చందంపేట మండలంలో కొందరు ఉపాధ్యాయుల తీరులో ఇంకా మార్పు రావడంలేదు.
దేవరకొండ, న్యూస్‌లైన్ : చందంపేట మండలంలో కొందరు ఉపాధ్యాయుల తీరులో ఇంకా మార్పు రావడంలేదు. ఈ మండలంలో విద్యావ్యవస్థ తీరుపై ‘టీచర్లా.. చీటర్లా..?’ అనే శీర్షికన సాక్షిలో బుధవారం కథనం ప్రచురితమైనా పంతుళ్లు పాఠశాలలకు వెళ్లలేదు. దీంతో చాలావరకు పాఠశాలలు తెరుచుకోనేలేదు. అయితే, ‘సాక్షి’ కథనానికి స్పందించిన ఇన్‌చార్జి ఎంఈఓ పలు పాఠశాలలను తనిఖీ చేశారు. ఆయన పర్యటనలో కూడా.. బడికి ఎగనామం పెట్టిన ఉపాధ్యాయుల తీరు బయటపడింది. ‘సాక్షి’ కూడా రెండు పాఠశాలలను సందర్శించింది.
కొన్నిచోట్ల తెరుచుకున్న పాఠశాలలు
గత కొన్ని రోజులుగా విధులకు డుమ్మాకొట్టిన ఉపాధ్యాయులు బుధవారం హాజరయ్యారు. దీంతో మండలంలోని కలకొండతండా, కేతేపల్లి, మేఘావత్‌తండా, పందిరి గుండు తండా, ఇంద్రావత్ తండాలలోని ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నాయి.