సూర్యాపేట : తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి టపాసులు అక్రమ రవాణా అవుతున్నాయి. జిల్లాలోని ఇతర పట్టణాలు, మండల కేంద్రం, గ్రామాలకు ఎలాంటి బిల్లులు లేకుండా భారీ ఎత్తున దిగుమతి చేస్తున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి సరుకును భారీగా సూర్యాపేటకు తెచ్చి అక్రమంగా నిల్వ ఉంచి.. గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు చేస్తున్నారు.
సూర్యాపేటలో టపాసుల విక్రయాల దందా జోరుగా సాగుతోంది. దీని కోసం జిల్లాలోని టపాసులు విక్రయించే వ్యాపారులు ముందస్తుగానే సిండికేట్‌గా మారి టపాసుల ధరలను విపరీతంగా పెంచేశారు. పండుగకు ముందే వ్యాపారస్తులు భారీగా పటాసులను తెచ్చి ఇంట్లో నిల్వ ఉంచుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల విజిలెన్స్ అధికారులు పట్టణంలోని పలు షాపులపై దాడులు నిర్వహించారు. ఇందులో నాలుగు షాపుల్లో అక్రమ నిల్వలను గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలను చూపించకపోవడంతో సరుకును సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా మంగళవారం సూర్యాపేటమండల పరిధిలోని పిల్లలమర్రి స్టేజీ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన రూ.4లక్షల విలువ చేసే బాణాసంచాను రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వ్యాపారుల సిండికేట్..
ఉమ్మడి జిల్లాలో దాదాపు 263 మంది పటాసుల విక్రయ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేటలో 28, కోదాడలో 11, హుజూర్‌నగర్‌లో 14షాపులు ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి. రూ.500 ఆన్‌లైన్ ద్వారా చెల్లించి లైసెన్స్ పొందిన వ్యాపారులు సిండికేట్‌గా మారి పటాసులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొందరు లైసెన్స్‌దారులు సబ్‌లీజులకిచ్చి షాపులను పెట్టిస్తున్నారు. అన్నీ షాపుల్లోనూ ఒకే ధర ఉండే విధంగా ప్రణాళిక రూపొందించారు. కాగా జిల్లాలో హోల్‌సేల్ డీలర్లు ఒక్కరూ కూడా లేరని అగ్నిమాపక అధికారులు చెప్తుండగా.. కొంతమంది తాము హోల్‌సేల్ డీలర్లమంటూ చిరు వ్యాపారులకు అధిక ధరలకు సరుకు విక్రయిస్తున్నారు.
ధరలు ఇలా..
వ్యాపారులు సిండికేట్‌గా మారి టపాసుల ధరలను మూడింతలు పెంచేశారు. కాకర్ ప్యాకెట్ హోల్‌సేల్ ధర రూ.30 ఉండగా దీన్ని రూ.120కు, చిచ్చుబుడ్డి ఫ్లవర్‌పాస్ ప్యాకెట్ ధర రూ.40 ఉండగా రూ.130లకు విక్రయిస్తున్నారు. థౌజండ్‌వాలా, మిరపకాయ బాంబులు, వెన్నెల మడుగు, తారా జువ్వలు, లక్ష్మిబాంబు లాంటి వాటి ధరలను భారీగా పెంచి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇవికాక చైనా నిషేధిక సరుకును కూడా విక్రయిస్తున్నట్లు సమాచారం. వాటిని తక్కువ ధరకు తీసుకొచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నారు. వ్యాపారస్తులు వీటిని చాటుగా ఉంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఇందులో పొటాషియం క్లోరైడ్ వినియోగించడంతో వాటి పొగ వల్ల ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఆ దేశ దీపావళి మందులను ప్రభుత్వం నిషేధించింది. కొంతమంది అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ.. పటాసుల విక్రయాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి.
నిషేధిత టపాసులు విక్రయిస్తే చర్యలు
నిషేధిత టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవు. ఉమ్మడి జిల్లాలో షాపుల ఏర్పాటు కోసం ఆన్‌లైన్ ద్వారా 263 దరఖాస్తులు వచ్చాయి. లైసెన్స్ పొందిన వారు నాణ్యమైన, లేబుల్స్ ఉన్న టపాసులు అమ్మాలి. లైసెన్స్‌దారులు ఇతరులకు సబ్ లీజ్ ఇస్తే చర్యలు తీసుకుంటాం. వారి లైసెన్సు రద్దు చేస్తాం. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు.
– యజ్ఞనారాయణ, డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment