గూడ్స్ రైలులో మంటలు
బొగ్గుతో వెళ్తుండగా ప్రమాదం
యలమంచిలి స్టేషన్లో గుర్తించిన గార్డు
మూడు గంటలు శ్రమించి అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
యలమంచిలి, న్యూస్‌లైన్: బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు రేగడంతో సిబ్బంది సకాలంలో స్పందించి ప్రమాదాన్ని నివారించారు. యలమంచిలి రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో గూడ్స్ రైలులో మొదటిబోగీ నుంచి మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుంచి కొండపల్లి బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు సిగ్నల్ లేకపోవడంతో యలమంచిలి రైల్వేస్టేషన్ లో నిలిపారు.
ఆ సమయంలో బోగీనుంచి పొగలు వస్తున్నట్టు గార్డు ఏ.ఆడమ్ గుర్తించారు. వెంటనే స్టేషన్ సూపరింటెండెంట్‌కు తెలిపారు. ఆయన ద్వారా సమాచారం అందుకున్న యలమంచిలి అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి రైలు బోగీలో మంటలను అదుపు చేశారు. సుమారు 3 గంటలపాటు మంటలను ఆర్పారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది గునపాలతో బొగ్గును పైకి తీస్తూ పెద్దయెత్తున నీటిని వినియోగించారు. రైలు ప్రయాణంలో బొగ్గు రాపిడి వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని రైల్వేశాఖ సిబ్బంది తెలిపారు. అయితే ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదు.