illegal trasfort
-
దాచేస్తే దాగేదా..!
గో మాఫియా రూటు మార్చింది. పోలీసులు పట్టుకుని గోశాలకు అప్పగించిన పశువులు మళ్లీ దారి మళ్లాయి. ఒక ప్రజాప్రతినిధి వద్ద పీఏగా వ్యవహరిస్తున్న వ్యక్తితోపాటు ఓ ఎంపీటీసీ సభ్యుడు రంగప్రవేశం చేసి వాటిని సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ ఘటనతో ఇప్పటివరకూ బ్రోకర్లతో మాట్లాడి పశువులను దారి మళ్లించి కబేళాలకు చేరేలా చూసే గో మాఫియా రూటు మార్చినట్టు, గోప్యంగా తమ పని కానిస్తున్నట్టు స్పష్టమవుతోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏజెన్సీలోని బుట్టాయగూడెం స్టేషన్ పరిధిలో ఈ నెల 11న అక్రమంగా రెండు డీసీఎం వ్యాన్లలో తెలంగాణకు రవాణా అవుతున్న 39 గేదెలను పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గేదెలను నల్లజర్ల సమీపంలోని ఆవపాడు గోశాలకు తరలించారు. అక్కడి నుంచి కథ మలుపు తిరిగింది. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలం ! : స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో వారి అనుచరగణం రంగ ప్రవేశం చేసినట్టు సమాచారం. ఆయన పీఏగా పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి, బుట్టాయగూడెం మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యుడు రంగంలోకి దిగి గోశాల నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి.. బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడేనికి చెందిన రైతుల పేరుతో ఆధార్ కార్డులు సమర్పించి వాటిని పెంచుకుంటామంటూ చెప్పి దారి మళ్లించినట్టు తెలుస్తోంది. 39 గేదెలు, దూడలను అప్పగించగా.. అందులో కేవలం ఆరు మాత్రమే గోశాలలో ప్రస్తుతం ఉన్నాయి. మిగిలిన వాటిని ప్రజాప్రతినిధి అనుచరులు తీసుకువెళ్లిపోయినట్టు సమాచారం. ఈ గేదెలన్నీ పాలిచ్చేవి కావడంతో వీటిపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఒట్టిపోయినట్టు చూపించి..! తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ పశువుల డాక్టర్లను గో మాఫియా మభ్యపెట్టి అవి ఒట్టిపోయిన గేదెలుగా నిర్ధారింపజేసి అందుకు అవసరమైన పత్రాలను సృష్టించి రవాణా చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత ఘటనలో పోలీసులు గోశాలకు తరలించిన గేదెలు ఎక్కడ ఉన్నాయన్నది తెలియరాలేదు. పాడిగేదెలు కావడంతో అమ్మేసుకు న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయాన్ని గోప్యంగా సర్దుబాటు చేసేందుకు మరో ఎమ్మెల్యేతో కలిసి యత్నాలు చేస్తున్నట్టు సమాచారం. రూటు మార్చిన పశు మాఫియా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లకు అక్రమంగా పశువులను తరలిస్తున్న వైనంపై ఇటీవల ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో పశు మాఫియాకు అండదండలు అందించిన ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సర్దుకునే యత్నంలో కొద్ది కాలం తాత్కాలికంగా రవాణాను నిలిపివేశారు. మళ్లీ రెండు నెలలుగా పశు మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ మార్గాల ద్వారా పశువులను కబేళాకు తరలిస్తోంది. గతంలో ఉత్తరాంధ్ర నుంచి రోడ్డు మార్గాన కొవ్వూరుకు వచ్చిన అక్రమ పశువుల రవాణా వాహనాలు దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా తెలంగాణలోకి ప్రవేశించేవి. ‘సాక్షి’ కథనాల తర్వాత మాఫియా రూటు మార్చింది. కొవ్వూరుకు చేరిన పశువుల వాహనాలను తాళ్లపూడి, దొండపూడి, కన్నాపురం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మీదుగా తెలంగాణకు తరలిస్తోంది. ఈ దారిలో తరలిస్తుండగానే పోలీసులు ఈ రెండు డీసీఎం వ్యాన్లను పట్టుకున్నారు. నోరుమెదపని పోలీసులు ఈ వ్యవహారంపై పోలీసులు నోరుమెదపడం లేదు. అక్రమంగా తరలిపోతున్న పశువులను పట్టుకుని గోశాలకు అప్పగించడం వరకే తమ బాధ్యత అని చెబుతున్నారు. అయితే గోశాలలపై పూర్తి దృష్టి పెట్టకపోతే అక్రమ పశురవాణాను అడ్డుకున్నా.. ఫలితం ఉండదని గుర్తించాలి. -
శివకాశి టు సూర్యాపేట
సూర్యాపేట : తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి టపాసులు అక్రమ రవాణా అవుతున్నాయి. జిల్లాలోని ఇతర పట్టణాలు, మండల కేంద్రం, గ్రామాలకు ఎలాంటి బిల్లులు లేకుండా భారీ ఎత్తున దిగుమతి చేస్తున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి సరుకును భారీగా సూర్యాపేటకు తెచ్చి అక్రమంగా నిల్వ ఉంచి.. గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు చేస్తున్నారు. సూర్యాపేటలో టపాసుల విక్రయాల దందా జోరుగా సాగుతోంది. దీని కోసం జిల్లాలోని టపాసులు విక్రయించే వ్యాపారులు ముందస్తుగానే సిండికేట్‌గా మారి టపాసుల ధరలను విపరీతంగా పెంచేశారు. పండుగకు ముందే వ్యాపారస్తులు భారీగా పటాసులను తెచ్చి ఇంట్లో నిల్వ ఉంచుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల విజిలెన్స్ అధికారులు పట్టణంలోని పలు షాపులపై దాడులు నిర్వహించారు. ఇందులో నాలుగు షాపుల్లో అక్రమ నిల్వలను గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలను చూపించకపోవడంతో సరుకును సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా మంగళవారం సూర్యాపేటమండల పరిధిలోని పిల్లలమర్రి స్టేజీ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన రూ.4లక్షల విలువ చేసే బాణాసంచాను రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారుల సిండికేట్.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 263 మంది పటాసుల విక్రయ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేటలో 28, కోదాడలో 11, హుజూర్‌నగర్‌లో 14షాపులు ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి. రూ.500 ఆన్లైన్ ద్వారా చెల్లించి లైసెన్స్ పొందిన వ్యాపారులు సిండికేట్‌గా మారి పటాసులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొందరు లైసెన్స్‌దారులు సబ్లీజులకిచ్చి షాపులను పెట్టిస్తున్నారు. అన్నీ షాపుల్లోనూ ఒకే ధర ఉండే విధంగా ప్రణాళిక రూపొందించారు. కాగా జిల్లాలో హోల్‌సేల్ డీలర్లు ఒక్కరూ కూడా లేరని అగ్నిమాపక అధికారులు చెప్తుండగా.. కొంతమంది తాము హోల్‌సేల్ డీలర్లమంటూ చిరు వ్యాపారులకు అధిక ధరలకు సరుకు విక్రయిస్తున్నారు. ధరలు ఇలా.. వ్యాపారులు సిండికేట్‌గా మారి టపాసుల ధరలను మూడింతలు పెంచేశారు. కాకర్ ప్యాకెట్ హోల్‌సేల్ ధర రూ.30 ఉండగా దీన్ని రూ.120కు, చిచ్చుబుడ్డి ఫ్లవర్పాస్ ప్యాకెట్ ధర రూ.40 ఉండగా రూ.130లకు విక్రయిస్తున్నారు. థౌజండ్‌వాలా, మిరపకాయ బాంబులు, వెన్నెల మడుగు, తారా జువ్వలు, లక్ష్మిబాంబు లాంటి వాటి ధరలను భారీగా పెంచి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇవికాక చైనా నిషేధిక సరుకును కూడా విక్రయిస్తున్నట్లు సమాచారం. వాటిని తక్కువ ధరకు తీసుకొచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నారు. వ్యాపారస్తులు వీటిని చాటుగా ఉంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఇందులో పొటాషియం క్లోరైడ్ వినియోగించడంతో వాటి పొగ వల్ల ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఆ దేశ దీపావళి మందులను ప్రభుత్వం నిషేధించింది. కొంతమంది అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ.. పటాసుల విక్రయాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి. నిషేధిత టపాసులు విక్రయిస్తే చర్యలు నిషేధిత టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవు. ఉమ్మడి జిల్లాలో షాపుల ఏర్పాటు కోసం ఆన్లైన్ ద్వారా 263 దరఖాస్తులు వచ్చాయి. లైసెన్స్ పొందిన వారు నాణ్యమైన, లేబుల్స్ ఉన్న టపాసులు అమ్మాలి. లైసెన్స్‌దారులు ఇతరులకు సబ్ లీజ్ ఇస్తే చర్యలు తీసుకుంటాం. వారి లైసెన్సు రద్దు చేస్తాం. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు. – యజ్ఞనారాయణ, డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
మహబూబ్‌నగర్ : అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గోపాలపేట మండలం బొడ్డారం గండి దగ్గర వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న మూడు ఆటోలను గుర్తించారు. వెంటనే తహశీల్దార్‌కు సమాచారం అందించడంతో రెవెన్యూ అధికారులు 99 బియ్యం బస్తాలతో కూడిన మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూలుకు చెందిన కొంతమంది వ్యాపారస్థులు అక్రమంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. (గోపాల్పేట)