అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకల్లో ఉగ్రవాద దాడులకు దిగొచ్చనే అంచనాల నేపథ్యంలో భద్రతా అధికారులు దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్ జారీచేశారు. విమానాశ్రయాల ద్వారా ఉగ్రవాదులు దేశంలోచొరబడి దాడులు నిర్వహించే ప్రమాదం ఉందనీ, అప్రమత్తంగా ఉండాలంటూ నిఘా సంస్థలు ముందస్తు హెచ్చరికలు చేశాయి.
ప్రధానంగా మిలిటెంట్స్ యూనిఫామ్ లో సంచరిస్తూ భద్రతా సిబ్బందిని మభ్యపెట్టి తప్పించుకునే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని భద్రతా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలలో భద్రతకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలంటూసివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (బీసీఎఎస్) డిసెంబర్ 28 న అలర్ట్ జారీ చేసింది.
అలాగే దేశంలో విమానాశ్రయాలభద్రతను పరిశీలించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) కూడా హెచ్చరికలు జారీ చేసింది. యూని ఫాంలో ఉన్న అనుమానితులను, పాస్ ఉన్నా కూడా జాగ్రత్తగా తనిఖీ చేయాలని ఆదేశించింది. సాధారణంగా పోలీసు లేదా సైనిక దుస్తుల్లో ఉన్నవారి పట్ల భద్రతా సిబ్బంది సాఫ్ట్ గా ఉంటారనీ...కానీ పూర్తి తనిఖీలు నిర్వహించాలంటూ అప్రమత్తం చేశారు. అలాగే, పారామిలిటరీ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రయాణికుల ప్రొఫైల్ ను గుర్తించడంలో శిక్షణ పొందిన "స్వీపింగ్ స్క్వాడ్" ఏర్పాటు చేసినట్టు సమాచారం.