మైనారిటీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత
ఇప్తార్ విందులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ సిటీ: మైనారిటీ వర్గాల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ విభాగం, మైనారిటీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాలులో రంజాన్ మాసం పురస్కరించుకొని ఆదివారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విందులో కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో పాటు ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, వరుపుల సుబ్బారావు అతిథులుగా పాల్గొన్నారు. వారు జిల్లాలోని ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ దీక్షలు, ప్రార్థనలు మానవీయతను మేల్కొలిపి శాంతి సౌభ్రాతృత్వాలను నింపుతాయన్నారు. మైనారిటీ వర్గాల ప్రజలకు జిల్లా యంత్రాంగం సదా అండగా ఉంటుందని, ఇఫ్తార్ విందుకు తనతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి సీనియర్, ఉన్నతాధికారులు తరలిరావడం దీనికి నిదర్శనమన్నారు. జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, జేసీ–2 రాధాకృష్ణమూర్తి, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ వి.విజయరామరాజు, ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్, డీఎఫ్ఓ నందిని సలారియా, ఓఎస్డీ అద్నాన్ నయీమ్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ శాస్త్రి, మైనారిటీ సంక్షేమాధికారి డీఎస్ సునీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, నగరంలోని వివిధ మసీదుల పెద్దలు పాల్గొన్నారు.