కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..?
ఒట్టావా: కెనడా-భారత్ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. ఈ పరిణామం తర్వాత ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. ఇరు దేశాలు తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి.
అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను కూడా ఇరుదేశాలు జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. అయితే.. ఇంతటి చర్యలకు కారణం ఒక్క ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ హత్య కేసుపై ట్రూడో వ్యాఖ్యలు మాత్రమే కారణం కాదు. కొన్ని రోజులుగా ఇరుదేశాల మధ్య రగులుతున్న ఖలిస్థానీ వివాదం, ఇందిరా గాంధీ హత్యపై పోస్టర్లు.. హర్దిప్ సింగ్ హత్య కేసుతో చిలికి చిలికి గాలివానలా మారింది.
అమృత్ పాల్సింగ్తో మొదలు..
పంజాబ్లో ఖలిస్థానీ ప్రబోధకుడు అమృత్ పాల్సింగ్పై మార్చిలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారత దౌత్య కార్యాలయం ఎదుటు నిరసనకు దిగారు. దీంతో భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భారత దౌత్య అధికారుల భద్రత కెనడా ప్రభుత్వం చూసుకోవాలని కోరింది.
ఈ చర్యల తర్వాత కెనడాలోని బ్రాంప్టన్లో ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరిస్తూ ఖలిస్థానీ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. దీనిపై కెనడా ప్రభుత్వంపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఇలాంటి చర్యలకు మద్దతు తెలపరాదని దుయ్యబట్టారు. ఇండియా, కెనడా మధ్య సంబంధాలకు ఈ చర్యలు ఏమాత్రం మంచిది కాదని హితువు పలికారు.
హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య..
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారాలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. ఈ కేసుపై కెనడా ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలోనే నిజ్జర్ హత్యకు భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, కౌన్సిల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవలే కారణమని పేర్కొంటూ ఖలిస్థానీ మద్దతుదారులు ఆరోపించారు. భారత దౌత్య అధికారులే నిజ్జర్ హత్యకు కారణమని టొరెంటోలో జులై 8న నిర్వహించిన ర్యాలీలోని పాంప్లెట్లలో పేర్కొన్నారు. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
జీ20 సమ్మిట్..
ఆ సారి ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదం పెరుగుతుండటం పట్ల భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా ఆవాసంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వంటి అసాంఘీక శక్తులను అణిచివేయడంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
దీనికి స్పందించిన ట్రూడ్రో కెనడా భావవ్యక్తీకరణ స్వేచ్చను గౌరవిస్తుందని అన్నారు. శాంతికాముకమైన నిరసనలకు అనుమతి ఉంటుందని పేర్కొంటూ.. అల్లర్లను కూడా సహించబోమని స్పష్టం చేశారు. కొంతమంది చేసే చర్యలకు ఓ వర్గాన్ని మొత్తం ఆపాదించడం సరికాదని అన్నారు.
ఇదీ కాకుండా విమానం సాంకేతిక కారణాల వల్ల జీ20 మీటింగ్ అనంతరం కెనడా ప్రధాని ట్రూడో రెండు రోజులు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. భారత ప్రభుత్వం విమానం ఏర్పాట్లు చేసినప్పటికీ ఆయన ఉపయోగించుకోలేదు. దాదాపు 36 గంటలు ఢిల్లీలోనే ఉండి, సాంకేతిక సమస్యలు ముగిశాక కెనడాకు బయలుదేరారు. ఈ పరిణామాల అనంతరం గత సోమవారం నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని వివాదాస్పదంగా మాట్లాడారు. తమ పౌరుల పట్ల విదేశీ జోక్యం సహించబోమని మండిపడ్డారు. ఇలా.. అమృత్ పాల్ సింగ్తో మొదలైన వివాదం.. జీ20 సమ్మిట్ అనంతరం బయటపడింది.
ఇదీ చదవండి: Trudeau Avoids Media Questions: ఐరాస వేదికగా ఖలిస్థానీ ప్రశ్నలకు ట్రూడో ఎడముఖం