IIT-Hyderabad
-
పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై.. మళ్లీ అధ్యయనం కుదరదు
సాక్షి, అమరావతి: గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ–హైదరాబాద్, 58 లక్షల క్కూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ–రూర్కీ అధ్యయనంలో వెల్లడైందని.. వాటిని పరిగణలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఈఎన్సీలు చేసిన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా తోసిపుచ్చారు. గరిష్ట వరదలవల్ల బ్యాక్‌వాటర్ ప్రభావంతో ముంపు ఉంటుందన్న మూడు రాష్ట్రాల వాదనను కొట్టిపారేశారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే డిజైన్‌ను ఆమోదించామని.. ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహం (పీఎంఎఫ్), ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసే గరిష్ట వరద ప్రవాహం (స్టాండర్డ్ ప్రాజెక్ట్ ఫ్లండ్–ఎస్పీఎఫ్)లను పరిగణలోకి తీసుకుని బ్యాక్‌వాటర్ ప్రభావంపై ఆదిలోనే అధ్యయనం చేశామని గుర్తుచేశారు. తాము నిర్వహించిన అధ్యయనాల్లో బ్యాక్‌వాటర్ ప్రభావం ఉంటే ఆయా ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని సూచించామని.. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి సిద్ధమైందని వివరించారు. పోలవరం ప్రాజెక్టువల్ల ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని.. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు. ముంపు ప్రాంతాలను గుర్తించడానికి ఏపీతో కలిసి సంయుక్త సర్వేకు సిద్ధమవ్వాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఈఎన్సీలను ఆదేశించారు. శబరి, సీలేరు నదులౖపై కరకట్టలు నిర్మించడానికి వీలుగా.. ఆ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావంపై అనుమానాలను నివృత్తి చేయడానికి గత నెల 29న కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్ గుప్తాలు నాలుగు రాష్ట్రాల సీఎస్‌లతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో సాంకేతిక అంశాలపై చర్చించి.. ముంపు, బ్యాక్‌వాటర్‌పై అనుమానాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేయడానికి నాలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశాన్ని నిర్వహించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తాను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆ సమావేశంలో ఆదేశించారు. దీంతో శుక్రవారం ఢిల్లీలో నాలుగు రాష్ట్రాల ఈఎన్సీల నేతృత్వంలోని సాంకేతిక బృందాలు, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని సాంకేతిక నిపుణులతో ఆర్కే గుప్తా సమావేశమయ్యారు. రాజకీయ నాయకుల్లా మాట్లాడితే ఎలా? పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేలిన అంశాలకూ.. ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలవల్ల జరిగిన ముంపునకూ క్షేత్రస్థాయిలో పొంతన కుదరడంలేదని.. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాక్‌వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఈఎన్సీలు ఆర్కే గుప్తాను కోరారు. గోదావరికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరదే వస్తుందన్న అంచనాతో తాము ఏకీభవిస్తున్నామని.. కానీ, దాన్ని పరిగణలోకి తీసుకుని పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేలిన అంశాలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సరిపోవడంలేదని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. జూలైలో వచ్చిన వరదలవల్ల భద్రాచలం సహా ఏడు మండలాల పరిధిలోని 103 గ్రామాలు ముంపు బారిన పడ్డాయని.. 11 వేల మందిపై ప్రభావం పడిందని.. 150 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాల భూమి ముంపునకు గురైందని ఫొటోలు చూపుతూ వివరించారు. దీనిపై గుప్తా స్పందిస్తూ.. ఇంజనీర్లైన మీరు రాజకీయ నాయకుల్లా మాట్లాడటం తగదని చురకలంటించారు. దేశవ్యాప్తంగా ఇతర ప్రాజెక్టులకు చేసిన తరహాలోనే పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై అధ్యయనం చేశామని.. ఎక్కడా తమ అధ్యయనంపై ఎవరూ అభ్యంతరం తెలిపిన దాఖలాల్లేవన్నారు. బ్యాక్‌వాటర్ ప్రభావంపై మళ్లీ అధ్యయనం చేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. గోదావరికి వరద వచ్చినప్పుడు.. ఏ ప్రాంతంలో నీటి మట్టం ఎంత పెరిగిందన్న వివరాలను ఈనెల 19లోగా రాతపూర్వకంగా అందిస్తే.. వాటిని విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పుడు రెండన్నారు.. ఇప్పుడు 35? ఇక పోలవరం ప్రాజెక్టు వెనుక భాగంలో గోదావరిలో కిన్నెరసాని, ముర్రేడువాగు సహా 35 వాగులు కలుస్తాయని.. బ్యాక్‌వాటర్ ఈ వాగుల్లోకి ఎగదన్నడంతో ముంపునకు దారితీస్తోందని.. దీనిపై అధ్యయనం చేయాలని.. ముంపు ముప్పు తప్పించడానికి కరకట్టలు నిర్మించాలంటూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ వివరిస్తుండగా.. ఆర్కే గుప్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆదిలో కేవలం కిన్నెరసాని, ముర్రేడువాగుల ద్వారా బ్యాక్‌వాటర్ ప్రభావంపై అధ్యయనం చేస్తే చాలని కోరారని.. ఇప్పుడేమో 35 వాగులపై అధ్యయనం చేయాలని కోరుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి జోక్యంచేసుకుని.. కిన్నెరసాని, ముర్రేడువాగులపై అధ్యయనం చేశామని.. చెప్పుకోదగ్గ ప్రభావం ఉండదని తేలిందని.. ఆ అంశాలను తెలంగాణకు అందజేశామన్నారు. సంయుక్త సర్వే, ప్రజాభిప్రాయ సేకరణకు ఒడిశా నో మరోవైపు.. ముంపు ప్రభావం ఉండే ప్రాంతాలను గుర్తించడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించాలని, కరకట్టల నిర్మించడానికి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ గుప్తా ఆదేశాలను అమలుచేస్తామని ఛత్తీస్‌గఢ్ ఈఎన్సీ అంగీకరించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి ఇప్పటికే 150 అడుగుల కాంటూర్ పరిధిలోని ముంపు ప్రాంతాలను గుర్తించడానికి సంయుక్త సర్వే నిర్వహించామని.. 175 అడుగుల కాంటూర్ పరిధిలో కూడా గుర్తించడానికి సంయుక్త సర్వే నిర్వహించాలని కోరారు. కానీ.. ఒడిశా ఈఎన్సీ ఇందుకు సహకరించబోమన్నారు. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్ గుప్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు లోబడే ప్రాజెక్టును నిర్మిస్తున్నామనే అంశాన్ని గుర్తించాలని.. ఆ అవార్డు ప్రకారమే తమ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని స్పష్టంచేశారు. -
పోలవరంతో భద్రాద్రి భద్రమే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ఎలాంటి ముంపు ముప్పు ఉండదని ఐఐటీ–హైదరాబాద్ తేల్చి చెప్పింది. పోలవరాన్ని కట్టాక భద్రాచలం వద్ద పెరిగే గోదావరి నీటి మట్టం కేవలం గోరంతేనని (2 సెంటీమీటర్లు) స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాను స్వయంగా చేయించిన ఈ అధ్యయనంలోనే పోలవరం ద్వారా భద్రాచలానికి ఏ మాత్రం ముప్పు లేదని స్పష్టం కావడం గమనార్హం. వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేలా పోలవరం గేట్లను సమర్థంగా నిర్వహిస్తే బ్యాక్ వాటర్ ప్రభావం భద్రాచలం సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలపై ఏమాత్రం ఉండదని తెలిపింది. పోలవరం వద్ద గోదావరి గరిష్ట వరద, బ్యాక్ వాటర్ ప్రభావంపై తెలంగాణ నీటిపారుదల శాఖ 2017లో ఐఐటీ–హైదరాబాద్‌తో అధ్యయనం నిర్వహించింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో సీడబ్ల్యూసీ, తెలంగాణ జలవనరుల విభాగం లెక్కల ప్రకారం వరద ప్రవాహాలు, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నమోదు చేసిన వరద ప్రవాహాలను అధ్యయనం చేసేందుకు ఐఐటీ–హైదరాబాద్‌కు తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. ముంపు ముప్పు ఉత్తదే.. ధవళేశ్వరం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన రికార్డులు కచ్చితంగా ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకుని పోలవరం వద్ద వెయ్యేళ్లకు, పది వేల ఏళ్లకు ఒకసారి గరిష్టంగా వచ్చే వరదను లెక్కట్టిన ఐఐటీ–హైదరాబాద్ బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్రంగా అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలివీ.. ► పోలవరంలో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేస్తే 637 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ముంపునకు గురవుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 601, ఒడిశాలో 12, చత్తీస్‌గఢ్‌లో 24 చ.కి.మీ. భూభాగం ఉంది. ఆంధ్రప్రదేశ్ 222 రెవెన్యూ గ్రామాలు ముంపునకు గురవుతుండగా చత్తీస్‌గఢ్‌లో పది, ఒడిశాలో ఏడు రెవెన్యూ గ్రామాలపై ముంపు ప్రభావం ఉంటుంది. ► గోదావరిలో గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 57 మీటర్లు ఉంటే.. కట్టాక 57.02 మీటర్లు మాత్రమే ఉంటుంది. ► గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గరిష్టంగా 35,06,338 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ► గోదావరి గరిష్ట వరద ప్రవాహాలను పరిగణలోకి తీసుకుంటే వెయ్యేళ్లకు ఒకసారి గరిష్టంగా 39.72 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 57.7 మీటర్లు ఉంటే.. నిర్మాణ పూర్తయ్యాక 57.77 మీటర్లు ఉంటుంది. ► పది వేల సంవత్సరాలకు ఒకసారి గోదావరికి గరిష్టంగా 44.61 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 61.41 మీటర్లు ఉంటే.. నిర్మాణ పూర్తయ్యాక 61.43 మీటర్లు ఉంటుంది. ► కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ మేరకు గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా విడుదల చేసేలా పోలవరంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్‌వే నిర్మిస్తున్నారు. పోలవరం డిజైన్ మేరకు అంటే గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద గోదావరికి వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రాజెక్టు కట్టక ముందు 61.77 మీటర్లు ఉంటే కట్టాక 61.79 మీటర్లు ఉంటుంది. గేట్ల నిర్వహణే కీలకం పోలవరం ప్రాజెక్టు గేట్లను సమర్థంగా నిర్వహిస్తే బ్యాక్ వాటర్ ప్రభావం కనిష్ట స్థాయిలో ఉంటుందని ఐఐటీ–హైదరాబాద్ తేల్చింది. బ్యాక్ వాటర్ ప్రభావం లేకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ► పోలవరంలో నీటి నిల్వలు.. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరదను దిగువకు విడుదల చేసేలా సమర్థంగా గేట్లను నిర్వహించాలి. ► పోలవరం జలవిస్తరణ ప్రాంతంలో నదీ గర్భంలో ఎప్పటికప్పుడు ఇసుక మేటలను తొలగించాలి. దీనివల్ల నీటి మట్టం పెరగదు. ► ముంపును నివారించాలంటే ఎగువన కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి ప్రాంతాల్లో బ్యారేజ్‌లు నిర్మించాలి. ► పోలవరం డ్యామ్ నిర్మించడం వల్ల తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భూఉపరితల మట్టం కంటే నీటి ఉపరితల మట్టం రెండు సెంటీమీటర్ల మేర పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రాధాన్యత క్రమంలో పది దశల్లో గోదావరికి ఇరువైపులా 124.55 కి.మీ. పొడవున కరకట్టలు నిర్మించాలి. ఇందుకు రూ.996.4 కోట్ల వ్యయం అవుతుంది. -
సైయంట్ 5జీ నెట్వర్క్స్ సీవోఈ ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్, తయారీ, డిజిటల్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సైయంట్ తాజాగా తమ ప్రైవేట్ 5జీ నెట్వర్క్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (సీవోఈ) ఏర్పాటు చేసింది. దీనికి పరిశోధన భాగస్వామిగా హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ–హెచ్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని సైయంట్ కేంద్రంలో ఈ సీవోఈని ఏర్పాటు చేశారు. ప్రైవేట్ 5జీ నెట్వర్క్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు, పరీక్షించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఐఐటీ–హెచ్ అభివృద్ధి చేసిన 5జీ కోర్ ప్లాట్‌ఫామ్.. వివిధ అవసరాలకు ఏ విధంగా ఉపయోగపడగలదో ఇందులో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. అత్యాధునిక రీసెర్చ్, ఆవిష్కరణలకు పేరొందిన ఐఐటీ–హెచ్ అనుభవం .. సీవోఈకి ఎంతో ఉపయోగకరంగా ఉండగలదని సైయంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ అట్ల తెలిపారు. ఇప్పటికే వివిధ అంశాల్లో సైయంట్‌తో కలిసి పని చేస్తున్నామని, ప్రైవేట్ 5జీ సీవోఈతో ఈ బంధం మరింత బలపడగలదని ఐఐటీ–హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి చెప్పారు. -
వ్యాక్సిన్ సర్టిఫికెట్లో తప్పులుంటే మార్చొచ్చు
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకున్నారా? అందులో ఏమైనా తప్పులు దొర్లాయా? కంగారు అక్కర్లేదు. కోవిన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో తప్పుల్ని సవరించుకోవచ్చు. రైజ్ ఏన్ ఇష్యూ అనే కొత్త ఫీచర్ సాయంతో సరి్టఫికెట్లో తప్పుల్ని దిద్దుకోవచ్చునని ఆరోగ్య శాఖ తెలిపింది. పేరు, పుట్టిన తేదీ, జెండర్ లాంటి అంశాల్లో ఏమైనా తప్పులుంటే మార్చుకోవచ్చు. అయితే ఒక్కసారి మాత్రమే ఈ ఆప్షన్ని వినియోగించుకోగలరని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ చెప్పారు. చాలా సులభమైన స్టెప్స్ సాయంతో ఈ పని మీరే చేసుకోవచ్చు ► www.cowin.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి ► సైన్ ఇన్ అవడానికి 10 అంకెలున్న మీ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి ► ఆ తర్వాత అకౌంట్ డిటైల్స్‌లోకి వెళ్లాలి ► ఒక డోసు, లేదంటే రెండు డోసులు తీసుకున్న వారికి ‘‘రైజ్ ఏన్ ఇష్యూ’’ అనే బటన్ కనిపిస్తుంది ► ఆ బటన్ నొక్కితే కరెక్షన్ ఇన్ సరి్టఫికెట్ అంటూ ఆప్షన్లు కనిపిస్తాయి. మీ సరి్టఫికెట్లో ఎక్కడ తప్పులున్నాయో వాటిని ఎడిట్ చేసుకోవాలి. ► తర్వాత తప్పుల్లేని సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకొని దాచుకోవాలి చదవండి: పిల్లలకు రెమ్‌డెసివిర్ వద్దు -
మన భాగ్యనగరం... పరిశోధనల భాండాగారం
టాప్ స్టోరీ: ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే పరిశోధనలు-ఆవిష్కరణల్లో ముందుండాలి. పరిశోధనల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఎన్నో రీసెర్చ సెంటర్లను ఏర్పాటు చేసింది. మేటి విద్యా సంస్థలకు నిలయమైన హైదరాబాద్.. ఎన్నో పరిశోధన సంస్థలకు కేంద్రంగా విరాజిల్లుతోంది. వీటిని ఆసరాగా చేసుకుని నగర యువత పరిశోధనల్లో రాణిస్తోంది. మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను చూపుతోంది. తద్వారా అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసుకుంటోంది. కొత్త విద్యా సంవత్సరంలో పరిశోధనలకు నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో.. నగరంలో కొలువుదీరిన పరిశోధన సంస్థలు, కోర్సుల వివరాలు.. పరిశోధనాంశాలెన్నో.. హైదరాబాద్‌లో సామాజిక శాస్త్రాలు మొదలుకొని బేసిక్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, ఎర్త్ సెన్సైస్ వరకూ.. ఆహార ధాన్యాల నుంచి ఫార్మాస్యూటికల్ సెన్సైస్ వరకూ అన్ని రకాల పరిశోధలు సాగుతున్నాయి. సామాజిక సమస్యలపై, వివిధ వ్యాధులకు కారణాలు, దేశ రక్షణకు అవసరమైన పరికరాల తయారీ, పశువుల వ్యాధులు వంటి ఎన్నో అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ టూ పీహెచ్డీ ఆయా పరిశోధన సంస్థల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ నుంచి పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్.. అజీం ప్రేమ్‌జీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌తో కలిసి ఎడ్యుకేషన్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్ - పీహెచ్డీ, ఉమెన్స్ స్టడీస్‌లో పీహెచ్డీ కోర్సును అందిస్తోంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో.. ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, పీహెచ్డీ, కెమిస్ట్రీలో పీహెచ్డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన సంస్థలు వివిధ అంశాల్లో పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నాయి. పరిశోధనలతోపాటు ప్రోత్సాహం.. జేఆర్‌ఎఫ్‌నకు అర్హత సాధించి పీహెచ్డీ చదివే అభ్యర్థులకు ఆయా సంస్థల నియమ నిబంధలను బట్టి మొదటి రెండేళ్లు ప్రారంభంలో నెలకు రూ.12,000 నుంచి రూ.16,000 వరకు అందిస్తున్నాయి. తర్వాత మూడేళ్లు నెలకు రూ.14,000 నుంచి రూ.20,000 వరకు చెల్లిస్తున్నాయి. ప్రతి ఏటా కాంటిన్జెన్సీ గ్రాంట్‌ను కూడా ఇస్తున్నాయి. ఈ మొత్తం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటు ంది. విద్యార్ధులు కేవలం అకడెమిక్స్కే పరిమితం కాకుండా.. పరిశోధనలు చేస్తే అద్భుత కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చని ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ ఆర్.కె.చద్ధా సూచించారు. ఐఐటీ- హైదరాబాద్ విద్యార్థుల ప్రతిభ రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రతను పసిగట్టే మ్యాగ్నటిక్ సెన్సార్ అభివృద్ధిలో కీలకంగా మారారు ఐఐటీ-హైదరాబాద్ పీహెచ్డీ విద్యార్థులు. ఇలాంటి ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించేందుకు తమ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ యు.బి.దేశాయ్ తెలిపారు. వివిధ అంశాలపై క్యాంపస్‌లో 400 మంది పీహెచ్‌డీలు చేస్తున్నారని చెప్పారు. సిటీలోని పలు ఇంజనీరింగ్ క్యాంపస్‌లు కూడా పరిశోధనలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ప్రాజెక్టులు, వర్క్‌షాప్స్, ఫెస్ట్‌ల వంటివి విద్యార్థుల్లో అంతర్గతంగా దాగిన ఇన్నోవేషన్‌ను వెలికితీసేందుకు వారధిగా ఉపయోగపడతాయని ఐఐటీ మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆర్.డేవిడ్ కొయిల్ పిళ్లై చెప్పారు. కోర్సులు.. అర్హతలు.. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశించాలంటే.. నిర్దేశిత మార్కులతో సంబంధిత/అనుబంధ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పీహెచ్డీ కోర్సులో ప్రవేశానికి నిర్దేశిత మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా పరిశోధన సంస్థల నిబంధనలకు అనుగుణంగా సీఎస్ఐఆర్-నెట్, గేట్, యూజీసీ-నెట్, ఐసీఎంఆర్ - జేఆర్ఎఫ్, డీబీటీ-జేఆర్ఎఫ్, డీఎస్టీ-ఇన్స్పైర్ వంటివాటిలో అర్హత సాధించాలి. వీటి ఆధారంగా వివిధ పరిశోధన సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇవేకాకుండా.. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ(డీబీటీ), డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ), ఐసీఎంఆర్ వంటివి కూడా పరీక్ష/మౌఖిక పరీక్ష ఆధారంగా అభ్యర్థులను జేఆర్ఎఫ్కు ఎంపిక చేస్తాయి. సిటీలో పరిశోధన సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ(సీసీఎంబీ) సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్(సీడీఎఫ్‌డీ) నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ డెరైక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ డెరైక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ డెరైక్టరేట్ ఆఫ్ సోర్గమ్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(టిస్) ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్ నేషనల్ సెంటర్ ఫర్ లేబొరేటరీ సెన్సైస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ అటామిక్ మినరల్స్ డెరైక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇండియన్ ఓషన్ స్టడీస్. భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు ‘‘నాణ్యమైన విద్యతోనే నిపుణులు తయారవుతారు. గతంతో పోల్చితే విద్యార్థులు ప్రస్తుతం ప్రయోగాలు, పరిశోధనల వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఎన్నో కొత్త ఆవిష్కరణలు భారతదేశం నుంచి వెలుగుచూస్తాయి. అకడమిక్స్, ప్లేస్‌మెంట్స్.. ఈ రెండే కాకుండా విద్యార్థులు రీసెర్చలోనూ పాల్గొనాలి. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విరివిగా అందిపుచ్చుకోవాలి. -ప్రొఫెసర్ దేవేంద్ర జలిహల్, ఐఐటీ-మద్రాస్