హరీశ్ పై చర్యలు లేవు.. రాజయ్య పై చర్యలా?
హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని.. అందుకు బాధ్యులైన గనుల శాఖ మంత్రి హరీష్‌రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి విమర్శించారు. హరీష్ రావు సీఎంకు అల్లుడు కావడంతో ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని.. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య అమాయకుడు కావడం వల్లనే వేటు పడిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. మన రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నారా.. రాజరికంలో ఉన్నారా అర్థం కావట్లేదన్నారు. సచివాలయానికి వాస్తు దోషం పట్టుకుందని ఎర్రగడ్డకు మారుస్తున్నాడని, కానీ కేసీఆర్ ఒక్కడే ఎర్రగడ్డకు మారితే బాగుంటుందన్నారు.
నగరంలోని వివిధ శాఖల కార్యాలయాలన్నీ ఎర్రగడ్డకు మార్చడం వల్లన ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని అన్నారు. విద్యార్థులకు బోధన రుసుం ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు నిర్వీర్యం కావడం వల్లనే ప్రయివేటు వైపు ఆకర్షితులవుతున్నారని, దీన్ని ప్రభుత్వం సరిచేయాలన్నారు. విద్యా, వైద్యం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే నేరవేర్చాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఆశలు కల్పించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేసి ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు.