బహుమతి పుచ్చుకుంటున్నారా..?
పెళ్లి, నామకరణం.. వేడుక ఏదైనా బోలెడన్ని బహుమానాలు వచ్చి పడుతుంటాయి. ఉద్యోగుల పనితీరుకు మెచ్చి యాజమాన్యాలు సైతం పలు రూపాల్లో ఉచిత కానుకలు అందిస్తుంటాయి. నగదు రూపంలో లేదా వస్తు రూపంలో లేదా పర్యటనల రూపంలో ఈ ప్రయోజనాలు ఉండొచ్చు. ఇలాంటి బహుమతులన్నీ ఆదాయపన్ను పరిధిలోకి వస్తాయన్నది వాస్తవం. ఈ విషయంలో చట్టంలో పలు మినహాయింపులు కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే వచ్చిన కానుకలను చట్టబద్దం చేసుకోవచ్చు. ఇవి తెలియకపోతే ఆదాయపన్ను విభాగం నుంచి తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే కథనం ఇది. బహుమానం ఎవరి నుంచి వచ్చిందన్న దానితో సంబంధం లేదు. దాని విలువ రూ.50,000కు మించకుండా ఉంటే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ ఈ బహుమానం స్నేహితులు, లేదా ఇతరుల నుంచి అందుకుంటే, దాని విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ మొత్తంపై తప్పకుండా పన్ను చెల్లించాలి. ఒకవేళ ఈ బహుమానం విలువ రూ.50,000కు మించి ఉన్నా సరే.. దాన్ని సమీప బంధువుల నుంచి అందుకుంటే ఎలాంటి పన్ను వర్తించదని ఆదాయపన్ను చట్టం చెబుతోంది. రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ఒక ఆర్థిక సంవత్సరానికే పరిమితం. అంటే ఒకే సారి కాకుండా, ఏటా రూ.50,000 విలువకు మించకుండా బంధువులు కాని వారి నుంచి బహుమతి స్వీకరించడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ప్రత్యేక మినహాయింపులు పెళ్లి సందర్భంగా బంధు మిత్రుల నుంచి వివిధ రూపాల్లో కానుకలు వస్తుంటాయి. విలువతో సంబంధం లేకుండా ఇలాంటివన్నీ కూడా పన్ను మినహాయింపు కిందకే వస్తాయి. బంగారం, వ్రస్తాలు, ప్రాపర్టిలు, షేర్లు, బాండ్లు.. ఇలా బహుమతి ఏదైనా, ఎంత విలువ అయినా పెళ్లి సమయంలో అందుకుంటే పన్ను పడదు. వీలునామా ద్వారా సంక్రమించిన కానుకలు (ఆస్తులు/మరేవైనా) లేదా వారసత్వంగా సంక్రమించిన ఆస్తులపైనా లేదా ఒకరి మరణంతో దానంగా సంక్రమించే వాటికి కూడా బహుమతి పన్ను మినహాయింపు ప్రయోజనం వర్తిస్తుంది. గిఫ్ట్ ట్యాక్స్‌ను మొట్టమొదటగా 1958 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. దీన్ని 1998లో రద్దు చేశారు. అనంతరం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 56(2) కింద బహుమతి పన్నును ప్రవేశపెట్టారు. విలువతో కూడిన ఏ బహుమానం అయినా, అది ఏ రూపంలో ఉన్నా ఈ సెక్షన్ కింద పన్ను పరిధిలోకి వస్తుంది. బహుమతి స్వీకరించిన వారికే పన్ను బాధ్యత. ఇచ్చిన వారిపై ఉండదు. తప్పకుండా వెల్లడించాల్సిందే.. సమీప బంధువులు, బంధువులు కాని వారి నుంచి బహమతులు అందుకున్నా కానీ, ఈ వివరాలను ఆదాయపన్ను రిటర్నుల్లో వెల్లడించాల్సిందే. ‘ఎగ్జెంప్ట్ ఇన్కమ్’ షెడ్యూల్ కింద వివరాలు తెలియజేయాలి. ఉచిత బహుమతులే అయినప్పటికీ, వీటిని భవిష్యత్తులో విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను బాధ్యత ఎదురవుతుంది. కనుక బహుమతుల స్వీకరణను ఐటీఆర్‌లో తప్పకుండా వెల్లడించడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాదు గిఫ్ట్ స్వీకరణకు సంబంధించి ఆధారాలను సైతం జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి. భవిష్యత్తులో ఆదాయపన్ను శాఖ అధికారులు వివరాలు కోరితే ఇవ్వడానికి ఉంటుంది. విలువైన, ఖరీదైన బహమతుల విషయంలో స్టాంప్ పేపర్‌పై గిఫ్ట్ డీడ్ రాసుకోవాలన్నది నిపుణుల సూచన. ఆదాయపన్ను శాఖ అదికారుల నుంచి పిలుపు వస్తే నిరూపించుకునేందుకు ఆధారంగా పనికొస్తుంది. ‘‘పన్ను పరిధిలోకి రాని బహుమతుల వివరాలు వెల్లడించేందుకు ప్రస్తుత ఐటీఆర్ షెడ్యూల్స్‌లో నిబంధనల్లేవు. అయినా కానీ, రక్షణాత్మక ధోరణితో వాటిని ‘షెడ్యూల్ ఎగ్జెంప్ట్ ఇన్కమ్’ కింద వెల్లడించడం సూచనీయం’’అని ఇండస్ లా పార్ట్నర్ శృతి కె.పి సూచించారు. అన్ని ఐటీఆర్ పత్రాల్లోనూ షెడ్యూల్ ఈఐ ఉంటుంది. కనుక ఆదాయ వనరుల ఆధారంగా ఐటీఆర్‌ను ఎంపిక చేసుకుని, అందులో బహమతుల వివరాలు వెల్లడించాలి. తల్లిదండ్రుల నుంచి బహుమతి తీసుకున్నప్పుడు, వారి ఆదాయ వనరుల గురించి ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. సమీప బంధువులు ఎవరు? చట్టంలో ‘రిలేటివ్’ (బంధువు)కు వివరణ ఉంది. భార్య లేదా భర్త; తల్లి దండ్రులు; అమ్మ వైపు అమ్మమ్మ, తాతయ్య; నాన్న వైపు నాయనమ్మ, తాతయ్య; భార్య లేదా భర్త వైపు సహోదరులు; తల్లి, తండ్రి తోడబుట్టిన వారు.. వీరంతా బంధువు కిందకే వస్తారు. సెక్షన్ 56 ప్రకారం మరింత వివరంగా చెప్పుకోవాలంటే..? భార్యకు భర్త, భర్తకు భార్య బంధువే. వీరిలో ఒకరి సోదరులు, సోదరీమణులు మరొకరికి బంధువే అవుతారు. సోదరుడు, సోదరుడి భార్య, అలాగే సోదరి, సోదరి భర్తను కూడా చుట్టంగానే చట్టం పరిగణిస్తోంది. తండ్రి లేదా తల్లి తోడబుట్టిన వారు, వారి జీవిత భాగస్వాములు సైతం (అత్త, మామ, బాబాయి, పిన్ని) బంధువులే అవుతారు. అలాగే భార్య తన భర్త తండ్రి (మామ), తల్లి (అత్త) నుంచి, ఆ అత్తా మామల తల్లిదండ్రుల నుంచి తీసుకునే కానుకలు.. ఇదే మాదిరి భర్త తన భార్య తల్లిదండ్రులు (అత్త, మామ), ఈ అత్తా మామల తల్లిదండ్రుల నుంచి పొందే కానుకల విలువ ఎంత ఉన్నా చట్టం పరిధిలో పన్ను చెల్లించక్కర్లేదు. కానుకలు అన్నీ ఒక్కటేనా? ఉచితంగా ఇచ్చేవి ఏవైనా సరే కానుకల కిందకే వస్తాయి. వాస్తవ విలువలో కొంత మొత్తాన్ని తీసుకుని ఇచ్చినా చట్ట పరిధిలో బహుమతి అవుతుంది. బంగారం కావచ్చు. లేదా భూమి, ఫ్లాట్, ఆభరణాలు, కళాకృతులు (స్థిర, చరాస్తులు), గృహోపకరణాలు, ఇతర వస్తువులు ఏవైనా సరే చట్టం పరిధిలో బహుమతే అవుతుంది. నగదు రూపంలో వచ్చే బహుమానం విషయంలో, విలువ ఎంతన్న దానిపై గందరగోళం ఉండదు. కానీ, బంగారం లేదా షేర్లు, లేదా భూములు తదితర కానుకల విలువ నిర్ణయించే విషయంలో నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. అంటే వీటికి చట్టపరిధిలో విలువను ఖరారు చేయాలి. లిస్టెడ్ కంపెనీల షేర్లు అయితే బహుమతి ఇచ్చే నాటికి ఉన్న ధరను పరిగణనలోకి తీసుకుంటారు. భూమి, ఫ్లాట్, ప్లాట్ తదితర స్థిరాస్తిని రూపాయి కూడా తీసుకోకుండా బహుమతి కింద ఇస్తే.. ఆ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ స్థిరాస్తిని (భూమి/భవనం) ఉచితంగా కాకుండా, మార్కెట్ విలువ కంటే తక్కువకు బహుమతి కింద ఇచ్చారని అనుకుందాం. అటువంటప్పుడు స్వీకర్త చెల్లించిన మొత్తం, స్టాంప్ డ్యూటీ విలువ నుంచి తీసివేసిన తర్వాత, దాని విలువ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మొత్తం స్టాంప్ డ్యూటీలో 10 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తికి రూ.10 లక్షల ప్రాపర్టీని రూ. 5లక్షలు తీసుకుని బహుమతి కింద ఇచ్చారని అనుకుందాం. ఆ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.8 లక్షలు ఉంది. ఈ కేసులో మార్కెట్ విలువ రూ.8 లక్షల నుంచి, స్వీకర్త చెల్లించిన రూ.5 లక్షలు మినహాయించగా, మిగిలిన రూ.3లక్షలు.. రూ.50,000 పరిమితిని దాటింది. కనుక ఈ కేసులో స్టాంప్ ట్యూటీ విలువ రూ.8 లక్షల్లో 10 శాతం అంటే.. రూ.80,000పై పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక ఆభరణాలు, పెయింటింగ్‌లు, శిల్పాలు తదితర చరాస్తులను బహమతిగా పొందినప్పుడు, వాటి ఫెయిర్ మార్కెట్ ప్రైస్ (సహేతుక మార్కెట్ ధర) రూ.50,000 మించితే, ఆ మొత్తంపై పన్ను చెల్లించాలి. ఒకవేళ సహేతుక మార్కెట్ ధర కంటే తక్కువ మొత్తానికి కానుకగా పొందారనుకుంటే.. అప్పుడు సహేతుక మార్కెట్ ధర నుంచి, చెల్లించిన ధర తీసివేయగా మిగిలిన వ్యత్యాసంపై పన్ను చెల్లించాలి. స్థిరాస్తిని రూపాయి కూడా చెల్లించకుండా ఉచిత బహమతిగా పొందితే, విడిగా ప్రతి లావాదేవీకి రూ.50,000 పరిమితి వర్తిస్తుందని ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఎఫ్ఏక్యూ స్పష్టం చేస్తుంది. దీని ఆధారంగా ఎక్స్ అనే వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు స్థిరాస్తులను బహమతిగా స్వీకరించాడని అనుకుందాం. విడిగా ప్రతి ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.50,000 మించి లేదు. ఇలాంటప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఏర్పడదు. హెచ్‌యూఎఫ్‌లకు కూడా ఇదే వర్తిస్తుంది. గిఫ్ట్ ద్వారా ఆదాయం..→ నామకరణం, ఇతర సందర్భాల్లో పిల్లల పేరిట కూడా బహమతులు సంక్రమిస్తుంటాయి. అ లాంటి బహుమతులపై వచ్చే ఆదాయం వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. → కొంత మంది పన్ను భారం తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతో.. ప్రాపర్టిపై తమకు వస్తున్న అద్దె ఆదాయాన్ని తమ పిల్లలు లేదా మనవళ్లు/మనవరాళ్లకు (బంధువులు) ఏ నెలకానెల బహుమతి కింద ఇచ్చేస్తుంటారు. చట్టం దీన్ని బహుమతిగానే పరిగణిస్తుంది. కానీ, దీనికంటే ముందు బహుమతిగా ఇస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయానికి అద్దె ఆదాయం కలుస్తుందని మర్చిపోవద్దు. అంటే చట్ట ప్రకారం సంబంధిత అద్దె ఆదాయాన్ని తమ వార్షిక రిటర్నుల్లో చూపించి, పన్ను పరిధిలోకి వస్తే పన్ను చెల్లించాల్సిందే. → తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి అందులో నగదు డిపాజిట్ చేస్తుంటారు. తల్లిదండ్రులు తమ ఆదాయంపై పన్ను చెల్లిస్తారు. కానీ, ఇలా మైనర్ పేరిట చేసిన డిపాజిట్‌పై వచ్చే ఆదాయం సంబంధిత తల్లితండ్రి లేదా సంరక్షకుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డిపాజిట్‌ను బహమతిగా చూపించినప్పటికీ.. చిన్నారులు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటారు. వారికి ఏ విధమైన ఆదాయం ఉండదు. కనుక ఆ బహమ తులపై ఆదాయం వారి తల్లిదండ్రుల ఆదాయానికే కలుస్తుంది. → ఒకవేళ ప్రత్యేక నైపుణ్యాలు, మరేదైనా స్టార్టప్ రూపంలో చిన్నారులు సంపాదిస్తుంటే వారి వ్యక్తిగత ఆదాయమే అవుతుంది. అలాంటి కేసుల్లో చిన్నారుల తరఫున తల్లిదండ్రులు రిటర్నులు వేసి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆదాయానికి కలిసే విషయంలో.. దంపతులు ఇద్దరూ సంపాదనా పరులైతే వారి లో ఎక్కువ ఆర్జించే వారికి ఇది కలుస్తుంది. → ఉదాహరణకు షేర్లను పిల్లలకు గిఫ్ట్‌గా ఇస్తే, వాటిపై వచ్చే డివిడెండ్ తల్లిదండ్రుల ఆదాయానికే కలుస్తుంది. యాజమాన్యం నుంచి బహమతులు మన దేశంలో ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉద్యోగులకు పలు సందర్భాల్లో బహమతులు ఇస్తుంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే బహుమతుల విలువ రూ.5,000 మించకపోతే, దానిపై పన్ను చెల్లించక్కర్లేదు. నగదు, గిఫ్ట్ వోచర్, ఈ–వోచర్, ప్రీపెయిడ్కార్డ్ ఇలా ఏ రూపంలో ఉన్నా, వాటి విలువ రూ.5,000 మించితే ఆ మొత్తం వేతన ఆదాయానికి కలిపి చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ‘‘ఒక ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం చెల్లించే అన్ని రకాల బహుమతుల విలువ రూ.5,000 మించితే అది పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది’’అని బీడీవో ఇండియా పార్ట్నర్ (ట్యాక్స్) ప్రీతి శర్మ తెలిపారు. ఎంత పన్ను చెల్లించాలి? ఆదాయపన్ను చట్టం ప్రకారం పన్ను మినహాయింపుల్లేని కేసుల్లో.. ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న కానుకల విలువను ఇతర ఆదాయం (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) కింద చూపించాల్సి ఉంటుంది. అంటే సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వారి మొత్తం ఆదాయానికి ఇది తోడవుతుంది. శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వారి ఆదాయం బేసిక్ పన్ను మినహాయింపు (పాత విధానంలో రూ.2.5 లక్షలు, కొత్త విధానంలో రూ.3 లక్షలు) పరిధిలోనే ఉండి, బహుమానం విలువ కలిపిన తర్వాత కూడా బేసిక్ పరిమితి దాటకపోతే.. అప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం రాదు. ఒక్కో బహుమతికి విడిగా రూ.50,000 పరిమితి వర్తించదని, ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న అన్ని బహుమతులకు (నిబంధనల మేరకు) రూ.50,000 పరిమితి వర్తిస్తుందని మనీఎడ్యుసూ్కల్ వ్యవస్థాపకుడు ఆర్ణవ్ పాండా తెలిపారు. – సాక్షి, బిజినెస్‌డెస్క్