దులీప్ ట్రోఫీ విజేత ఇండియా రెడ్
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ సీజన్ ఆరంభ టోర్నీ దులీప్ ట్రోఫీని ఇండియా రెడ్ కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ ముగిసిన ఫైనల్లో ఆ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఇండియా గ్రీన్‌పై విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 345/6 తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రెడ్ 388 పరుగులకు ఆలౌటైంది. దీంతో 157 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నిం గ్స్‌కు దిగిన గ్రీన్‌ను ఆఫ్ స్పిన్నర్ అక్షయ్ వాఖరే (5/13) హడలెత్తించాడు. పేసర్ అవేశ్ ఖాన్ (3/38) కూడా ఓ చేయి వేయడంతో గ్రీన్ 39.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. సిద్దేశ్ లాడ్ (80 బంతుల్లో 42; 6 ఫోర్లు), హైదరాబాదీ బ్యా ట్స్‌మన్, ఓపెనర్ అక్షత్ రెడ్డి (47 బంతుల్లో 33; 7 ఫోర్లు) మాత్రమే కాస్త ప్రతిఘటన కనబర్చారు. అక్షయ్, అవేశ్ ధాటికి వీరిద్దరు కాక కెప్టెన్ ఫైజ్ ఫజల్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. స్పిన్నర్ మయాంక్ మార్కండే గాయంతో బ్యాటింగ్‌కు దిగలేదు. రెడ్ తరఫున భారీ శతకంతో అదరగొట్టిన ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (153)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 231;
ఇండియా రెడ్ తొలి ఇన్నింగ్స్: 388 (ఈశ్వరన్ 153; అంకిత్ రాజ్‌పుత్ 3/101, ధర్మేంద్ర జడేజా 3/93),
ఇండియా గ్రీన్ రెండో ఇన్నింగ్స్: 119 (అక్షత్ రెడ్డి 33; అక్షయ్ వాఖరే 5/13).