ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు!
రాజుల కాలంలో అంతఃపురం ఎలా ఉండేది అంటే.. ఇలా ఉంటుందేమో అని సినిమాలు చూపించాయి. మరి.. స్వర్గలోకం ఎలా ఉంటుంది? అంటే.. ఈ లోకాన్ని కూడా ఊహించి, సినిమాల్లో చూపించారు. ఇప్పుడు కొన్ని సినిమాలు కొత్త ప్రపంచాలను చూపించనున్నాయి. ఊహాజనిత కథలతో సాగే ఈ చిత్రాల కోసం భారీ సెట్స్‌తో కొత్త లోకాలను సృష్టిస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.
స్వర్గం నేపథ్యంలో...
ముప్పై ఏళ్ల క్రితం చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలోని ఈ చిత్రంలో కొన్ని సీన్లు స్వర్గం నేపథ్యంలో ఉంటాయి. తాజాగా చిరంజీవి నటించనున్న ఓ సినిమా మళ్లీ ప్రేక్షకులను స్వర్గలోకంలోకి తీసుకెళ్లనుందని టాక్. గత ఏడాది కల్యాణ్ రామ్‌తో ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘బింబిసార’ తీసిన వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రం రూపొందనుందని టాక్. ‘బింబిసార’ తరహాలోనే ఫ్యాంటసీ జానర్లో ఉండే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఊహాజనిత స్వర్గం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందట.
సాహసాల ధీర
‘ధీర’గా ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్లనున్నారట అఖిల్. ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్‌లో ఒకరైన అనిల్‌కుమార్ ఇటీవల అఖిల్‌కు ఓ కథ చెప్పారు. ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాకు ‘ధీర’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందని సమాచారం.
నాలుగు పేజీల భైరవకోన
ప్రేక్షకులను ‘భైరవకోన’కు తీసుకెళ్తామంటున్నారు సందీప్ కిషన్. ‘టైగర్’ (2015) చిత్రం తర్వాత హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. ‘శ్రీకృష్ణదేవరాయల కాలంలోని గరుడ పురాణానికి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి’, ‘గరుడ పురాణంలో మాయమైపోయిన ఈ నాలుగు పేజీలే భైరవకోన’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌లో వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర, రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ ప్రకటన రానుంది.
అంజనాద్రి వీరుడు
‘హను–మాన్’ చిత్రం కోసం ‘అంజనాద్రి’ అనే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమంతుని శక్తులు పొందిన ఓ యువకుడు ‘అంజనాద్రి’ రక్షణ కోసం ఎలాంటి పోరాటాలు, సాహసాలు చేశాడు అనే అంశాలతో ‘హను–మాన్’ సినిమా ఉంటుంది. తేజా సజ్జా, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే ‘అధీర’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో కూడా కాస్త ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. కె. నిరంజన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి.