అత్యాచారం కేసులో ఐఐటీ ప్రొఫెసర్ అరెస్టు
ప్రతిష్ఠాత్మక ఐఐటీ సంస్థకు డీన్‌గా వ్యవహరిస్తున్న ఓ ప్రొఫెసర్‌ను అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టుచేశారు. తమ వద్ద పనిచేసే ఓ మహిళా ఉద్యోగిపై ఐఐటీ విద్యావ్యవహారాల డీన్ అలోక్ కుమార్ ఘోషల్ దాదాపు నెల రోజుల పాటు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనను సోమవారం నాడు ప్రశ్నించి, మంగళవారం సాయంత్రం ఐఐటీ క్యాంపస్ నుంచే అరెస్టుచేసి తీసుకెళ్లారు.
నాలుగు రోజుల క్రితమే తమకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేశామని, సాక్ష్యాలు అందిన తర్వాత మరింత దర్యాప్తు కోసం ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆంద ప్రకాష్ తివారీ అనే సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కెమికల్ ఇంజనీరింగ్ శాఖకు చెందిన ప్రొఫెసర్ ఘోషల్, తమ శాఖలోనే ఉండే ఆఫీసు అసిస్టెంటుపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఆయనను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆయనను డీన్ పదవినుంచి తొలగించారు.