ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్!
పటాన్చెరు: సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో రైళ్ల రద్దీ కారణంగా వాటికి ప్రత్యామ్నాయంగా నగరశివారులోని ఈదులనాగులపల్లి(మెదక్ జిల్లా రామచంద్రాపురం)లో కొత్తగా రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాలని దక్షిణమధ్య రైల్వే అధికారుల భావిస్తున్నారు. ఇప్పటికే వారు మౌలాలి, ఈదులనాగులపల్లిని పరిశీలించారు.
అయితే టెర్మినల్ నిర్మాణానికి కావాల్సిన 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఈదులనాగులపల్లిలో ఉంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తూ.. రైల్వే అధికారులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. తాజాగా విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం కూడా ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్ ఏర్పాటుపై కలెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిసింది. ఇక్కడ టెర్మినల్ ఏర్పాటైతే వికారాబాద్, మెదక్ రైతులకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. దాదాపు సికింద్రాబాద్ స్టేషన్లో ఉండే రైళ్ల రాకపోకల సంఖ్యలో సగం వరకు ఈదులనాగులపల్లికి వచ్చిపోయే అవకాశం ఉంది.కాగా, ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్‌కు అవసరమైన స్థలాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ బొజ్జా పరిశీలించారు.