యోగా సంగతి సరే, ప్రాచీన కళల మాటేమిటి?
సందర్భం
కేంద్ర బడ్జెట్లో తొలిసారి యోగా ప్రస్తావన వచ్చింది. యోగా ప్రచార కార్యక్రమాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బల్లను చరుస్తూ ఆనందం వ్యక్తం చేయటం లోకమంతా చూసింది. మోదీ గెలవటానికీ, అధికారంలోకి రావటా నికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా యోగా గురు వులు, యోగా ప్రచార సంస్థలు పనిచేశాయన్నది నిజం. ఆ కృతజ్ఞతతో ఈ పన్ను మినహాయింపు ప్రతిపాదన చేశారన్నది కూడా నిజమే.
ఐక్యరాజ్య సమితి జూన్ 21ని ‘ప్రపంచ యోగాదినం’గా గుర్తించిం ది. ఐరాసలో భారతదేశం తరఫున పనిచేస్తున్న అధికారుల కృషివల్లే ఇది సాధ్యమైంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేయగల నెట్ వర్క్ యోగా సంస్థలకు, వాటి అధిపతులకు ఉందన్నమాట.. ‘ప్రపంచానికి మనదేశం అందించిన కానుక యోగా’ అని అరుణ్ జైట్లీ సంబరపడ్డారు. ఇలా యోగాను ఆకాశానికెత్తడంలోని ఆంతర్యమే మిటి? యోగాను నేర్పిస్తామనే పేరుతో పేరు మోసిన గురువులు, స్వామీజీలు, మాతాజీలు పెద్ద పెద్ద పీఠాలను, మఠాలను తయారు చేశారు. యోగాను హిందూమత ప్రచారానికి వాడుకుంటున్నారు. యోగా, ధ్యానం పేరుతో ఆధ్యాత్మిక సంస్థలు నడుపుతూ వేల కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. అలాగే, ఇదే యోగా గురువులు ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపా యల వ్యాపారం చేస్తున్నారు. మొత్తంగా యోగా, ధ్యానం, ఆయుర్వే దం వ్యాపార సరుకులైపోయాయి. ఇది అత్యంత బాధాకరం.
ప్రభుత్వాలను శాసించే స్థాయిలో యోగా గురువులు తయారయ్యారు. ఆ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు చేత యోగా గురువు జగ్గీ వాసుదేవ్ డ్యాన్స్ చేయించాడు. జగ్గీవాసుదేవ్ వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఆధ్యాత్మికత పేరుతో నిర్మించుకున్నాడు. ఒక రాష్ట్రానికి సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి వివేకవంతుడిగా, బహిరంగ కార్యక్రమాల్లో గౌరవంగా, హుందాగా ప్రవర్తించాలి. కానీ ఒక యోగా గురువు చెప్పా డని డ్యాన్స్ చేయటం సిగ్గుచేటు. అంతేకాదు, జగ్గీవాసుదేవ్ సంస్థకు అక్షరాల రెండుకోట్లను విరాళంగా చంద్రబాబు ఇచ్చారు. అది ఆయన వ్యక్తిగతమైన సొమ్ముకాదు. కోట్లాది మంది ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చిన ప్రభుత్వ ఆదాయాన్ని ఒక గురువుకు ధారాదత్తం చేయటం, ఆయన కాళ్లకు నమస్కరించటం ప్రజలను అవమానించటమే.
అసలు ఇంత మంది బాబాలు, స్వామీజీలు, మాతాజీలు, గురు వులు బ్రహ్మచారులమని చెప్పుకుంటున్నారు. బ్రహ్మచర్య సన్యాస జీవి తం గడిపేవాళ్లకు ఇన్ని వందల, వేల కోట్ల ఆస్తులు, ధనం ఎందుకని ఒక్కరూ ప్రశ్నించరేమీ? అరిషడ్ వర్గాలను జయించిన వారే సన్యాస జీవితానికి అర్హులు. కానీ, అన్ని సుఖాలు, భోగాలు అనుభవిస్తూ, ఇంత ధన వ్యామోహంతో జీవించే వారిని బాబాలు, స్వామీజీలు, మాతా జీలు, యోగులు అని పిలవటమేంటి? కనీస నైతిక విలువలు, ఆధ్యా త్మిక విలువలూ లేని వ్యక్తుల కాళ్లకు దండం పెట్టడమేంటి?
యోగాను ఒక మత సంస్కృతిగా వ్యాప్తిచేయటం దారుణమైన విషయం. అసలు యోగాను మించిన ఎన్నో అద్భుతమైన విద్యలను మన పూర్వీకులు తయారు చేశారు. మన దేశంలో వేలాది మంది మార్షల్ ఆర్టిస్టులున్నారు. వాళ్లు యోగా గురువులకన్నా ఎక్కువ ఆరో గ్యంగా, శారీరక దృఢత్వంతో, మానసిక ఆరోగ్యంతో ఉన్నారు. మన పూర్వీకులు మనకు బహూకరించిన ఆ విద్యలను నేను గత నలభై ఏళ్లుగా బోధిస్తూ ఉన్నాను. నాలాగా జీవితాన్ని మార్షల్ ఆర్ట్స్‌కు అంకి తం చేసిన ఎంతోమంది, పాలకుల విధానాలతో కలత చెందుతున్నారు.
యోగా విద్యను మించిన పురాతన కళలను నాశనం చేయటం వల్ల ఈ దేశానికి నష్టం వాటిల్లుతుంది. హిందూమతంతో ముడిపెట్టి యోగా ను బతికిస్తున్నారు తప్ప దానిలోని శక్తివల్లకాదు. యోగాను రాజకీ యాల కోసం ఉపయోగించుకుంటే, ప్రజలు ఆ యోగా రాజకీయాలను తప్పకుండా తిప్పికొడతారు. మన ప్రాచీన విద్యలను పరిరక్షించుకోవ డానికి వివేకవంతులు పూనుకొనే సమయం ఆసన్నమైంది.
వ్యాసకర్త జీవవేద విజ్ఞాన రుషిపీఠం, విజయవాడ-హైదరాబాద్, మొబైల్: 9959282226
ఆచార్య గల్లా ప్రకాశ్‌రావు