illigal sand tranportation
-
లారీతో తొక్కించేశారు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ రాజాపూర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమ పొలాల మీదుగా ఇసుక వాహనాలు నడపొద్దన్న పాపానికి ఓ పేద రైతును ఇసుకాసురులు లారీ టైర్ల కింద తొక్కించి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన రాజాపూర్ మండలం తిర్మలాపూర్‌లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తిర్మలాపూర్‌కు చెందిన గుర్రంకాడి నర్సింలు(38)కు గ్రామశివారులో ఎకరం పొలం ఉంది. దాని పక్కనే దుందుభి వాగు ఉంది. ఇసుక మాఫియా అక్కడ ఇసుకను తీసి ఫిల్టర్ చేసి టిప్పర్లు, లారీల ద్వారా రైతుల పొలాల మీదుగా హైదరాబాద్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోజూ పది ట్రిప్పుల ఇసుక తరలుతోంది. ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు పడిపోయి సాగుకు నీరందని పరిస్థితి నెలకొనడంతో పరిసర పొలాల రైతులు గతంలో ఎన్నోమార్లు ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. అధికారులకు సైతం ఎన్నోమార్లు íఫిర్యాదు చేసినా అక్రమరవాణాకు అడ్డుకట్ట పడలేదు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తన పొలం మీదుగా వెళ్తున్న టిప్పర్‌ను నర్సింలు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇసుక అక్రమార్కులు అదే వాహనం టైర్ల కింద నర్సింలును తొక్కించేసి హత్య చేశారు. హత్యపై భగ్గుమన్న మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నర్సింలు చావుకు కారణమైనవారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ శ్రీధర్ పరిశీలించారు. హంతకులను చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రంగంలో అధికార పార్టీ నాయకుడు? నర్సింలు హత్యపై కోపోద్రిక్తులైన గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది. సంఘటనాస్థలానికి చేరుకున్న సదరు నాయకుడు మృతుడి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కేసు కాకుండా చూసేందుకు యత్నిస్తున్నాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మూడేళ్లుగా వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయని మండిపడిన గ్రామస్తులు ఇసుక రవాణా వద్దని వారించిన తమపై మాఫియా అనేకసార్లు దౌర్జన్యం చేసిందని భగ్గుమన్నారు. అదే గ్రామానికి చెందిన తో నేత అండదండలు ఇసుక మాఫియాకు పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఇసుక లారీ యజమానులు మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు ఉన్నతాధికారుల అండదండలతోనే ఇసుక మాఫియా బరితెగిస్తోందనే ఆరోపణలున్నాయి. -
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వీఆర్వో
-
తెలుగు తమ్ముళ్ల ధన దాహం.. చిన్నారుల బలి
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తెలుగు తమ్ముళ్ల ధన దాహానికి అభంశుభం తెలియని చిన్నారులు బలయ్యారు. తెలుగు తమ్ముళ్ల అక్రమ ఇసుక రవాణా నలుగురు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలోని గాలివీడు మండలంలోని తలముడిపిలో జరిగింది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు తలముడిపి చెరువులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. విచ్చలవిడిగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. శుక్రవారం ఇసుక తవ్వకాలు జరపటానికి వచ్చిన కూలీలతో పాటు కొందరు చిన్నారులు వారి వెంట చెరువు వద్దకు చేరుకున్నారు. వారు ఇసుకలో ఆడుకుంటుండగా మట్టిపెళ్లలు పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. అంత వరకు ఆడిపాడిన చిన్నారులు విగతజీవులుగా మారటంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
హరీశ్ పై చర్యలు లేవు.. రాజయ్య పై చర్యలా?
హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని.. అందుకు బాధ్యులైన గనుల శాఖ మంత్రి హరీష్‌రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి విమర్శించారు. హరీష్ రావు సీఎంకు అల్లుడు కావడంతో ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని.. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య అమాయకుడు కావడం వల్లనే వేటు పడిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. మన రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నారా.. రాజరికంలో ఉన్నారా అర్థం కావట్లేదన్నారు. సచివాలయానికి వాస్తు దోషం పట్టుకుందని ఎర్రగడ్డకు మారుస్తున్నాడని, కానీ కేసీఆర్ ఒక్కడే ఎర్రగడ్డకు మారితే బాగుంటుందన్నారు. నగరంలోని వివిధ శాఖల కార్యాలయాలన్నీ ఎర్రగడ్డకు మార్చడం వల్లన ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని అన్నారు. విద్యార్థులకు బోధన రుసుం ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు నిర్వీర్యం కావడం వల్లనే ప్రయివేటు వైపు ఆకర్షితులవుతున్నారని, దీన్ని ప్రభుత్వం సరిచేయాలన్నారు. విద్యా, వైద్యం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే నేరవేర్చాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఆశలు కల్పించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేసి ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు.