
న్యూఢిల్లీ: ఐసీఎస్‌ఈ 10, 12వ తరగతుల ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్‌సీఈ) శనివారం ప్రకటించింది. 10వ తరగతిలో బాలబాలికలు సమానంగా 99.98%తో ఉత్తీర్ణత సాధించగా, 12వ తరగతిలో బాలుర కంటే బాలికలు 0.2% ఎక్కువ ఉత్తీర్ణత పొందారని తెలిపింది. బాలురు 99.66% ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 99.86% పొందినట్లు వివరించింది.
దేశవ్యాప్తంగా 10వ తరగతికి 2,422 పాఠశాలలు 2,19,499 మంది విద్యార్థులు, 12వ తరగతికి 1,166 పాఠశాలలు 94,011 మంది విద్యార్థుల జాబితాను అందించాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్–19 సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో సీఐఎస్‌సీఈ 10,12వ తరగతుల పరీక్షలను రద్దు చేసి, ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా విద్యార్థుల ప్రతిభను మదింపు చేసినట్లు తెలిపింది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మెరిట్ జాబితా ఉండదని పేర్కొంది. ఫలితాలపై అభ్యంతరాలు ఏవైనా ఉంటే సరిచేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.