వారికి ఒక దేశం దొరికింది!
కూచ్ బెహార్(పశ్చిమ బెంగాల్): దాదాపు ఏడు దశాబ్దాల పీడకల తొలగిపోయింది. తమకంటూ ఒక దేశం, మౌలిక సదుపాయాలు లేక అల్లాడిన 51వేల మందికి ఎట్టకేలకు ఒక దేశం, స్వేచ్ఛ దొరికాయి. భారత్, బంగ్లాదేశ్‌లు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన మరుక్షణమే చెరోవైపు కలిపి 162 భూభాగాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. భారత్ 17,160 ఎకరాల విస్తీర్ణమున్న 111 ప్రాంతాలను బంగ్లాకు అప్పగించగా, ఆ దేశం భారత్‌కు 7,110 ఎకరాల విస్తీర్ణమున్న 51 ప్రాంతాలను అప్పగించింది. బంగ్లా ఇచ్చిన ప్రాంతాల్లోని 14 వేల మంది భారతీయ పౌరులుగా మారగా, భారత్ అప్పగించిన ప్రాంతాల్లోని 37 వేల మంది బంగ్లా పౌరులయ్యారు.
దీంతో 1947 నాటి దేశ విభజన నుంచి కొనసాగుతున్న ఈ సంక్లిష్టమైన ‘దేశంలేని‘ వారి సమస్య పరిష్కారమైంది. వారికి ఇకపై స్కూళ్లు, ఆస్పత్రులు వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల ఇరు దేశాలు కుదుర్చుకున్న చారిత్రక భూ సరిహద్దు ఒప్పందం(ఎల్బీఏ) కింద ఈ మార్పిడి చేసుకున్నారు. ఒప్పందంపై ఈ ఏడాది జూన్ 6న ఢాకాలో భారత్, బంగ్లా ప్రధానులు నరేంద్ర మోదీ, షేక్ హసీనాల సమక్షంలో సంతకాలు జరిగాయి. భారత్‌కు అప్పగించిన భూభాగాలన్నీ పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలోనివే. బంగ్లాలోని భారత అధీన ప్రాంతాల్లో ఉండిన వారిలో దాదాపు వెయ్యిమంది మినహా మిగతా వారంతా బంగ్లా పౌరులు అయ్యారు.
మార్పిడి సందర్భంగా ఎలాంటి అధికార ఉత్సవాలూ జరగలేదు. అయితే శుక్రవారం అర్ధరాత్రి దాటగానే కూచ్ బెహార్‌లోని మధ్య మసల్దంగాలో జనం వీధుల్లోకి వచ్చి త్రివర్ణ పతాకాలు ఎగరేసి, జాతీయ గీతం ఆలపించి సంబరాలు జరుపుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ ఎన్క్లేవ్ ఎక్స్చేంజ్ కోఆర్డినేషన్ కమిటీ ఈ వేడుక నిర్వహించింది. ‘భారత్‌కు 1947లో స్వాతంత్య్రం వచ్చి ఉండొచ్చు. కానీ ఈ రోజు నుంచి మేం దేశ పౌరులం అయ్యాం కనుక మాకు ఇది రెండోస్వాతంత్య్రం. మమ్మల్ని ఇక భారతీయులు అంటారు’ అని 18 ఏళ్ల యువకుడు ఒకరు చెప్పారు. ఒక దేశవాసులైన ఈ ప్రజలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీటర్లో శుభాకాంక్షలు తెలిపారు. వారికి కొత్త గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. నిజానికి భూ సరిహద్దు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని 1974లో అనుకున్నారు. అయితే నాటి బంగ్లా ప్రధాని ముజిబుర్ 1975లో హత్యకు గురవడంతో అది నిలిచింది.
మార్పిడి ఇలా.. దేశాలు మారిన 51 వేల మందికి ఏ దేశంలో ఉండాలో నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పించారు. భారత రిజిస్ట్రార్ జనరల్, బంగ్లా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అధికారులు గత నెల 6-16 మధ్య వారి అభిప్రాయం తీసుకున్నారు. పౌరుల, భూభాగాల మార్పిడి, సరిహద్దు గుర్తింపు తదితర ప్రక్రియలు 2016 జూన్ నాటికి పూర్తవుతాయి. అంతవరకు ఆయా ప్రాంతాల్లో పొరుగు దేశం నుంచి వచ్చేవారికోసం చిన్నపాటి ఆవాసాలు కల్పిస్తారు. ఎల్ బీఏ వల్ల ప్రభావితమ్యే వారికి పునరావాసం కోసం భారత ప్రభుత్వం రూ. 3,048 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.