అక్రమ డిప్యుటేషన్లపై కలెక్టర్ ఆగ్రహం
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: డీఎంహెచ్ఓ కార్యాలయంలో అక్రమ డిప్యుటేషన్ల హవా శీర్షికన సాక్షి దినపత్రికలో వెలువడిన కథనానికి కలెక్టర్ స్మితా సబర్వాల్ స్పందించారు. మంగళవారం ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మను ఏజేసీ మూర్తి సమక్షంలో విచారణకు ఆదేశించారు. పీహెచ్సీలో పనిచేస్తున్న ఉద్యోగులు జిల్లా కార్యాలయంలో దర్శనమివ్వడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా పైరవీలేమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో కార్యాలయ పనుల నిమిత్తం మాత్రమే జిల్లా కేంద్రానికి వస్తున్నారని డీఎంహెచ్ఓ కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు.
కాగా డిప్యుటేషన్లపై కేవలం ఇద్దరు (వాచ్మెన్, ఇమ్యునైజేషన్ సిబ్బంది) మాత్రమే పనిచేస్తున్నారని డీఎంహెచ్ఓ తెలిపారు. కానీ వాస్తవంగా ఆమె పేర్కొంటున్న వివరాలకు పొంతన లేకుండా ఉంది. ఉద్యోగుల తరఫున వత్తాసు పలుకుతున్నట్టు స్పష్టమవుతోంది. అంతేగాక నిబంధనల మేరకే డిప్యుటేషన్లపై పనిచేస్తున్నారని చెప్పారు. కొత్తవారినెవరిని తీసుకోలేదన్నారు. రికార్డుల ప్రకారం పుల్కల్ పీహెచ్సీ నుంచి పెంటయ్య ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలో ఎల్డీ కంప్యూటర్‌గా, ఆంజనేయులు ఎంఎన్ఓగా జగదేవ్‌పూర్ పీహెచ్సీలో పనిచేయాల్సి ఉండగా ఎపడమిక్ సెల్లో ఆఫీస్ సబార్డినేట్‌గా, ప్రేమ్‌సాగర్ తూప్రాన్ పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేయాల్సి ఉండగా డీఎంహెచ్ఓ సీసీగా పనిచేస్తున్నారు. ఎంపీహెచ్‌ఓగా కొండాపూర్ పీహెచ్సీలో పనిచేయాల్సిన ఫయీం మలేరియా శాఖలో, తాజుద్దీన్ వెల్దుర్తి పీహెచ్సీలో ఎంపీహెచ్‌ఓగా పనిచేయాల్సి ఉండగా మలేరియా శాఖలో పనిచేస్తున్నారు.