IIPH
-
సెల్ ఫోన్ డ్రైవింగ్ వీకెండ్లోనే ఎక్కువ.. ఎందుకంటే!
చట్టాలు కఠినతరం చేస్తున్నా, జరిమానాలు భారీగా విధిస్తున్నా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఆగడం లేదు. అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం, సిగ్నల్స్ పట్టించుకోకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఐఐపీహెచ్), మరో రెండు స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్‌తో పరేషాన్ హైదరాబాద్‌లో 16.5 శాతం మంది దిచక్ర వాహన చోదకులు డ్రైవింగ్ చూస్తూ ఫోన్ మాట్లాడుతున్నారని అధ్యయనంలో తేలింది. వీరిలో 71.7 శాతం మంది ఫోన్‌ను చేతితో పట్టుకోకుండానే వాహనాలు నడుపుతున్నారు. అంటే ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ వినియోగిడం లేదా ఫోన్‌ను హెల్మెట్ లోపల పెట్టుకుని మాట్లాడుతున్నారన్న మాట. వీక్‌డేస్(35.49%)తో పోలిస్తే వారాంతాల్లో సెల్‌ఫోన్ డ్రైవింగ్(64.51%) చేసే వారే ఎక్కువగా ఉన్నారు. బిజీ రోడ్లలో 26.08%, రద్దీ లేని రహదారుల్లో 73.92% మంది దిచక్ర వాహనదారులు ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు. రద్దీ సమయాల్లో పోలిస్తే(30.09%), రద్దీలేని సమయంలోనే (69.91%) ఈ ట్రెండ్ ఎక్కువగా కనబడుతోంది. చట్టంలో సవరణలు చేయాలి అధ్యయంలో భాగంగా మాదాపూర్ ఐటీ కారిడార్, అమీర్‌పేట, మేడ్చల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను వీడియో తీసి విశ్లేషించారు. ఏయే సమయాల్లో ఆయా రహదారులపై వాహనదారులు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారనే విషయాన్ని లోతుగా పరిశీలించారు. ‘ఎక్కువ మంది వాహన చోదకులు హేండ్ ఫ్రీ మోడ్‌లోనే డ్రైవ్ చేస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ బండి నడిపే వారి సంఖ్య వీకెండ్లోనే అధికంగా ఉంటోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నాన్-బిజీ రోడ్లపై రద్దీ తక్కువగా సమయంలోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా కనబడుతోంది. వీక్‌డేస్‌తో పోలిస్తే ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారి సంఖ్య వారాంతాల్లో ఒకటిన్నర శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించాం. చేతులతో ఫోన్ పట్టుకుని వాహనం నడిపేవారితో పాటు హేండ్ ఫ్రీ ఫోన్ డ్రైవింగ్ చేసే వారికి కూడా జరిమానాలు విధించేలా మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేర్చాల’ని పరిశోధకులు కోరుతున్నారు. (క్లిక్: ఫోర్త్ వేవ్‌కు అవకాశాలు తక్కువ.. కానీ) మూడేళ్లలో 85 వేల కేసులు సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. గత మూడేళ్లలో 85,862 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే వారిపై మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 184 కింద కేసులు నమోదు చేస్తామన్నారు. 85,862 కేసుల్లో దాదాపు 68,900 కేసులకు సంబంధించి జరిమానాలు వసూలయ్యాయని.. 16,782 జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్టు వెల్లడించారు. 2021లో 36,566 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. (క్లిక్: మెడికల్ పీజీ ‘బ్లాక్’ దందా!) -
చిన్నారి మెదడు చితుకుతోంది!
సాక్షి,సిటీబ్యూరో: అల్లారుముద్దుగా చూసుకుంటున్న పిల్లలు అనుకోని ప్రమాదంలో పడుతున్నారు. అది గుర్తించేలోగా పరిస్థితి చేయి దాటిపోతోంది. గ్రేటర్లో ప్రతి వంద మంది చిన్నారుల్లో ఒకరు మెదడు, న్యూరో సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్) సంస్థ తాజాగా చేసిన అధ్యయనంలో ఈ అంశాన్ని గుర్తించారు. ఈ సమస్యలను ‘న్యూరో డెవలప్మెంటల్డిజార్డర్స్’(ఎన్డీడీ)గా పిలిచే ఈ తరహా సమస్యలతో 2–9 ఏళ్ల వయసున్న వారే ఎక్కువగా బాధపడుతున్నట్టు స్టడీలో తేలింది. సంస్థకు చెందిన నిపుణులు గ్రేటర్‌లోని 5 వేల మంది చిన్నారులపై అధ్యయనం చేయగా మెదడు, నరాలకు సంబంధించిన సమస్యలతో పలువురు అవస్థలు పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో ‘దృష్టి లోపం, ఎపిలెప్సి, న్యూరోమోర్టార్ సమస్యలు, సెరిబ్రల్ పాల్సీ, చెవుడు, సరిగా మాట్లాడలేకపోవడం, ఆటిజం, మానసిక పరిపక్వత లేకపోవడం’ వంటి న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ వెలుగు చూశాయి. చాలా మంది చిన్నారులకు తరగతి గదుల్లో పాఠాలు సరిగా వినిపించకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ విషయంలో జాతీయ స్థాయి సగటు కంటే గ్రేటర్లో అధిక శాతం మంది ఉన్నట్టు తేల్చారు. ఇక్కడి పిల్లలు ఏదో ఒక న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లువెల్లడించారు. వయసు వారీగా బాధితులు.. ♦ గ్రేటర్లో 2–6 ఏళ్ల చిన్నారుల్లో 2.9 శాతం నుంచి 18.7 శాతం మంది ఎన్డీడీ సమస్యలతో బాధపడుతున్నారట. ♦ 6–9 ఏళ్ల మధ్యనున్న వారిలో 6.5 నుంచి 18.5 శాతం మంది బాధుతులున్నారు. ఈ వయోగ్రూపులో చాలామంది ఒకటి రెండు సమస్యలు సర్వసాధారణంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ♦ జాతీయ స్థాయిలో 2–6 ఏళ్లలోపు వారి 9.2 శాతం బాధితులు ఉండగా, 6–9 ఏళ్లలోపు వారిలో 13.6 శాతం మంది ఉన్నారు. ఐఐపీహెచ్ అధ్యయనంలో పాల్గొన్నవారు ♦ ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నవారిలో 18 ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన చిన్నపిల్లల వైద్యనిపుణులు, నరాల వైద్యులు, ఎపిడెమాలజీ, పబ్లిక్‌హెల్త్, సోషల్ సైన్స్, బయో స్టాటిస్టిక్స్, చైల్డ్ సైకాలజీ, ఈఎన్టీ, కంటి వైద్యులు సభ్యులుగా ఉన్నారు. ముందుగా ఇలా గుర్తించాలి.. ఎన్డీడీ సమస్యలను చిన్నతనంలోనే ఎలా గుర్తించాలో ఈ అధ్యయనం తెలిపింది. ఇళ్లలో ప్రసవాలు జరగడం, పుట్టిన సమయంలో వెంటనే ఏడవక పోవడం, శ్వాస కష్టంగా తీసుకోవడం, పుట్టిన వెంటనే అనారోగ్యానికి గురికావడం, రెండు కిలోల కంటే తక్కువ బరువుతో జన్మించడం, నెలలు నిండకముందే జన్మించిన వారిలో ఇలాంటి సమస్యలు కనిపిస్తాయని నిపుణులు వెల్లడించారు. ఇక న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న చిన్నారులకు ఎక్స్‌రే, సీటీ బ్రెయిన్, ఎంఆర్ఐ బ్రెయిన్, రక్త పరీక్షల ద్వారా గుర్తించాల్సి ఉంటుందని ప్రకటించారు. ఆదిలోనే గుర్తించి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తే ఎన్డీడీ సమస్యల నుంచి చిన్నారులకు విముక్తి లభిస్తుందని అధ్యయన బృందం పేర్కొంది. న్యూరో సమస్యలకు కారణాలివీ.. చాలా ప్రాంతాల్లో వసతులున్న ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగడం లేదు. కొన్నిసారు బిడ్డ పుట్టిన వెంటనే అనారోగ్యానికి గురవుతుంటారు. మెదడుకు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు సోకడం, తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకముందే జన్మించడం వంటి కారణలతో పాటు కొందరిలో జన్యుపరమైన లోపాలు సైతం ఉంటున్నాయి. -
వైకల్య నివారణ కీలకం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆరోగ్యరంగానికి ఇచ్చే ప్రాధాన్యతాంశాల్లో వైకల్య నివారణ, వైకల్యం బారిన పడిన వారికి అందించాల్సిన ఆరోగ్యం ఎజెండాగా ఉండాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఐఐపీహెచ్) అధ్యక్షుడు డా.శ్రీనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘ఇంప్రూవింగ్ ద హెల్త్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబులిటీ’ అన్న అంశంపై ఆదివారమిక్కడ సీఆర్ రావ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన అంతర్జాతీయ సింపోజియంలో ఆయన ప్రసంగించారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(అంటువ్యాధులు కాని మధుమేహం, రక్తపోటు) తదితర వ్యాధుల ద్వారా ఎంతోమంది వైకల్యానికి గురవుతున్నారని, ఈ వ్యాధులను నియంత్రించాల్సిన అవసరముందని అన్నారు. రక్తపోటు వల్ల ఎంతోమంది పెరాలసిస్ స్ట్రోక్‌కు గురై శాశ్వత వైకల్యంలోకి వెళుతున్నారని, వీరు తిరిగి పూర్వపు జీవితాన్ని పొందేలా కృత్రిమ యంత్రాలు ఇవ్వాలని, వీరికి ప్రభుత్వపరంగా ఆదరణ కల్పించాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి.. ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. వైకల్య నివారణకు అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు దీనిపై తగినంతగా పరిశోధనలు జరగకపోవడానికి కారణాలు కనుక్కోవాలన్నారు. దీనిపై శాస్త్రవేత్తలు, వైద్యులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వాలు సైతం వైకల్య నివారణపై ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలని ఆయన సూచించారు.