చేనేత గుర్తింపు కార్డులు పొందడం ఇలా..
ధర్మవరం టౌన్ : జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత రంగానికి అంతటి ప్రాధాన్యత ఉంది. చేనేత కార్మికులకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. అందుకు కారణం.. చేనేత కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేకపోవడమే. సంక్షేమ పథకాలు వర్తించాలంటే ప్రతి కార్మికుడికీ గుర్తింపు కార్డులు తప్పనిసరి. అధికారుల ప్రచారలోపం, చేనేత కార్మికుల అవగాహన లేమితో ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా చేనేత కార్మికులు గుర్తింపుకార్డులకు నోచుకోలేదు.
జిల్లాలో 1.20 లక్షల మంది చేనేత కార్మికులు ఉండగా కేవలం 62 వేల మంది మాత్రమే గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారు. ఫలితంగా చేనేత కార్మికులు రాయితీ రుణాలు, చేనేత ముడిపట్టు రాయితీ, ఎన్‌హెచ్‌డీసీ తదితర పథకాలకు అర్హత పొందలేక పోతున్నారు. చేనేత కార్మికులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
చేనేత గుర్తింపు కార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. :
- చేనేత కార్మికులు ప్రభుత్వ గుర్తింపు కోసం దరఖాస్తు ఫారం పూర్తి వివరాలతో పూరించాలి. సొంత మగ్గమా..? కూలీ కార్మికుడా అనేది దరఖాస్తు ఫారంలో స్పష్టం చేయాలి.
- పూరించిన దరఖాస్తుకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను జత చేసి మండల వీఆర్వోతో ధ్రువీకరణ సంతకం చేయించాలి.
- ఈ దరఖాస్తును జిల్లా కేంద్రంలో ఉన్న హ్యాండ్లూమ్ ఏడీ కార్యాలయంలోగానీ, డీవో, ఏడీవో ఆయా మండలాలకు సంబంధించిన అధికారికి గానీ ఇవ్వాలి. అధికారులు దరఖాస్తులు స్వీకరించిన అనంతరం వారం రోజుల్లో విచారణ జరిపి ప్రభుత్వ గుర్తింపు కార్డును మంజూరు చేస్తారు.
- పై విధంగా చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకొని గుర్తింపు కార్డు పొందితే ఎన్నో ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి అందే అవకాశం ఉంటుంది.