IIT JEE Mains
-
జేఈఈ మెయిన్స్‌లో.. టాప్ లేపిన తెలంగాణ!
ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో తెలంగాణ టాప్ లేపింది. జాతీయ స్థాయి మొదటి ర్యాంకు మాత్రమేగాక.. టాప్–10లో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులే సాధించారు. జాతీయ స్థాయిలో వంద పర్సంటైల్ సాధించిన వారిలోనూ రాష్ట్ర విద్యార్థులు 11 మంది ఉన్నారు. ఏపీతో కలుపుకొంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 16 మంది వంద పర్సంటైల్ సాధించిన టాప్–43లో నిలిచారు. ఇక ఓపెన్ కేటగిరీలో మొదటి వంద ర్యాంకుల్లో 25కుపైగా, టాప్ వెయ్యి ర్యాంకుల్లో 200కుపైగా తెలంగాణ విద్యార్థులకు దక్కాయి. ఈసారి జేఈఈ పరీక్ష జాతీయ స్థాయిలో రెండు దఫాలుగా.. జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి జరిగింది. కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11,62,398 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,13,325 మంది హాజరయ్యారు. తుది ఫలితాలు, ర్యాంకులను ఎన్టీఏ శనివారం వెల్లడించింది. టాపర్స్ వీరే.. జేఈఈ మెయిన్స్‌లో దేశవ్యాప్తంగా వంద శాతం పర్సంటైల్‌ను 43 మంది విద్యార్థులు సాధించగా.. అందులో 11 మంది తెలంగాణ విద్యార్థులే. మొత్తంగా టాప్ ర్యాంకు హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట కౌండిన్యకు దక్కింది. టాప్–10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన అల్లం సుజయ్ 6వ ర్యాంకు, వావిళ్ల చిద్విలాసరెడ్డి 7వ ర్యాంకు, బిక్కన అభినవ్ చౌదరి 8వ ర్యాంకు, అభినీత్ మంజేటి 10వ ర్యాంకు సాధించారు. ఇక గుత్తికొండ అభిరాం (17వ ర్యాంకు), భరద్వాజ (18వ ర్యాంకు), పాలూరి గణకౌశిక్రెడ్డి (20వ ర్యాంకు), రమేశ్ సూర్యతేజ (21వ ర్యాంకు), నందిపాటి సాయి దుర్గారెడ్డి (40వ ర్యాంకు), ఈవూరి మోహన శ్రీధర్‌రెడ్డి (41వ ర్యాంకు) తదితరులు వందశాతం పర్సంటైల్ సాధించిన టాప్–43 ర్యాంకర్లలో ఉన్నారు. రేపట్నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు జేఈఈ అర్హత సాధించినవారు ఈ నెల 30 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ ప్రకటించింది. ర్యాంకు కార్డు డౌన్లోడ్ చేసుకుని, దాని ఆధారంగా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వివిధ కేటగిరీలకు కేటాయించిన కటాఫ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులైన వారి వివరాలను ర్యాంకు కార్డులో పొందుపరిచారు. అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ ఇదీ.. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు హాజరైనవారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. పరీక్షలో వచి్చన మార్కులను పరిగణనలోకి తీసుకుని వివిధ కేటగిరీల వారీగా కటాఫ్ నిర్ణయిస్తారు. గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి ఓపెన్ కేటగిరీలో 90 పర్సంటైల్‌తో కటాఫ్ నిర్ణయించారు. కేటగిరీల వారీగా కటాఫ్ ఇదీ.. కేటగిరీ కటాఫ్ ఎంపికైన అభ్యర్థుల సంఖ్య ఓపెన్ 90.788642 98,612 పీహెచ్ 0.0013527 2,685 ఈడబ్ల్యూఎస్ 75.6229025 25,057 ఓబీసీ 73.6114227 67,613 ఎస్సీ 51.9776027 37,536 ఎస్టీ 37.2348772 18,752 కృత్రిమ మేధపై పట్టు సాధించాలనుంది జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయి టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌లోనూ ఇదే పట్టుదలతో విజయం సాధిస్తా. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరాలనుంది. తర్వాత ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో పట్టు సాధించాలన్నది నా లక్ష్యం. ఆ దిశగా రోజుకు 18 గంటలు కష్టపడి చదువుతున్నాను. మా నాన్న శ్రీపణి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మ రాజరాజేశ్వరి నా కోసం చాలా కష్టపడ్డారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తాను. – సింగరాజు వెంకట కౌండిన్య, జేఈఈ టాపర్ -
కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య
కోట: ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటలో చోటు చేసుకుంది. బిహార్ శివాన్ జిల్లాలోని హర్దోబరకు చెందిన జితేశ్ (17) గుప్తా ఐఐటీ–జేఈఈ ప్రవేశ పరీక్ష కోసం మూడేళ్లుగా ఇక్కడి ఇన్స్టిట్యూట్లో సన్నద్ధం అవుతున్నాడు. మంగళవారం హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మహావీర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఈశ్వర్ సింగ్ వెల్లడించారు. కాగా ఐదు రోజుల్లో ఇది మూడో ఆత్మహత్య కావడం గమనార్హం. ‘జితేశ్ తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేయగా అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు తన స్నేహితునికి ఫోన్ చేశారు. కిటికీలోంచి జితేశ్ ఫ్యాన్‌కు వేలాడి ఉండటం చూసిన అతని స్నేహితుడు అధికారులకు సమాచారం అందించాడు’అని తెలిపారు. అయితే పోలీసులు జితేశ్ ఆత్మహత్యకు గల కారణాలకు సంబంధించి ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్‌కు చెందిన దీక్షా సింగ్ (17) అనే నీట్ విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మరో ఐఐటీ అభ్యర్థి దీపక్ దదీచ్ (16) శనివారం మధ్యాహ్నం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో కోటలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య జితేశ్‌తో కలిపి 19 మందికి చేరింది. -
'చెల్లిని నచ్చిన కోర్సు చదవనివ్వండి'
'చెల్లిని నేనెప్పుడూ కూతురిలాగే ప్రేమించాను. చాలాబాగా చూసుకున్నాను. తననైనా తను నచ్చిన కోర్సును చదవనివ్వండి'.. ఇది కృతి త్రిపాఠి తన ఆత్మహత్య లేఖలో తల్లిదండ్రులకు చేసిన విజ్ఞప్తి. మంచి మార్కులతో ఐఐటీ-జేఈఈలో పాసైనప్పటికీ ఐదు అంతస్తుల భవనం మీద నుంచి దూకి కృతి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.తన ఆత్మహత్యకు ముందు కృతి ఎంతో భావోద్వేగంతో తల్లిదండ్రులను ఉద్దేశించి ఐదుపేజీల లేఖ రాసింది. తనకు బీఎస్సీ చదువాలని ఉందని, కానీ తన తల్లిదండ్రులు ఇంజినీరింగ్ చదువుమని బలవంతపెట్టారని ఆ లేఖలో తెలిపింది. తన తల్లిదండ్రుల అంచనాలు అందుకోలేక తనెంతగా మథనపడిందో ఆమె లేఖలో తెలిపింది. ప్రస్తుతం జూనియర్ ఇంటర్ చదువుతున్న తన చెల్లి భవిష్యత్తైనా బాగుండాలని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలా అర్ధంతరంగా తనువు చాలిస్తున్నందుకు క్షమాపణలు చెప్పింది. తన చెల్లి ఏది చదువుతానంటే అదే చదివించమని తల్లిదండ్రులను ఆమె కోరింది.తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తల్లికి విజ్ఞప్తి చేసింది. తల్లిదండ్రుల అంచనాలు నిలబెట్టలేకపోతున్నానని క్షమాపణలు కోరింది. రాజస్థాన్ లోని కోటా పట్టణంలో గురువారం కృతి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కోటా పట్టణం ఎస్పీ ఎస్ఎస్ గోదారా శనివారం ఆమె ఆత్మహత్య లేఖలోని వివరాలను మీడియాకు వెల్లడించారు. ఐఐటీ-జేఈఈ 2016 ఫలితాలలో కృతి త్రిపాఠికి 144 మార్కులు వచ్చాయని, కటాఫ్ మార్కుల కన్నా ఆమె 44 మార్కులు అధికంగా సాధించిందని ఆయన వెల్లడించారు. తమకు నచ్చిన కోర్సును చదువుకోవాలని కృతి మీద తల్లిదండ్రులు ఒత్తిడి తేవడం, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఇంజినీరింగ్ చేయించడానికి పూనుకోవడం, ఈ పరిస్థితుల నడుమ తల్లిదండ్రుల అంచనాలు అందుకోలేమన్న ఒత్తిడితో కృతి ప్రాణాలు తీసుకొని ఉంటుందని ఎస్పీ గోదార చెప్పారు. రాజస్థాన్ లోని కోటా కోచింగ్ సెంటర్లకు పేరుగాంచింది. ఈసారి ఐఐటీ ఫలితాల్లోనూ కోటా తన సత్తా చాటింది. అదే సమయంలో ఈ పట్టణం విద్యార్థుల ఆత్మహత్యలకు పేరుపడింది. కోచింగ్ సెంటర్లు, తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక ఈ ఏడాదే ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.