ఒక్క రూపాయి.. ఎంత పని చేసింది!
బస్సుల్లో వెళ్లేటప్పుడు గానీ, ఏవైనా సరుకులు, మందుల కొనుగోలు సమయంలో గానీ ఒక్క రూపాయే కదా అని మనం వదిలేస్తాం. అవతలివాళ్లు చిల్లర ఇవ్వాల్సి ఉండి, లేదన్నా కూడా పెద్దగా పట్టించుకోం. కానీ, బిల్లులో చెప్పిన మొత్తం కంటే ఒక రూపాయి ఎక్కువగా తీసుకున్నారన్న కారణంగా ఓ లాయర్ గారు హోటల్‌ను కోర్టుకు లాగారు. రూ. 1100 పరిహారం కూడా పొందారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. వాసుదేవ్ అడిగకు చెందిన ఫాస్ట్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ హోటల్‌కు టి. నర్సింహమూర్తి అనే లాయర్ వెళ్లారు. అక్కడ ఒక ప్లేటు ఇడ్లీలు తిన్నారు. వాటి ఖారీదు రూ. 24 అయితే.. హోటల్ వాళ్లు మాత్రం ఆయన దగ్గర రూ. 25 తీసుకున్నారు.
దాంతో తన వద్ద నుంచి అన్యాయంగా, అక్రమంగా రూపాయి తీసుకున్నారంటూ ఆయన వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయింఆచరు. ఈ లెక్కన హోటల్‌కు రోజకు ఎంత మంది వస్తారు, వాళ్లందరి దగ్గర నుంచి రూపాయి చొప్పునప అదనంగా ఈ హోటల్ ఎంత తీసుకుంటోందన్న లెక్కలు కూడా వివరించారు. అయితే, తాము చాలా రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఆ రూపాయి తీసుకుంటున్నట్లు హోటల్ యాజమాన్యం వాదించినా.. ఫోరం మాత్రం దాంతో ఏకీభవించలేదు. అదనంగా వసూలు చేసినందుకు వంద రూపాయల నష్ట పరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో వెయ్యి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. మెనూ కార్డు మీదే ప్లేటు ఇడ్లీ ఖరీదు రూ. 25 అని చెప్పి ఉంటే తాను కచ్చితంగా చెల్లించేవాడినని, అక్కడ మాత్రం తక్కువ పెట్టి ఇక్కడ ఎక్కువగా ఎందుకు తీసుకుంటున్నారని లాయర్ నర్సిహమూర్తి ప్రశ్నించారు.
హైకోర్టుకు వెళ్లినా..
వినియోగదారుల ఫోరం 2014లో ఈ ఆదేశాలిచ్చింది. దాన్ని సవాలుచేస్తూ సదరు హోటల్ చైన్ వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా వాళ్లకు చుక్కెదురే అయ్యింది. హైకోర్టు హోటల్ వాళ్ల పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దిగువ కోర్టు ఇచ్చి ఆదేశాలను సమర్థించింది.