సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లలో ఫీ‘జులుం’!
♦ అడ్డుకట్ట వేసే దిశగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
♦ కేంద్రం లేఖను బయటకు తీసిన విద్యాశాఖ
♦ ఈ స్కూళ్ల నియంత్రణాధికారం రాష్ట్రాలదే నన్న కేంద్రం
♦ ఫీజుల నిర్ణయం రాష్ట్రాలు చేయాల్సిందేనని హెచ్‌ఆర్డీశాఖ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్‌ఈ) స్కూళ్లలోనూ ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్ర సిలబస్‌తో కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం ఇపుడు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్ల విషయంలోనూ పక్కా చర్యలు చేపట్టాల్సిందేనని ఆలోచనలు చేస్తోంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్, ఇతరత్రా పేర్లతో పలు స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, తల్లిదండ్రులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం వాటి నియంత్రణపై కసరత్తు చేస్తోంది. ఇటీవల విద్యాశాఖ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు పాఠశాలల్లో ఫీజుల వసూలు విధానంపై తనిఖీలు చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆ నివేదికను లోతుగా పరిశీలించిన ప్రభుత్వం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీ స్కూళ్ల నియంత్రణపై దృష్టి పెట్టింది.
కేంద్రం లేఖ ఆధారంగా చర్యలు..
ఇన్నాళ్లు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లను పట్టించుకోని విద్యాశాఖ.. ప్రస్తుతం వాటి నియంత్రణ విషయంలో ఎలా ముందుకు సాగవచ్చన్న అంశాలపై పరిశీలన జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర మానవ వనరుల శాఖ రాసిన లేఖను బయటకు తీసింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్ల ఫీజులు, నియంత్రణ విషయంలో తమ అధికారాలు ఏంటని పేర్కొంటూ 2014 ఏప్రిల్ 17న రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు అథారిటీ, ఎస్‌ఎస్‌ఏ స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉషారాణి, హెచ్‌ఆర్డీ శాఖకు లేఖ రాశారు. దానిపై స్పందిస్తూ 2014 జూన్ 14న మానవ వనరుల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అలోక్ జవహర్, ఎస్‌ఎస్‌ఏకు లేఖ రాశారు.
అందులో రాష్ట్రాల్లో ఆయా స్కూళ్ల నియంత్రణాధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ఆయా స్కూళ్లలో సిలబస్, అకడమిక్ సంబంధ అంశాలను మాత్రమే ఎంహెచ్‌ఆర్‌డీ చూస్తుందని, మిగతా పరిపాలన పరమైన అంశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని వెల్లడించారు. ఆయా స్కూళ్ల ఏర్పాటుకు నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలే వాటిల్లో విద్యార్థుల నుంచి వసూలు చేయాల్సిన కనీస, గరిష్ట ఫీజులను నిర్ణయించాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటికే తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు చేపట్టాయని, ఆంధ్రప్రదేశ్‌లోనూ నియంత్రణ, ఫీజుల విధానంపై ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకుని చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేశారు.
ఆ లేఖ ఉమ్మడి రాష్ట్రంలో రాసిందే అయినప్పటికీ విభజన తరువాత కూడా వర్తిస్తుంది కాబట్టి సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లలో ప్రధానంగా ఫీజుల నియంత్రణకు రాష్ట్రం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర సిలబస్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ఏఎఫ్‌ఆర్‌సీ తరహా రాజ్యాంగబద్ధ సంస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం ఈ స్కూళ్లను కూడా దాని పరిధిలోకి తేవాలని భావిస్తోంది. రాష్ట్ర స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు జారీ చేసిన జీవో 91పై వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. దీంతో జీవో నంబరు 1 ప్రకారం, పైగా కేంద్రం రాసిన లేఖ ఆధారంగా కూడా ఆయా స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టే దిశగా కసరత్తు చేస్తోంది.