చట్టాలు కఠినతరం చేస్తున్నా, జరిమానాలు భారీగా విధిస్తున్నా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఆగడం లేదు. అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం, సిగ్నల్స్ పట్టించుకోకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఐఐపీహెచ్), మరో రెండు స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెల్లడయ్యాయి.
సెల్ ఫోన్ డ్రైవింగ్‌తో పరేషాన్
హైదరాబాద్‌లో 16.5 శాతం మంది దిచక్ర వాహన చోదకులు డ్రైవింగ్ చూస్తూ ఫోన్ మాట్లాడుతున్నారని అధ్యయనంలో తేలింది. వీరిలో 71.7 శాతం మంది ఫోన్‌ను చేతితో పట్టుకోకుండానే వాహనాలు నడుపుతున్నారు. అంటే ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ వినియోగిడం లేదా ఫోన్‌ను హెల్మెట్ లోపల పెట్టుకుని మాట్లాడుతున్నారన్న మాట. వీక్‌డేస్(35.49%)తో పోలిస్తే వారాంతాల్లో సెల్‌ఫోన్ డ్రైవింగ్(64.51%) చేసే వారే ఎక్కువగా ఉన్నారు. బిజీ రోడ్లలో 26.08%, రద్దీ లేని రహదారుల్లో 73.92% మంది దిచక్ర వాహనదారులు ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు. రద్దీ సమయాల్లో పోలిస్తే(30.09%), రద్దీలేని సమయంలోనే (69.91%) ఈ ట్రెండ్ ఎక్కువగా కనబడుతోంది.
చట్టంలో సవరణలు చేయాలి
అధ్యయంలో భాగంగా మాదాపూర్ ఐటీ కారిడార్, అమీర్‌పేట, మేడ్చల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను వీడియో తీసి విశ్లేషించారు. ఏయే సమయాల్లో ఆయా రహదారులపై వాహనదారులు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారనే విషయాన్ని లోతుగా పరిశీలించారు. ‘ఎక్కువ మంది వాహన చోదకులు హేండ్ ఫ్రీ మోడ్‌లోనే డ్రైవ్ చేస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ బండి నడిపే వారి సంఖ్య వీకెండ్‌లోనే అధికంగా ఉంటోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నాన్-బిజీ రోడ్లపై రద్దీ తక్కువగా సమయంలోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా కనబడుతోంది. వీక్‌డేస్‌తో పోలిస్తే ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారి సంఖ్య వారాంతాల్లో ఒకటిన్నర శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించాం. చేతులతో ఫోన్ పట్టుకుని వాహనం నడిపేవారితో పాటు హేండ్ ఫ్రీ ఫోన్ డ్రైవింగ్ చేసే వారికి కూడా జరిమానాలు విధించేలా మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేర్చాల’ని పరిశోధకులు కోరుతున్నారు. (క్లిక్: ఫోర్త్ వేవ్‌కు అవకాశాలు తక్కువ.. కానీ)
మూడేళ్లలో 85 వేల కేసులు
సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. గత మూడేళ్లలో 85,862 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే వారిపై మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 184 కింద కేసులు నమోదు చేస్తామన్నారు. 85,862 కేసుల్లో దాదాపు 68,900 కేసులకు సంబంధించి జరిమానాలు వసూలయ్యాయని.. 16,782 జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్టు వెల్లడించారు. 2021లో 36,566 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. (క్లిక్: మెడికల్ పీజీ ‘బ్లాక్’ దందా!)
Comments
Please login to add a commentAdd a comment