీఎస్ఈ కల్పించింది. ఆప్షనల్ పరీక్షలు రాయాలా వద్దా అనేది విద్యార్థులకే వదిలివేసినట్లు సీబీఎస్ పేర్కొంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా ఉంటే పరీక్షలు రాయాలనుకుంటున్న విద్యార్థులకు సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశముందని సీబీఎస్ఈ తెలిపింది. (సీబీఎస్ఈ పరీక్షలు రద్దు) సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు గత ఫిబ్రవరి 15న ప్రారంభం కాగా లాక్డౌన్ కారణంగా మధ్యలోనే ఆగిపోయాయి. 10వ తరగతి పరీక్షలు కూడా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు నిర్వహించాల్సి ఉండగా సగంలోనే నిలిచిపోయాయి. దీంతో జూలైలో మిగిలిపోయిన పరీక్షలను నిర్వహించాలని సీబీఎస్ఈ భావించింది. కానీ ప్రస్తుత కరోనా దృష్యా అది సాధ్యం కాదని తెలిసి రద్దు చేయాలని నిర్ణయించింది. ఇంటర్నల్స్ ఆధారంగా ఫలితాలు ప్రకటించేలా బోర్డులను ఆదేశించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఇదే అంశంపై వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది. కాగా ఐసీఎస్ఈ బోర్డు తరపున సుప్రీంలో న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు. అసెస్మెంట్ మార్కుల విధానం సీబీఎస్ఈతో పోలిస్తే ఐసీఎస్ఈలో తేడా ఉంటుందని, అయితే పదవ తరగతి విద్యార్థులకు అన్నీ అనుకూలించినప్పుడు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని ఐసీఎస్ఈ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కోర్టుకు సీబీఎస్ఈ సమర్పించిన అఫిడవిట్ తరహాలోనే తమది కూడా ఉందని, కానీ సగటు మార్కుల విధానం ఒక్కటే తేడా ఉందని జయదీప్ తెలిపారు. -
మసీదుతో శబ్ద కాలుష్యం!
న్యూఢిల్లీ: ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ) ఆరో తరగతి పుస్తకంలో శబ్ద కాలుష్యంపై ఇచ్చిన పాఠంలో ‘మసీదు’ ఫొటోను ప్రచురించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐసీఎస్ఈ ఆరో తరగతి సైన్స్ పుస్తకంలో శబ్ద కాలుష్యంపై ఓ పాఠం ఉంది. అందులో కాలుష్యానికి కారకాలుగా రైలు, కారు, విమానంతో పాటు మసీదు పేరు పేర్కొంది. దీనికి మసీదు ముందు ప్రార్థన చేస్తున్న వ్యక్తుల ఫొటోను ముద్రించింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రచురణకర్త హేమంత్ గుప్తా స్పందిస్తూ.. తప్పు భావనతో తాము మసీదు ఫొటోను ప్రచురించలేదని.. ఇది ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని పేర్కొన్నారు. అలాగే వెంటనే పుస్తకంలోని 202 పేజీలోంచి ఫొటోను తొలగిస్తామని తెలిపారు. -
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో ఫీ‘జులుం’!
♦ అడ్డుకట్ట వేసే దిశగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ♦ కేంద్రం లేఖను బయటకు తీసిన విద్యాశాఖ ♦ ఈ స్కూళ్ల నియంత్రణాధికారం రాష్ట్రాలదే నన్న కేంద్రం ♦ ఫీజుల నిర్ణయం రాష్ట్రాలు చేయాల్సిందేనని హెచ్ఆర్డీశాఖ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్ఈ) స్కూళ్లలోనూ ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్ర సిలబస్‌తో కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం ఇపుడు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్ల విషయంలోనూ పక్కా చర్యలు చేపట్టాల్సిందేనని ఆలోచనలు చేస్తోంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్, ఇతరత్రా పేర్లతో పలు స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, తల్లిదండ్రులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం వాటి నియంత్రణపై కసరత్తు చేస్తోంది. ఇటీవల విద్యాశాఖ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు పాఠశాలల్లో ఫీజుల వసూలు విధానంపై తనిఖీలు చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆ నివేదికను లోతుగా పరిశీలించిన ప్రభుత్వం సీబీఎస్ఈ, ఐసీఎస్సీ స్కూళ్ల నియంత్రణపై దృష్టి పెట్టింది. కేంద్రం లేఖ ఆధారంగా చర్యలు.. ఇన్నాళ్లు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లను పట్టించుకోని విద్యాశాఖ.. ప్రస్తుతం వాటి నియంత్రణ విషయంలో ఎలా ముందుకు సాగవచ్చన్న అంశాలపై పరిశీలన జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర మానవ వనరుల శాఖ రాసిన లేఖను బయటకు తీసింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్ల ఫీజులు, నియంత్రణ విషయంలో తమ అధికారాలు ఏంటని పేర్కొంటూ 2014 ఏప్రిల్ 17న రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు అథారిటీ, ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉషారాణి, హెచ్ఆర్డీ శాఖకు లేఖ రాశారు. దానిపై స్పందిస్తూ 2014 జూన్ 14న మానవ వనరుల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అలోక్ జవహర్, ఎస్ఎస్ఏకు లేఖ రాశారు. అందులో రాష్ట్రాల్లో ఆయా స్కూళ్ల నియంత్రణాధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ఆయా స్కూళ్లలో సిలబస్, అకడమిక్ సంబంధ అంశాలను మాత్రమే ఎంహెచ్ఆర్డీ చూస్తుందని, మిగతా పరిపాలన పరమైన అంశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని వెల్లడించారు. ఆయా స్కూళ్ల ఏర్పాటుకు నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలే వాటిల్లో విద్యార్థుల నుంచి వసూలు చేయాల్సిన కనీస, గరిష్ట ఫీజులను నిర్ణయించాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటికే తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు చేపట్టాయని, ఆంధ్రప్రదేశ్‌లోనూ నియంత్రణ, ఫీజుల విధానంపై ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకుని చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేశారు. ఆ లేఖ ఉమ్మడి రాష్ట్రంలో రాసిందే అయినప్పటికీ విభజన తరువాత కూడా వర్తిస్తుంది కాబట్టి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో ప్రధానంగా ఫీజుల నియంత్రణకు రాష్ట్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర సిలబస్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ఏఎఫ్ఆర్సీ తరహా రాజ్యాంగబద్ధ సంస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం ఈ స్కూళ్లను కూడా దాని పరిధిలోకి తేవాలని భావిస్తోంది. రాష్ట్ర స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు జారీ చేసిన జీవో 91పై వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. దీంతో జీవో నంబరు 1 ప్రకారం, పైగా కేంద్రం రాసిన లేఖ ఆధారంగా కూడా ఆయా స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టే దిశగా కసరత్తు చేస్తోంది.