స్కూలు నుంచి ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
ఇబ్రహీంపట్నం(కృష్ణా): స్కూలుకు సరిగా రావటం లేదని ఉపాధ్యాయులు మందలించినందుకు మనస్తాపం చెందిన విద్యార్థులు కనిపించకుండా పోయారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన గంటిపూడి గోపి, వెలగనేరు గ్రామానికి చెందిన ఇమాం సాహెబ్ కొండపల్లి బీసీ బాలుర హాస్టల్లో ఉంటూ జడ్పీహెచ్ఎస్ స్కూలులో పదో తరగతి చదువుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వారు సరిగ్గా తరగతులు హాజరుకావటం లేదు. దీనిపై సోమవారం ఉపాధ్యాయులు వారిద్దరినీ పిలిచి మందలించారు.
తల్లిదండ్రులను తీసుకురావాలని చెప్పి ఉదయం 11 గంటల సమయంలో వారిని ఇళ్లకు పంపించారు. అయితే, వారు స్వగ్రామానికి వెళ్లలేదు. మరో స్నేహితుడు, 8వ తరగతి చదివే ప్రత్తిపాటి నోవాహును తీసుకుని ఎటో వెళ్లిపోయారు. అయితే, ఉపాధ్యాయులు... మంగళవారం తల్లిదండ్రులకు సమాచారం అందించగా విద్యార్థులు కనిపించకుండా పోయిన విషయం తేలింది. దీనిపై తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ చవాన్, ఎంఈవో ఉదయ్‌కుమార్ పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు.