పోరాటమా... పరాజయమా!
లక్ష్యం సుదూరంలో ఉంది... విజయ తీరం చేర్చగల సామర్థ్యం ఉన్నవారిలో ముగ్గురు ఇప్పటికే బ్యాట్లు పడేశారు... ఒక బంతి ఛాతీ మీదకు దూసుకొస్తుంటే మరో బంతి అసలు పైకి లేవనంటూ పాదాల వైపు వచ్చి స్టార్ బ్యాట్స్మన్తోనే లుంగీ డ్యాన్స్ చేయించింది... బంతి బంతికీ సంకటం... ఒక్కో పరుగు కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తోంది... ఇదీ సెంచూరియన్ టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్ పరిస్థితి! మన బౌలర్ల అద్భుత ప్రదర్శన గత మ్యాచ్‌లాగే ఈ టెస్టులోనూ గెలుపు అవకాశాన్ని సృష్టిస్తే ఎంతో నమ్ముకున్న బ్యాటింగ్ వైఫల్యంతో మళ్లీ తొలి టెస్టు ఫలితమే పునరావృతమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. 23 ఓవర్లు ఆడితే వచ్చింది 35 పరుగులే... ఇంకా చేయాల్సింది 252 పరుగులు... ఓర్పునకు చిరునామాలాంటి పుజారా ఒకవైపు... శరీరంపై పడుతున్న పేసర్ల దెబ్బలను ఓర్చుకుంటూ పార్థివ్ మరోవైపు ప్రస్తుతం పోరాడుతున్నారు. వీరితో పాటు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఏదైనా మెరుపు బ్యాటింగ్‌తో మ్యాజిక్ చేయగలరా? లేక సఫారీ పేస్ చతుష్టయం దెబ్బకు కూలిపోయి మ్యాచ్‌ను, సిరీస్‌ను అప్పగిస్తారా అనేది నేటి చివరి రోజు ఆటలో చూడాలి.
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో విజయావకాశాన్ని సృష్టించుకున్న భారత జట్టు... బ్యాట్స్‌మెన్ పేలవ ఆటతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 287 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ మంగళవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. పుజారా (40 బంతుల్లో 11 బ్యాటింగ్; ఒక ఫోర్), పార్థివ్ పటేల్ (24 బంతుల్లో 5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉండగా... మురళీ విజయ్ (9), లోకేశ్ రాహుల్ (4), కెప్టెన్ విరాట్ కోహ్లి (5) పెవిలియన్ చేరారు. ఇక్కడి సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో ఛేదనలో వివిధ జట్ల రికార్డు, ప్రస్తుతం టీమిండియా పరిస్థితి, దక్షిణాఫ్రికా పదునైన బౌలింగ్ చూస్తుంటే ఒక్క రోజులో 252 పరుగులు చేసి గెలవడం కష్టసాధ్యంగా అనిపిస్తోంది! అలా కాకుండా 98 ఓవర్లు ఆడి ‘డ్రా’ చేయడం కూడా అంత సులువు కాదు.
ఈ నేపథ్యంలో చివరి రోజు భారత జట్టు ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరం. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది. డివిలియర్స్ (121 బంతుల్లో 80; 10 ఫోర్లు), డీన్ ఎల్గర్ (121 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో డు ప్లెసిస్ (141 బంతుల్లో 48; 4 ఫోర్లు) ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. భారత బౌలర్లలో షమీకి 4... బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి.
షమీ జోరు...
ఓవర్‌నైట్ స్కోరు 90/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి సెషన్లో చకచకా పరుగులు సాధించింది. డివిలియర్స్, ఎల్గర్ కలిసి బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా దూసుకుపోవడంతో పార్ట్నర్ షిప్ వంద పరుగులు దాటింది. ఈ క్రమంలో ఎల్గర్ 93 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ సమయంలో షమీ వేసిన ఏడు ఓవర్ల స్పెల్ సఫారీలకు అడ్డుకట్ట వేసింది. అనూహ్యంగా పైకి లేచిన బంతిని ఆడలేక డివిలియర్స్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది.
మరో ఏడు పరుగులకే పుల్ షాట్ ఆడబోయి ఎల్గర్ కూడా డీప్‌లో రాహుల్ చేతికి చిక్కాడు. షమీ వేసిన తర్వాతి ఓవర్లో డి కాక్ (12) ఆడిన మూడు వరుస బంతులు అదృష్టవశాత్తూ స్లిప్ మీదుగా బౌండరీకి వెళ్లాయి. కానీ నాలుగో బంతి నేరుగా పార్థివ్ చేతుల్లోకి వెళ్లడంతో 19 పరుగుల వ్యవధిలో దక్షిణాఫ్రికా మూడు కీలక వికెట్లు కోల్పోయినట్లయింది. లంచ్ తర్వాత ఫిలాండర్ (26) కొద్దిసేపు డు ప్లెసిస్‌కు అండగా నిలిచాడు. దాంతో స్కోరు 200 పరుగులు దాటింది. ఈ స్థితిలో ఇషాంత్ తన వరుస ఓవర్లలో ఫిలాండర్, కేశవ్ మహరాజ్ (6)లను వెనక్కి పంపాడు. షమీ బౌలింగ్‌లో రబడ (4) అవుట్ కాగా... బుమ్రా అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో ప్లెసిస్ పెవిలియన్ చేరాడు. ఇన్‌గిడి (1)ని అవుట్ చేసి అశ్విన్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగించాడు.
పదునైన బౌలింగ్...
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఏదీ కలిసి రాలేదు. నలుగురు దక్షిణాఫ్రికా పేసర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగుతుంటే ఒక్కో పరుగు తీయడానికి మన బ్యాట్స్‌మెన్ తీవ్రంగా శ్రమించారు. ఈ ఒత్తిడి చివరకు వికెట్లు కోల్పోయేలా చేసింది. రబడ అద్భుత బంతిని విజయ్ (9) వికెట్లపైకి ఆడుకోగా... ఇన్‌గిడి వేసిన బాల్‌ను రాహుల్ (4) నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి కొట్టాడు. అయితే భారత్‌కు అసలు షాక్ ఆ తర్వాత తగిలింది.
ఆఫ్‌స్టంప్‌పై పడి తక్కువ బౌన్స్‌తో లోపలికి దూసుకొచ్చిన బంతిని ఆడలేక కోహ్లి వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ అవుట్ నిర్ణయంపై అతి ఆశావాదంతో కోహ్లి రివ్యూ చేసినా లాభం లేకపోయింది. ఐదో స్థానంలో రోహిత్ శర్మకు బదులుగా పార్థివ్ క్రీజ్‌లోకి వచ్చాడు. సఫారీ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బంది పడినా, పట్టుదల ప్రదర్శించాడు. పుజారా 8 పరుగుల వద్ద ఉన్నప్పుడు బంతి బ్యాట్‌ను తాకి కీపర్ చేతుల్లో పడినా... దక్షిణాఫ్రికా దానిని గుర్తించకపోవడంతో అతను బతికిపోయాడు. చివరకు పుజారా, పార్థివ్ 7 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడి రోజును ముగించగలిగారు.
దక్షిణాఫ్రికా గడ్డపై ఏ జట్టు కూడా టెస్టు చివరి రోజు 250కు పైగాపరుగులు చేసి మ్యాచ్ గెలవలేదు. ఎప్పుడో 1900లో ఇంగ్లండ్ 214 పరుగులు చేసింది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 335; భారత్ తొలి ఇన్నింగ్స్ 307; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (ఎల్బీ) (బి) బుమ్రా 1; ఎల్గర్ (సి) రాహుల్ (బి) షమీ 61; ఆమ్లా (ఎల్బీ) (బి) బుమ్రా 1; డివిలియర్స్ (సి) పార్థివ్ (బి) షమీ 80; డు ప్లెసిస్ (సి అండ్ బి) బుమ్రా 48; డి కాక్ (సి) పార్థివ్ (బి) షమీ 12; ఫిలాండర్ (సి) విజయ్ (బి) ఇషాంత్ 26; మహరాజ్ (సి) పార్థివ్ (బి) ఇషాంత్ 6; రబడ (సి) కోహ్లి (బి) షమీ 4; మోర్కెల్ (నాటౌట్) 10; ఇన్‌గిడి (సి) విజయ్ (బి) అశ్విన్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (91.3 ఓవర్లలో ఆలౌట్) 258.
వికెట్ల పతనం: 1–1; 2–3; 3–144; 4–151; 5–163; 6–209; 7–215; 8–245; 9–245; 10–258.
బౌలింగ్: అశ్విన్ 29.3–6–78–1; బుమ్రా 20–3–70–3; ఇషాంత్ 17–3–40–2; షమీ 16–3–49–4; పాండ్యా 9–1–14–0.
భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (బి) రబడ 9; రాహుల్ (సి) మహరాజ్ (బి) ఇన్‌గిడి 4; పుజారా (బ్యాటింగ్) 11; కోహ్లి (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 5; పార్థివ్ (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (23 ఓవర్లలో 3 వికెట్లకు) 35.
వికెట్ల పతనం: 1–11; 2–16; 3–26.
బౌలింగ్: ఫిలాండర్ 6–3–6–0; రబడ 5–2–9–1; ఇన్‌గిడి 6–2–14–2; మోర్కెల్ 5–3–4–0; మహరాజ్ 1–0–1–0.
సిరీస్ నుంచి సాహా అవుట్
భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కండరాల గాయంతో దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం కారణం గానే రెండో టెస్టులో అతని స్థానంలో పార్థివ్ పటేల్ తుది జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు సాహా మూడో టెస్టు కూడా ఆడే అవకాశం లేదని తేలిపోయింది. అతని స్థానంలో మరో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ను బీసీసీఐ జట్టులోకి ఎంపిక చేసింది. ఇప్పటికే సఫారీలతో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపికైన కార్తీక్... రెండు వారాల ముందుగా దక్షిణాఫ్రికా బయల్దేరి వెళ్ళనున్నాడు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ బరిలోకి దిగి కార్తీక్‌కు సరిగ్గా ఎనిమిదేళ్లయింది! 23 టెస్టుల్లో 1000 పరుగులు చేసిన అతను 51 క్యాచ్‌లు పట్టి 5 స్టంపింగ్‌లు చేశాడు.