ఒకే ఒక్కడు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై కనీస పర్యవేక్షణ కరువవుతోంది. మౌలిక సౌకర్యాలు లేకపోవడం, బోధన సక్రమంగా జరగకపోవడం వంటి కారణాలకు తోడు అసలు వాటిని పర్యవేక్షించే అధికారులే లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో కేవలం ఒక్క మండలానికి మాత్రమే పూర్తిస్థాయి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) ఉన్నారంటే పరిస్థితి ఏమిటో అవగతం చేసుకోవచ్చు. జిల్లాలో 46 మండలాలు ఉండగా, ఉంగుటూరు మినహా 45 మండలాల్లో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులే ఇన్చార్జి ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు.
మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఎంఈవో పర్యవేక్షించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి ఎంఈవోలు లేకపోవడంతో వాటిపై అజమాయిషీ లేకుండాపోతోంది. రెగ్యులర్ ఎంఈవోలు లేకపోవడంతో హైస్కూళ్లలో పనిచేస్తున్న సీని యర్ ప్రధానోపాధ్యాయులకుఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారు అటు పాఠశాలలకు న్యాయం చేయలేక.. ఇటు మండలంలోని అన్ని స్కూళ్ల వ్యవహారాలను చూడలేక సతమతమవుతున్నారు. ఉదాహరణకు లింగపాలెం మండలంలోని హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిని ఏలూరు మండలం ఎంఈవోగా నియమించారు.
ఆయన రెండు బాధ్యతలను నిర్వహించడం కష్టతరమవుతోంది. కొన్నిచోట్ల అయితే స్కూల్ అసిస్టెంట్లే ఎంఈవోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక విద్యాబోధన జరగటం లేదు. జిల్లాలో 458 హైస్కూళ్లు ఉన్నాయి. వాటిలో పనిచేస్తున్న 40 మందికి పైగా ప్రధానోపాధ్యాయులు ఇన్చార్జి ఎంఈవోలుగా పనిచేస్తున్నారు. వారంతా ఆయా స్కూళ్లను పట్టించుకునే పరిస్థితి లేకుండాపోరుుంది. మరో 30 స్కూళ్లకు రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు లేకపోవడంతో అక్కడి సబ్జెక్టు టీచర్లే ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు.
రెగ్యులర్ డీవైఈవో ఒక్కరూ లేరు
జిల్లాలో ఆరుగురు ఉప విద్యాశాఖాధికారుల (డీవైఈవోలు) అవసరం ఉంది. ఏలూరు, కొయ్యలగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరంలలో డీవైఈవోలు ఉండాలి. వీరితోపాటు జిల్లా పరిషత్ స్కూళ్లకు సంబంధించి మరొక డీవైఈవో అవసరం. కానీ.. ఎక్కడా పూర్తిస్థాయి డీవైఈవో లేకపోవడం గమనార్హం. ఆరుచోట్లా ఇన్చార్జిలే పనిచేస్తున్నారు. ఇక్కడా హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరు కూడా అటు స్కూళ్లలోనూ, డివిజన్లలోనూ ఇబ్బందికర పరిస్థితి నెలకొంటోంది.
పదోన్నతులు లేకే...
ప్రధానోపాధ్యాయులకు చాలాకాలం నుంచి పదోన్నతులు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలకు సంబంధించిన వ్యవహారంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండటంతో కొన్నేళ్లుగా పదోన్నతులు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఈ విషయూన్ని పెద్దగా పట్టించుకోకపోవడం, ప్రత్యామ్నాయం ఆలోచించకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయుల్లో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై చాలాకాలం నుంచి వివాదం నడుస్తోంది.
ఎక్కువ పాఠశాలలు, సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న తమకే ప్రాధాన్యత ఇవ్వాలని జెడ్పీ ప్రధానోపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. నేరుగా ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు కాకుండా జెడ్పీ యాజమాన్యంలో పనిచేస్తున్న వారికి ఎలా ప్రాధాన్యత ఇస్తారని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం కోర్టులో ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు నిలిచిపోయాయి. ఫలితంగా ఇన్చార్జి ఎంఈవో, డీవైఈవోలే పాఠశాలలకు దిక్కవుతున్నారు.