కొత్త ఎంపీలకు రెడ్ కార్పెట్ స్వాగతం
న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలకు ఘన స్వాగతం పలికేందుకు లోక్‌సభ సెక్రటేరియట్ అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నారు. కొత్త ఎంపీలకు అన్ని విధాలుగా సాయపడేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి. శ్రీధరన్ వెల్లడించారు. ఎన్నికైన అభ్యర్థులు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా చూస్తామని, ఇందిరాగాంధీ విమానాశ్రయంలోనూ ప్రత్యేకంగా ఆరు గైడ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇవి 16 నుంచి 21వ తేదీ వరకు పనిచేస్తాయని, 16వ లోక్‌సభ కొలువుదీరిన తర్వాత తొలి సమావేశాల సమయంలో మొదటి మూడు రోజులు కూడా ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని శ్రీధరన్ పేర్కొన్నారు. ఎంపీలకు పలు రాష్ట్రాల అతిథి గృహాల్లో వసతి ఏర్పాట్లు చేస్తున్నామని, నెల రోజుల్లో పాత ఎంపీలు తమ నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత వాటిని కొత్త వారికి కేటాయిస్తామని వివరించారు. కాగా, ఈ నెల 31తో ప్రస్తుత లోక్‌సభకు ఐదేళ్ల గడువు పూర్తవుతుందని, అందువల్ల ఆ లోగానే 16వ లోక్‌సభ భేటీ కావాల్సి ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.