విగ్రహాల దొంగల ముఠా అరెస్టు
హైదరాబాద్: పురాతన విగ్రహాలను దొంగిలించే ముఠా ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు వనస్థలిపురం పోలీసులు బుధవారం ఉదయం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా నుంచి ఓ వాహనంలో వస్తున్న ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. నల్లగొండ జిల్లా డిండిలోని ఓ ఆలయంలో ఇటీవల దేవతా విగ్రహాలను ఎత్తుకుపోయారు. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై ముఠా కదలికలపై కన్నేసిన పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన మూడు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు.