ఐగేట్‌పై ఫణీష్ మూర్తి దావా
బెంగళూరు: సహోద్యోగినితో సన్నిహిత సంబంధాల ఆరోపణల మీద ఐగేట్ సీఈవో పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఫణీష్ మూర్తి తాజాగా కంపెనీపై దావా వేశారు. తాను సదరు ఉద్యోగినితో సంబంధాలను కంపెనీకి తెలియజేయలేదన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం గురించి తెలుసునంటూ ఒక స్వతంత్ర డెరైక్టరు రాసిన లేఖ తన వద్ద ఉందని ఫణీష్ మూర్తి వివరించారు. కంపెనీ కావాలనే తనను తొలగించడానికి నిబంధనల దుర్వినియోగానికి పాల్పడిందని పేర్కొన్నారు. మరోవైపు, కంపెనీతో ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన 5,27,000 స్టాక్స్‌ని కూడా ఐగేట్ తొక్కిపెట్టి ఉంచిందన్నారు.
వీటి విలువ 1.7 కోట్ల డాలర్లు ఉంటుందని మూర్తి వివరించారు. ఈ షేర్లను విక్రయించాలని అనుకున్నా.. ఇది ప్రతికూల సంకేతాలు పంపుతుందంటూ బోర్డు అభ్యర్థించడం వల్ల ఆ యోచన గతంలో విరమించుకున్నానని ఆయన చెప్పారు. తాను ఎంతో శ్రమపడి సంస్థను అభివృద్ధి చేశానని, కానీ కంపెనీ మాత్రం ఒప్పందాన్ని గౌరవించకుండా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని ఫణీష్ మూర్తి తెలిపారు. అటు, ఐగేట్ మాత్రం ఫణీష్ మూర్తి ఆరోపణలను తోసిపుచ్చింది. ఆయన వాదనల్లో ఎలాంటి పస లేదని కొట్టి పారేసింది.